వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు
ఉపాధి కోసం తాటి ముంజల వ్యాపారం
ప్రయోజనాలతో పాటు రుచిని ఆస్వాదించండి
అంతర్గాం గీతా కార్మికులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
కాలానుగుణంగా వేసవిలో దొరికే తాటి ముంజలను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు.సోమవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి గౌడ సామాజిక వర్గానికి చెందిన కైలాసం,సది అనే ఇరువురు తాటి ముంజలు వ్యాపారం చేస్తూ జిల్లా కేంద్రంలో నేటి ధాత్రి కెమెరాకి కనిపించారు.ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు వేసవిలో లభిస్తాయన్నారు.తాటి ముంజలు ఎంతో ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు,పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నారు.గీతా కార్మికులైన వారు ఇరువురు పల్లెటూరు నుండి పట్టణ ప్రజల అందుబాటులోకి ముంజలను తీసుకువచ్చి అమ్ముతూ
ఉపాధి పొందుతున్నామన్నారు.తాటి ముంజల యొక్క ప్రయోజనాలను వారి మాటల్లో వివరించారు.తాటి ముంజలలో వేసవి వేడిలో శరీరానికి కావలసిన ఏ,బి,సి విటమిన్లు, ఐరన్,జింక్,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయని నిపుణులు చెబుతుంటారని చెప్పారు.తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని,కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని, అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయని వైద్యులు చెబుతుంటే విన్నామని తెలిపారు.