
నడికూడ నేటి ధాత్రి:
నల్ల బెల్లం,పటికను ఒక వ్యక్తి తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పరకాల ఏసిపి కిషోర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రూట్ వాచ్ లో భాగంగా నడికూడ మండల కేంద్రంలో సోమవారం రాత్రి పరకాల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పద మారుతి 800 కారు పోలీసు వాహనాన్ని ఓవర్‌టెక్ చేసి పారిపోతుండగా పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని పక్కకు ఆపి డ్రైవర్ పారిపోవడం జరిగిందని తెలిపారు. వెంటనే పంచులను పిలిపించుకొని వారి సమక్షంలో కారును పరిశీలించగా (ఏపీ 28 క్యూ 6556) కారులో 10 క్వింటాళ్ల నల్లబెల్లం, 10కేజీల పటిక తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ దాదాపు 53000 రూ.లు ఉంటుందని, కారుతో పాటు పై సరుకులు స్వాధీనం చేసుకొని పరకాల పోలీస్ స్టేషన్ లో భద్రపరిచినట్లు తెలిపారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నామని నిందితుడిని త్వరలో పట్టుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు.