ప్రకతి ప్రకాష్ ఎందరికో ఆదర్శం : యాస్మిన్ బాషా
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమానికి సామాజిక సేవకుడు ప్రకతి ప్రకాష్ శ్రీకారం చుట్టడం ఎంతో గొప్ప విషయమని సంయుక్త కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రకతి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా చల్లని నీరు పంపిణీ కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న తరుణంలో ఎదుటి వారికి కూడా సాయం చేయాలనే భావనను ప్రకాష్ అందరికీ కల్పిస్తున్నారని అన్నారు. వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని తెలిపారు. వనజీవి రామయ్యని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో వేలసంఖ్యలో మొక్కలు నాటడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టడం సంతోషకరమన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో బస్సులో ప్రయాణించడం ఎంతో ఇబ్బందిగా ఉంటుందని చాలా సందర్భాల్లో గుక్కేడు నీటికోసం తరువాత స్టాప్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతుందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ప్రకాష్ ఆర్టీసీ బస్సులలో చల్లని నీటిని ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమన్నారు. ప్రకాష్ ఆలోచనకు సహకరించిన ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్, సిబ్బందిని సైతం ఆమె అభినందించారు. ప్రకతి ప్రకాష్ మాట్లాడుతూ చల్లని నీరు పంపిణీలో బాగంగా సిరిసిల్ల నుండి హైదరాబాద్, కరీంనగర్ వెళ్లే నాన్‌స్టాప్ బస్సులలో చల్లని నీటి బబుల్స్‌ని ఏర్పాటు చేయడం చేశామన్నారు. ప్రతి రోజు 32 చల్లని నీటి బబుల్స్‌ని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగిస్తున్నామని, అందుకోసం ప్రతి రోజూ రూ.640 వెచ్చిస్తున్నట్లు వేసవికాలం ముగిసే వరకు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల దాహాన్ని తీరుస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి చక్కని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన జెసి యాస్మిన్ బాషాకి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.