పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పాకాల ఆయకట్టు కింద వరి పంట సాగు చేసుకోగా పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఖానాపురం ఎంపిపి, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపెల్లి రవీందర్రావు అన్నారు. పాకాల చెరువు ఆయకట్టు కొత్తూరు గ్రామ శివారులోని తుంగబంధం కాలువ కింద రైతులు రబీలో వరి పంటను సాగు చేసుకున్న పంటలు ఎండిపోగా రవీంద్ రావు బందం శుక్రవారం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకుదెరువు కోసం పంటలు సాగు చేస్తే రైతులకు కష్టాలపాలవుతున్నారని తెలిపారు. పాఖాల చివరి ఆయకట్టుకు నీరందించడంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు వైఫల్యం చెందారని, కింది ఆయకట్టులో వందలాది ఎకరాలల్లో పొలాలు పొట్ట దశలో ఎండిపోగా, కొత్తూరు గ్రామ శివారులో ఎండిన పొలాలను పరిశీలించి, తక్షణమే అధికారులతో పంట సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు, రైతులు నరసింహ, రాజు, బావుసింగ్, అశోక్, రాజేందర్లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.