పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి
సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె ఆధునాతన గ్రంథాలయం, జెపి నగర్ పార్కు, వెంకంపేటలోని మహిళా కమ్యూనిటీ హాలు, రజక కమ్యూనిటీ భవనం, తారకరామానగర్, కొత్త చెరువు బండ్, పార్కులను అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఆయా ఏజెన్సీ, ఇంజనీర్లను ఆదేశించారు. అదేవిధంగా రగుడులో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టిపి), డిఆర్‌సి షెడ్‌లను, కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మురికి నీటిశుద్ది ప్లాంట్‌లను త్వరితంగా వాడుకలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది, సుందరీకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం, నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేని యెడల శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.