అబద్దాలకు హద్దు లేదు?..మాటలకు పొంతన లేదు!?

`అసలు జనసేన ఎందుకు పుట్టింది?

`ఎవరి కోసం పుట్టింది!

`ఎలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటోంది!

`అసలు సిద్దాంతం ఏమిటి?

`చేయాల్సిన రాద్దాంతం ఏమిటి?

`ఆవిర్భావ సభ ఎవరికి భరోసా కల్పించింది?

`కొత్త తరం నాయకత్వానికి ఏమి హామీ ఇచ్చింది?

`గంటకు పైగా సాగిన ఉపన్యాసంలో చెప్పిందేమిటి?

`గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన వుందా?

`కనీసం అప్పటి మాటలకు, ఇప్పటి మాటలు కొంచైనా సింక్‌ అవుతున్నాయా?

`దేవుని హారతితో తన తండ్రి సిగరెట్‌ వెలిగించుకునే వారు అని చెప్పిందే పవన్‌!

`మా ఇంట్లో ఎప్పుడూ రామ నామ జపం వినిపిస్తూనే వుండేది అంటున్నది పవనే!

`తొలిప్రేమ సినిమా తర్వాత కంప్యూటర్‌ కోర్స్‌ చెన్నై లో నేర్చుకున్నాన్నది పవనే!

`పరీక్ష రాసి రావడం వల్ల లేటైతే ఇంట్లో కంగారు పడ్డారని చెప్పింది ఆయనే.

`పదకొండేళ్ల ప్రస్థానం గురించి పక్కన పెట్టి తన బాల్య స్మృతులు చెప్పడమేమిటి?

`అసలు జన సేన లక్ష్యాలేమిటి?

`జనసేన అధికారంలోకి ఎప్పుడు వస్తుంది?

`జనసేన వల్ల ఏపికి ఏం లాభం చేకూరింది?

`పార్టీ కోసం కష్టపడుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?

`అవన్నీ వదిలేసి చెప్పిన మాటలేమిటి?

