ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తన క్యాబినెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో తనతోపాటు మంత్రివర్గంలో పనిచేసిన వారిని కొనసాగించేందుకే మొగ్గుచూపిన మోడీ దాదాపు అందరికి బెర్త్ ఖాయం చేశారు. స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, పీయుష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్‌రిజు, రామ్‌దాస్ అక్‌పాలే గతంలో మంత్రివర్గంలో కొనసాగిన వారే. ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని పిఎంఓ నుంచి ఫోన్‌కాల్ అందుకున్న వారిలో సాధ్వినిరంజన్ జ్యోతి, జితేంద్రసింగ్, ప్రహ్లాద్‌జోషి, సంతోష్ గంగవార్, రావు ఇంద్రజిత్ సింగ్, రాజ్యసభ ఎంపి మన్‌సుఖ్ మండ్‌వియా, అర్జున్ మేఘ్‌వాల్, పరుషోత్తం రూపాల, రమేష్ పోక్రియాల్ నిషాంత్, బాబూల్ సుప్రియో, సదానంద గౌడ్, జి.కిషన్‌రెడ్డి, కిషన్‌పాల్ గుజ్జార్, నిత్యానంద రాయ్, సురేష్ అంగాడి, హర్‌సిమ్రాత్ బాదల్ ఉన్నారు.
మోడీ కొలువులో కొత్త ముఖాలు
నరేంద్రమోడీ మంత్రివర్గంలో 12మంది కొత్తవారికి ఈసారి అవకాశం దక్కింది. సురేష్ అంగాడి, కిషన్‌రెడ్డి, ప్రహ్లాద్ పటేల్, రవీంద్రనాథ్, కిషన్‌పాల్ గుజ్జార్, కైలాష్‌చౌదరి, ఆర్‌సిపి సింగ్, నిత్యానంద్ రామ్, దేబశీష్ చౌదరి, రామేశ్వర్ తెలి, సోంప్రకాష్, అర్జున్‌మండా మంత్రి పదవులను దక్కించుకున్నారు.
కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి
తెలంగాణ నుంచి మోడీ కొలువులో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి చోటు దక్కించుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన తెలంగాణలో బిజెపికి ఉన్న ఎంపీలలో ఆయన సీనియర్ నేత. బిజెపి పార్టీకి బద్దుడిగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరున్న కిషన్‌రెడ్డి జనతా పార్టీ ప్రారంభం నుంచి అందులో కొనసాగుతున్నారు. మూడుపర్యాయాలు అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన కిషన్‌రెడ్డికి తెలంగాణలో బిజెపి పార్టీని బలపరిచే దిశగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. వ్యూహాత్మకంగానే బిజెపి ఆయనకు మంత్రి పదవిని అప్పగించింది.