peruke mahila police stationlu, పేరుకే మహిళా పోలీస్‌స్టేషన్లు

పేరుకే మహిళా పోలీస్‌స్టేషన్లు

సమాజంలో రోజురోజుకు కుటుంబాల మధ్య వైరం పెరుగుతున్నాయి. కలసిమెలసి ఉండాల్సిన కుటుంబాలు మనస్పర్థలతో ఎడమొహం…పెడ మొహం పెడుతూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. గతంలో కొనసాగిన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాల పేరుతో విడిపోయి ఒకరికొకరు ఓదార్చుకునే పరిస్థితుల నుంచి ఒంటరై నా అనుకునే వాళ్లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మద్య ఏర్పడే చిన్నచిన్న అపార్థాలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్తితులను చక్కదిద్డడానికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖ భార్యాభర్తల మధ్య ఏర్పడే అంతరాలను, అపార్థాలను అర్థం చేయించుటకు కౌన్సిలింగ్‌తో చక్కబెట్టేందుకు మహిళా పోలీస్‌స్టేషన్లను నెలకొల్పారు. మొదట్లో మహిళా పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి సమస్యకు మూలం ఎక్కడ ఉందో గ్రహించి ఆ కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ద్వారా మెప్పించి, ఒప్పించి అనేక కాపురాలను నిలబెట్టగలిగారు. దీంతో ప్రజలకు, మహిళలకు మహిళా పోలీస్‌స్టేషన్లపై అపారనమ్మకం పెరిగింది. ఈ మధ్య కాలంలో మహిళా పోలీస్‌స్టేషన్లకు వస్తున్న బాదితుల నుంచి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఇరువురిని పిలిపించి తుతుమంత్రంగా వారితో మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారు. ఇరువర్గాలను నిల్చుబెట్టి కేసు పెట్టమంటారా…పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటారా…అని ఉచిత సలహాతో కౌన్సిలింగ్‌ ఇవ్వకుండా పెద్దమనుషుల మధ్య మాట్లాడుకోండని స్వయంగా పోలీసులే పెద్దమనుషుల పంచాయితీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికే బాధితులు పెద్దమనుషుల చుట్టూ తిరిగి పడరాని పాట్లు పడి ఆర్థికంగా నష్టపోయి ఉ ంటున్నారు. మళ్లీ పెద్దమనుషుల పంచాయితీ పేరుతో డబ్బు, మద్యం తదితర ఖర్చులు పెద్దమనుషుల పంచాయితీకి పెట్టలేక పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగక మా కర్మ ఇంతేనని నెత్తినోరు కొట్టుకుంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. అక్కడ…ఇక్కడ అనే తేడా లేకుండా చేతివాటం ముట్టనిదే ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు బోరున విలపిస్తున్నారు.

కౌన్సింగే సరైన మార్గం అంటున్న విశ్లేషకులు

ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఫిర్యాదులు అందిన వెంటనే ముందుగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పూర్తిగా చదివి అర్థం చేసుకుని అందులో వారు చెప్పిన విషయాలను, సమస్యలను గ్రహించి ఆ తరువాత రెండు కుటుంబాల వారిని పిలిపించి వారితో నేరుగా మాట్లాడి వారు చెప్పిన మాటల్లో కల్పితాలను, వాస్తవాలను గ్రహించాలన్నారు. అనంతంర భార్యాభర్తలను పిలిపించి విడివిడిగా వారితో మాట్లాడాలి. తరువాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని పోలీసులు నోట్‌ చేసుకోవాలి. చివరగా వారిద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా అసలు సమస్య ఎక్కడ మొదలైంది అనే దగ్గర నుంచి వారికి కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఎదురవుతుంది…ఎందుకు ఎదురవుతుంది…ఎలా అవుతుంది అనే కోణంలో దర్యాప్తు జరగాలి. ఆ తరువాత ఏం చేస్తే వారు కలసి ఉంటారు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పోలీసులే స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా పండంటి కాపురాలు పచ్చగా పదికాలాలపాటు వర్థిల్లుతాయని సామాజిక విశ్లేషకులు, సైకాలజిస్టులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇలా చేస్తారని ఆశిద్ధాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!