`జనసేన సభలో పవన్‌ చెప్పాల్సిన మాటలేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నోరు తెరిస్తే అబద్దమే..మాట మాట్లాడితే అబద్దమే..చెప్పిందంతా అబద్దమే..చెబుతున్నదంతా అబద్దమే..చెప్పేదేమున్నా అదీ అబద్దమే…ఈ మాటలు ఎవరి గురించో అనుకుంటున్నారా? జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ గురించి ఏపిలోని వివిధ రాజకీయా పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఆది నుంచి ఆయన చెబుతున్న గతం తాలూకు మాటలకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనలేదంటున్నారు. పైగా నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించిన ఘనత జనసేనదే అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు కొంత పొగరాజేశారు. పిఠాపురంలో పవన్‌ గెలుపుకు తామే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు తోడు పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వాతావణంలో వేడిని పెంచాయి. తెలుగుదేశం శ్రేణుల నుంచి జనసేన మీద తీవ్ర నిరసనలు వెలువడ్డాయి. ఇదిలా వుంటే ప్రతి సారి పవన్‌ తన వ్యక్తిగత జీవితంలోని అంశాలు ఉటంకించడం పరిపాటిగా మారింది. అయితే ఒకటే విషయాన్ని పదే పదే చెబితే బాగుండదనుకుంటారో..లేక గతంలో చెప్పిన అంశాన్ని మర్చిపోతుంటారో గాని ఎప్పుడూ ఏదో ఒక కొత్త లెక్క చెబుతుంటారు. కాని గతంలోనే చెప్పిన విషయాన్నే మరోలా చెబుతుంటారు. ఇక్కడే అందరూ పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా తాను చెన్నైలో వివక్షను ఎదుర్కొన్నానంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం నెలకొన్నది. చిరంజీవి సినీ స్టార్‌గా ఎదిగింది చెన్నైలోనే. ఆయన తన జీవితంలో ఎక్కువ సినీ కాలం గడిపింది చెన్నైలోనే..అన్నతోనే వుంటూ పవన్‌ కూడా చెన్నైలోనే వున్నారు. కాని ఇప్పుడు చెన్నైలో తాను వివక్షను ఎదుర్కొన్నారని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీ వార్షికోత్సవ సభలో సుమారు 90 నిమిషాల పాటు ప్రసంగించిన పవన్‌ కళ్యాణ్‌ తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. గతంలో ఆయన నెల్లూరుతోపాటు, అనేక పట్టణాల్లో తన చదవు సాగిందంటూ చెప్పేవారు. చెన్నైలోనూ చదువుకున్నాననేవారు. ఏది నమ్మాలో ఇప్పటికీ ఎవరికీ అర్దం కాకుండాపోయింది. పైగా ఓసారి తెలుగు అంటారు. మరో సారి ఇంగ్లీష్‌ అంటారు. బోటనీ అంటారు..ఇలా ఆయనకు అప్పటికప్పుడు ఏది గుర్తుకు వస్తే అదే చదివినట్లు లెక్క అన్న ధోరణిలో చెబుతుంటారు. పదే పదే ఇలాంటి అంశాలలో చెప్పిన ప్రతీసారి కొత్తదనం కోసం కథలు చెప్పినట్లు తన బాల్యం గురించి చెబుతారు. ఇక తాను చెన్నైలో కంప్యూటర్‌ కోర్సు చదవిన సమయంలో అంటూ పిఠాపురంలో కొత్త కథ చెప్పారు. అప్పటికే తాను నాలుగు సినిమాలు చేసిన హీరోనైనా సరే తాను బైటకు వెళ్తే ఇంటికి వచ్చేవరకు భయపడేవారంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు చెన్నైలో వుండగా జరిగిందని ఒక సంఘటన చెప్పిన మరుక్షణమే సికింద్రాబాద్‌లోని సంగీత్‌ ధియేటర్‌ సంగతి చెప్పారు. జనం ఏది నమ్మాలో..ఏది నమ్మకూడదో కూడా అర్దం కాకుండా రాసుకొచ్చుకొని మరీ చెబుతుంటారు. పవన్‌ కల్యాన్‌ తన తండ్రి గురించి గతంలో చెబుతూ ఆయన కమ్యూనిస్టు వాది ఆయన నాస్తికుడు అని చెప్పారు. వాళ్ల నానమ్మ దేవుడికి హారతి ఇస్తే దానితో సిగరెట్‌ వెలిగించుకునేవారు అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణే చెప్పారు. ఇప్పుడు మళ్లీ మా కుటుంబంలో నా చిన్న నాటినుంచి ఇంట్లో రామనామం వినిపిస్తూనేవుండేదంటారు. తన తండ్రి రామభక్తుడని పిఠాపురం సాక్షిగా చెప్పుకొచ్చారు. తాను నాస్తికవాదినంటూ పవన్‌ కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. పైగా తాను బాప్టిజం తీసుకున్నానని కూడా ఆయనే చెప్పారు. తన పిల్లలకు కూడా బాప్టిజం తీసుకున్నానని గతంలో చెప్పారు. పిఠాపురం సాక్షిగా తాను 14వ ఏటనే పూజలు చేసేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి తాను కృషిని మాత్రమే నమ్ముతానని ఏ దేవుడిని నమ్మనంటూ వ్యాఖ్యానించారు. మరో సోదరుడు నాగబాబు తాను ఏ దేవుడిని నమ్మనంటూ కూడా ఆయన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. మరి పవన్‌ మాత్రం మా ఇంట్లో సనాతనధర్మానికి ఎంతో విలువిస్తామంటూ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మమే లేకుంటే మన వ్యవస్ధ చిన్నాభిన్నమయ్యేదంటూ కొత్త కొత్త భాష్యాలు చెప్పారు. ఇవన్నీ విన్న జనసైనికులకు కూడా అసలు సభ ముఖ్య ఉద్దేశ్యమేమిటి? పవన్‌ కళ్యాన్‌ మాట్లాడుతున్నదేమిటని ముక్కున వేలేసుకున్నారు. ఇలా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కూడా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశ్యమేమిటి? దాని విధానాలేమిటి? