పార్లమెంట్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
-వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్
వరంగల్ క్రైం, నేటిధాత్రి : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సుమారు ఐదువేల మంది పోలీసులను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. ఈనెల 11వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగబోయే ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్‌తోపాటు పాక్షికంగా వున్న మహబూబాబాద్, కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ప్యూహత్మకమైన ప్రణాళికను రూపోందించామని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2127పోలింగ్ కేంద్రాలు 1053 ప్రాంతాల్లో వున్నాయని, అందులో 246 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లుగా గుర్తించామన్నారు. ఈ మొత్తం పోలింగ్ కేంద్రాలు 234మార్గాల్లో ఏర్పాటు చేయబడ్డాయని, ఇందుకు సంబంధించి పోలీస్‌శాఖ తరుపున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన నాటి నుండే నియోజకవర్గం వారిగా స్టాటిక్ సర్వేలేన్స్ ప్లయింగ్ స్క్వాడ్ బందాలు గత రెండు నెలలకాలంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ బందాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపణీ చేసే డబ్బు, మద్యంతో చట్ట వ్యతిరేకమైన అయుధాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా గత రెండునెలల నుండి 8 సంఘటనల్లో 58,29,860రూపాయల డబ్బును సీజ్ చేయడంతోపాటు, 1523 కేసుల్లో 9302మందిని బైండోవర్ చేశామని చెప్పారు. ఇందులో రౌడీ షీటర్లు, బెల్టుషాపు నిర్వాహకులు, అనుమానితులతోపాటు గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన వారు వున్నారని, అధేవిధంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న 143తుపాకులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్ చేయగా, మరో 79 తుపాకులు బ్యాంక్ సెక్యూరిటీగార్డుల వద్ద వున్నాయని, రెండునెలల నుండి పెండింగ్‌లో వున్న 133 నాన్-బెయిల్‌బుల్ వారెంట్లలోని నిందితులను కోర్టుకు హాజరుపర్చామని అన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్‌కు సంబంధించి 74 కేసులు నమోదు చేయడంతోపాటు, 3,31,695రూపాయల విలువ గల 1144లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నేరస్థుల నియంత్రణలో భాగంగా పోలీస్ మిషనరేట్ పరిధిలో మొత్తం 58మంది నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేయబడ్డాయని, ఇక ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 10కేసులు నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఎన్నికల బందోబస్తుకు సంబంధించి తొలిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, ఎన్నికల బందోబస్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ సిబ్బందితోపాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ఓటరు తమ హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని, అలాగే ఎవరైనా ఎన్నికలకు ఆటంకంపర్చడం గానీ, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్టయితే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్ నమోదుచేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
……………………………………………….