`ఏమో గుర్రమెగరా వచ్చు?
`ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డితో మొదలు!
`అంతకు ముందు ప్రజా సమస్యల కోసం కొన్ని సార్లు పాదయాత్ర చేసేవారు!
`ఎక్కువగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేసే వారు.
`ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలున్నాయి.
`పాదయాత్రలకు ఖర్చు లేదు.
`యాత్ర చేసే నాయకుడు ఖర్చు చేయాల్సిన పని లేదు.
`రూపాయి లేకుండా పబ్లిసిటీ.
`ఊరూర జనాదరణకు కొదువలేదు.
`ఆశావహులే ఖర్చు చూసుకుంటారు.
`అంతిమంగా పాదయాత్ర చేసిన వారికి అధికారం వస్తుంది.
`అందుకే అధికారం కోసం నడక తప్పదనుకున్నారు.
`రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి సిఎం అయ్యారు.
`తర్వాత కాలంలో చంద్రబాబు అధికారం కోసం నడక తప్పదనుకున్నారు.
`ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ పాదయాత్ర దారి చూపారు.
`ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు చేశారు.
`అన్న జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేశారు.
`తర్వాత తెలంగాణలో తన పార్టీ కోసం షర్మిల చేశారు.
`వచ్చే రోజుల్లో ఏపిలో కాంగ్రెస్ కోసం ఎవరు చేస్తారో చూడాలి.
`రాష్ట్రం విడిపోయాక జగన్ చేశారు.
`గత ఎన్నికల ముందు లోకేష్ యువగళమన్నారు.
`తెలంగాణలో బండి సంజయ్ చేశారు.
`ఒక దశలో సిఎం. రేవంత్ రెడ్డి కూడా చేశారు.
`మరోవైపు రేవంత్ కు పోటీగా మంత్రి మల్లు భట్టి విక్రమార్క చేశారు.
`ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు.
`ఈ పాదయాత్ర ఎవరి కొంప ముంచుతుందో చూడాలి.
`పాదయాత్ర వల్ల ప్రజల్లోకి వెళ్లే దారి మహేష్ కుమార్ గౌడ్ కు తెలిసింది.
`ఇదేదో బాగుందని మహేష్ గౌడ్ తాను చేస్తానంటున్నారు.
`వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించి బీసీని సీఎం చేస్తామంటున్నారు.
`పరోక్షంగా నేనే సీఎం అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పకనే చెబుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి: రోజూ ఓ గంట నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇది సైన్స్ సూత్రం. ఓ నాయకుడు ప్రజల కోసం నడిస్తే పదవి వస్తుంది. ఇది రాజకీయ సూత్రం. ఈ సూత్రం అనుసరించిన వారు చాలా మంది సక్సెస్ అయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రులయ్యారు. దేశం కోసం పాదయాత్రచేసిన మహాత్మగాందీ స్వాతంత్య్రమే తెచ్చారు. రాజకీయాల్లో పాదయాత్ర సర్వరోగ నివారణగా మారిపోయింది. గతంలో పదవులు పొంది ఓడిపోయిన వారైనా సరే, పాదయాత్రలు చేసి మళ్లీ నాయకులైన వారున్నారు. మళ్లీ అదే ప్రజలతో గెలిచిన వారున్నారు. ముఖ్యమంత్రులై రాష్ట్రాలను పాలించిన వారు. ఇదీ పాదయాత్రల గొప్పదనం. నడిస్తే ఆరోగ్యమే కాదు, అదికారం కూడా వస్తుందని నిరూపించారు. అందుకే అందరూ ఆ బాట పడుతున్నారు. నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు, గౌరవం కూడా పాదయాత్రలు తెచ్చిపెడుతున్నాయి. తెలియని ప్రజలకు కూడా పాదయాత్ర పరిచేస్తున్నారు. మొత్తంగా అధికారానికి నాయకులను దగ్గర చేస్తున్నాయి. ఒక వేళ పాదయాత్ర వల్ల అధికారం రాకపోయినా, సరే ఆరోగ్యం మాత్రం దొరుకుతుంది. ప్రజల్లో నాయకత్వ గుర్తింపు కూడా బాగానే వస్తుంది. బలమైన నాయకుడు అయ్యేందుకు దారులు వేస్తుంది. ఇప్పుడు తెలంగాణలోనూ కొత్త పాదయాత్రలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పాదయాత్రలు జరిగే అవకాశం కూడావుంది. రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ పరిపాలన ఎలా వుందన్న సంగతి తెలుసుకోవడంతోపాటు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ఇంకా ప్రజలకు ఏం అందాల్సి వుంది. ప్రజల్లో ప్రభుత్వంపై అభిప్రాయం ఎలా వుంది. సిఎం. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇలాంటి అనేక విషయాలు ప్రత్యక్ష్యంగా తెలుసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర పార్టీపరంగా సాగుతున్న నేపధ్యంలో పిపిసి. అద్యక్షుడు కూడా మీనాక్షి నటరాజన్‌తో కలిసి నడవాల్సి వస్తోంది. అసలైన ట్విస్టు ఇక్కడే వుండి. ఎలాగూ తాను మీనాక్షి నటరాజన్‌తో నడవాల్సి వస్తోంది. కాని పేరు మాత్రం మీనాక్షినటరాజన్ పాదయాత్రగానే మారుతోంది. అందుకని మీనాక్షి నటరాజన్‌తో కాకుండా పిపిసి. అధ్యక్షుడిగా తను ప్రత్యేక పాదయాత్ర చేపడితే, పేరుకు పేరు వస్తుంది. అధిష్టానం దృష్టిలో పడినట్లైవుంది. వచ్చే ఎన్నికల్లో బిసి ముఖ్యమంత్రి నినాదం మరింత జనంలోకి తీసుకెళ్లే అవకాశం వుటుంది. అప్పుడు తానే సిఎం. అభ్యర్ధిగా ప్రజల ముందుకు వెళ్లి పాదయాత్ర చేస్తే అధిష్టానం అండ తనకు దక్కుతుందని మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటున్నట్లు వుంది. అందుకే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సంకేతాలను పంపించినట్లు కనిపిస్తోంది. ఈ దఫా తర్వాత వచ్చే బిసి సిఎం. అవుతారని మహేష్‌కుమార్ గౌడ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా తను పాదయాత్ర చేస్తానని కూడా చెబుతున్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు. అంటే పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో తానే క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం దక్కుతుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే సిఎం. అయ్యేందుకు దారులు వేసుకున్నట్లైవుంది. ఇది మహేష్‌కుమార్ గౌడ్ ఆలోచన అనేది తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్రల వెనుక ఎప్పుడైనా సరే అధికారమే దాగి వుంది. 