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పటి వరకు సాధించిందేమిటి? ఇంకా సాధించాల్సిందేమిటి? జనసేన ఎలా ముందుకు సాగాలి? ఎప్పుడు అధికారంలోకి రావాలి? పార్టీ నిర్మాణం ఎలా సాగాలి? ఎంత మంది సభ్యులున్న పార్టీగా చరిత్ర సృష్టించాలి. ప్రాంతీయ పార్టీగా వుండాలా? జాతీయ పార్టీగా ఎదగాలా? అందుకు నాయకులు ఏంచేయాలి? కార్యకర్తలు ఏం చేయాలి? పార్టీ నిర్మాణంలో ఎవరెవరు? ఎలాంటి పాత్ర పోషించాలి. కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకోసం కేటాయిస్తే వారి భవిష్యతేమిటి? రాజకీయంగా వారికి ఎలాంటి పదవులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? కూటమిలో చేరి ప్రజలకు ఇచ్చిన హమీల సంగతి ఏమిటి? వాటి అమలు తీరేమిటి? ఆరు గ్యారెంటీల ప్రస్తావనేది? వాటి అమలులో అవరోదాలు ఎందుకు ఎదురౌతున్నాయి? ఎప్పటి వరకు వాటిని పూర్తి చేసే అవకాశం వుంది? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు జనసేను సంబంధం వుందా? లేదా? ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వంలో వుండి ప్రశ్నిస్తారా? లేక అమలు కాకుండా ఎదిరిస్తారా? వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా? లేదా మరో 15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు అని చెప్పిన మాటలకు కట్టుబడి వుంటారా? 2014 ఎన్నికల ముందు కలిసి సాగిన కూటమిలో లుకలుకలు వచ్చినట్లు వస్తాయా? రాకుండా చూసుకుంటానని హమీ ఇస్తారా? ఇలాంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాని నలభై ఏళ్లు తెలుగుదేశం పార్టీని గెలిపించామని చెప్పి తన వల్లే కూటమి విజయం సాధించిందని పరోక్షంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూటమి మధ్యలో చిచ్చు రాజేసేందుకు కారణమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. అయినా 2019 ఎన్నికల్లో 175 సీట్లకు జన సేనపోటీ చేస్తే గెలిచింది ఒక్కటి. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత జనసేనలో లేడు. పవన్‌ కళ్యాన్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎవరు గెలవాలో..ఏ పార్టీని ఓడిరచాలో నిర్ణయం చేసేది ప్రజలు. కాని నాయకులు కలలు కంటుంటారు. ఎల్లకాలం మేమే వుంటామన్న భ్రమల్లో బతుకుతుంటారు. కాని ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాక్టికల్‌గా వుంటారు. గెలుపోటములు దైవాదీనాలంటూ చెబుతారు. కాని పవన్‌ కల్యాన్‌ అందుకు భిన్నంగా చెబుతుండడంతో జనం నవ్వుకుంటున్నారు. అసలు జనసేన పోటీ చేసిందే 21. కాకపోతే మొత్తం సీట్లు గెలిచారు. 150 సీట్లలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ విజయం సామాన్యమైంది కాదు. 135 సీట్లు గెల్చుకున్నది. ఆ గెలుపు కింద జనసేన గెలుపు అన్నది చాలా చిన్న విషయం. ఇకపోతే పిఠాపురంలో తన గెలుపుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మతోపాటు ఆయన కుమారుడు వర్మ పాత్ర వుందని కొనియాడారు. వర్మ చేత ఆశీస్సులు తీసుకున్నారు. కాని ఇప్పుడు పరోక్షంగా వర్మ లాంటి వాళ్లు అలా అనుకుంటే తమ ఖర్మ అన్నట్లు నాగబాబు అన్నారు. ఇదిలా వుంటే జాతీయ మీడియా పవన్‌ పై రాసిన ఆర్టికల్స్‌పై వివరణ ఇచ్చుకునే క్రమంలో తాను ఏం చెబుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైట్‌ నుంచి లెఫ్ట్‌కు, లెఫ్ట్‌ నుంచి సెంటర్‌కు అంటూ ఓ దినపత్రికలోవచ్చిన కధనంపై రకరకాల బాష్యాలు చెప్పారు. అలా మారాల్సిన పరిస్దితులు వచ్చాయని చెప్పుకున్నారు. చెగువేరా ఒక డాక్టర్‌గా మాత్రమే తెలుసని, ఆయన చేసిన సేవలు మాత్రమే తనకు తెలుసంటూ కొత్త లెక్కలు చెప్పడంతో అందరూ నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది జనసేన అనే వ్యాఖ్యలతో టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయితీ ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!