1978లో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే అయిన వైఎస్. రాజశేఖరరెడ్డి అతి కొద్ది సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి పిపిసి అయ్యారు. అంత చిన్న వయసులోనే పిపిసి. అయిన తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా ఇక తానేసిఎం. అన్నంత నమ్మకం ఏర్పడిరది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాని ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండాపోయింది. తర్వాత 1994లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 1995లో చంద్రబాబు నాయుడు సిఎం.అయ్యారు. ఇక అప్పటి నుంచి వైఎస్ఆర్కు ముఖ్యమంత్రి కావాలన్న కసి మరింత పెరిగింది. 1999 ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీచేశారు. కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అప్పటికే రెండోసారి పిపిసి. అధ్యక్షుడయ్యారు. కాని 1999 ఎన్నికల్లో మళ్లీ రెండోసారి తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు రెండోసారి సిఎం. అయ్యారు. నిజానికి 1999లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కాని అనూహ్యంగా రెండుసార్లు చంద్రబాబు సిఎం. అయ్యే చాన్స్ కొట్టేశారు. ఇక ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్దితి మరీ అద్వాహ్నంగా తయారౌతోంది. దేశంలో కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేస్తా అంటూ చంద్రబాబు శపథాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఎలాగైనా తాను సిఎం. కావాలన్నా, కాంగ్రెస్ గెలవాలన్నా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటే తప్ప సాధ్యం కాదనుకున్న వైఎస్. పాదయాత్ర మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ను 2004లో అధికారంలోకి తెచ్చారు. అలా పదేళ్లపాటు 2014 కాంగ్రెస్ అధికారంలో వుంది. రెండోసారి కాంగ్రెస్‌ను 2009 అదికారంలోకి తెచ్చిన వైఎస్ అకాల మరణం చెందారు. ఆ సమయంలో ఓ వైపు తెలంగాణ ఉద్యమం సాగుతోంది. మరో వైపు చంద్రబాబు పాదయాత్ర చేశారు. 2014లో ఏపిలో చంద్రబాబు సిఎం. అయ్యారు. తర్వాత కొంత కాలానికి వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఆయన కూడా సిఎం. అయ్యారు. 2014లో అందరూ జగనే సిఎం అనుకున్నారు. కాని జనం అప్పుడు జగన్‌ను కోరుకోలేదు. తర్వాత పాదయాత్ర చేశారు. సిఎం. అయ్యారు. జగన్ పరిపాలిస్తున్న కాలంలోనే 2021లో మంత్రి లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టారు. యువగళం పేరుతో ఆయన రాష్ట్రమంతా చుట్టేశారు. 2023 ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తెచ్చారు. కాకపోతే తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనతలో ఆయన కూడా భాగస్వాములయ్యారు. ఒక రకంగా డిఫాక్టో ముఖ్యమంత్రిగా లోకేష్ పాలన సాగిస్తున్నారు. తెలంగాణలో కూడా కొన్ని పాదయాత్ర సాగాయి. గత ఎన్నికల ముందు బిజేపి అధ్యక్షుడుగా బండి సంజయ్ కొంత కాలం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో తెలంగానలో బిజేపి బాగా పుంజుకుందన్న ప్రచారం విసృతంగా సాగింది. ఇక ఎన్నికలకు ఏడాది ముందు అప్పటి పిపిసి. అద్యక్షుడైన రేవంత్‌రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేశారు. ఆయనకు పోటీగా ప్రస్తుతం డిప్యూటీ సిఎం.గా వున్న మల్లు భట్టి విక్రమార్క కూడా ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇద్దరు పాదయాత్రలు చేశారు. కాని సిఎం. రేవంత్ రెడ్డికి పాదయాత్రకు వచ్చినంత క్రేజ్ భట్టి పాదయాత్రకు రాలేదు. అయినా ప్రజలను భట్టి పాదయాత్ర కూడా ఎంతో కదిలించిందనే చెప్పాలి. మొత్తానికి బిఆర్ఎస్ ఓడిపోయింది. పాదయాత్ర చేసిన ఇద్దరు నాయకులు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. మరొకరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నేనెందుకు సిఎం. కావొద్దన్న పిపిసి. అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు వచ్చినట్లుంది. నేను పాదయాత్ర చేస్తాను. కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నట్లున్నారు. పాదయాత్రకు త్వరలో శ్రీకారం చుడతారన్న వార్తలు వస్తున్నాయి. చూద్దాం. ఏం జరుగుతుందో…