
చరిత్ర తెలియదు.. చారిత్రక విశేషాలు తెలియవు.
`దేశ చరిత్రకు మూలాలు తెలియవు.
`చారిత్రక ఆనవాళ్ల మీద అవగాహన వుండదు.
`చారిత్రక సత్యాలు తెలిసిన వాళ్లు కరువౌతున్నారు.
`విద్యావంతులు వస్తున్నారు..విద్యాభివృద్ధికి తోడ్పడడం లేదు.
`ప్రపంచ వారసత్వం మీద అవగాహన వుండదు.
`సమాజం గురించి తెలియదు.
`సామాజిక పరిస్థితులు అర్థం కావు.
`సామాజిక శాస్త్రం చదివిన వాళ్లు కాదు.
`సమాజ శాస్త్రం గురించి అవగాహన కూడా చాలా మందిలో లేదు.
`ప్రజా సమస్యలను అధ్యయనం చేయరు.
`పొలిటికల్ సైన్స్ చదివిన వారు కరువు.
`రాజకీయం కూడా ఒక శాస్త్రమనే సత్యం కూడా తెలియదు.
`ప్రపంచ గతిని మార్చిన మేధావుల గురించి తెలియదు.
`ఉద్యమాల గురించి తెలియదు.
`ఉద్యమ స్పూర్తితో రాజకీయాలు చేయడం లేదు.
`పాలనా పరమైన అంశాలు అర్థం చేసుకోరు.
`దేశ రాజకీయాలను ఏలే వారికి నైసర్గిక స్వరూపాలు తెలియవు.
`రాష్ట్ర రాజకీయాలు చేసే వారికి భౌగోళిక పరిస్థితులు తెలియవు.
`పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి అసలే తెలియదు.
`ప్రజల అవసరాలు, అవస్థలు కళ్లారా చూడరు.
`కులాల కుంపట్లు తెలుసు..ఎన్నికలలో గెలిచేందుకు ఓట్లు కొనడం తెలుసు.
`మత రాజకీయాలు తెలుసు..మత ప్రాతిపదికన పోలరైజేషన్ తెలుసు.
`మెజారిటీ ప్రజల ఓట్లు ఎలా సాధించుకోవాలో తెలుసు.
`మైనారిటీ ఓట్లను ఎలా పొందాలో తెలుసు.
`ఇదే నా రాజకీయం..అన్ని పార్టీలదీ అదే తీరు..
`గెలుపు గుర్రాలుంటే చాలు.
`రాజకీయాలంటే పురాణాలు కాదు.
`పురాణాల పునాదుల మీద రాజకీయాలు ఎల్ల కాలం సాగవు.
`వేదాలు, ఉపనిషత్తులు అంటారు..వాటికి అర్థం కూడా తెలియదు.
`ఒక్కడికీ ఒక్క పద్యం తెలియదు.
`ఆఖరుకు జాతీయ గీతం జనగనమన కంఠస్థం రాదు.
`జాతీయ గేయం వందే మాతరం గుక్క తిప్పుకోకుండా చదవలేదు.
`మాటలు చెప్పి మోసం చేస్తున్నారు.
`దేశానికి వున్న గౌరవాన్ని దిగజార్చుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాను రాను రాజకీయాలు ఎటు పోతున్నాయి. రాజకీయాలలోకి ఎటు వంటి నాయకులు చేరుతున్నారు. రాజకీయాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారు. పార్టీలు ఏవైనా సరే గొర్రెల మందలా, ఒక దానికి వెనుక మరొకటి వెళ్తోంది. ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాజకీయాలు అందరూ చేస్తామంటున్నారు. రాజకీయాలంటే అంత అలుసైపోయిందా? రాజకీయమంటే వ్యాపారమనుకంటున్నారా? ప్రజా ప్రతినిది అంటే పెత్తనం చేయడం అనుకుంటున్నారా? అసలు ఈ తరం నాయకులు ఏమనుకుంటున్నారు? పార్టీలు రాజకీయాలను ఎలా వాడుకుంటున్నాయి? అధికారంలోకి వస్తే చాలనుకుంటున్నాయి. అడ్డమైన మాటలు చెబుతున్నాయి. అదికారంలో వున్న వాళ్లు ప్రతిపక్షాలను, ప్రతిపక్షాలు పాలక పక్షాలను నిత్యం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ముసుగేసుకొని వస్తున్నాయి. పధకాలంటారు? సంక్షేమం అంటారు. ఎన్నికల ముందు హమీలు గుప్పిస్తుంటారు. అయినవి, కానివి అన్నీ చెబుతుంటారు. నోటికి ఏది వస్తే అది చెబుతుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు దేవుళ్లుగా కనిపిస్తారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హమీల గురించి అడిగితే దెయ్యాలుగా కనిపిస్తారు? శత్రువులుగా కనిపిస్తారు? ఓట్లు అడిగినప్పుడు మాత్రం ప్రజలు ఎంతో గొప్ప వాళ్లు. విజ్ఞులు. వివేకవంతులు. అసలు రాజకీయం అనే పదానికి చరిత్రలో ఎంతటి స్ధానం వుందో తెలియదు. కాని రాజకీయాలు చేయానుకుంటారు. నాయకులు కావాలనుకుంటారు? అసెంబ్లీలో కూర్చొని అద్యక్షా! అనాలనుకుంటారు. కుదిరితే కాలం కలిసొస్తే మంత్రి కావాలనుకుంటారు. బుగ్గ కారులో తిరగాలనుకుంటారు. జిల్లాలో చక్రం తిప్పాలనుకుంటారు. రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటారు. ఈ ఐదేళ్లలోనే సిఎం. కూడా అయిపోతే బాగుండనుకుంటారు. తాను బతికున్నంత కాలం పదవిలో వుండాలనుకుంటారు. ఇదీ నేటి తరం రాజకీయనాయకుల ఆలోచనలు. కాని అసలు రాజకీయాలను అర్ధం చేసుకున్నామా? రాజకీయాలకు అసలైన మూల సూత్రమేమిటి? ఒక నాయకుడికి వుండాల్సిన లక్షణం ఏమిటి? అనేది ఏ నాయకుడు ఆలోచించుకోవడం లేదు. కనీసం తెలుసుకోవాలనుకోవడం లేదు. దేశ చరిత్ర తెలియదు. దేశ రాజకీయ ముఖ చిత్రం తెలియదు. చారిత్రక విశేషాలు తెలియదు. చారిత్రాత్మక అంశాలు తెలియవు. దేశ చరిత్రకున్న మూలాలు తెలియవు. ఒక నాయకుడికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం వుందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కావొచ్చు. కాని ఈ తరం నాయకులు అవసరం. ఎందుకంటే మన దేశ విస్తీర్ణం, బౌగోళిక అంశాలపై నాయకులకు ఖచ్చితమైన అవగాహన వుండాలి. అప్పుడే దేశ రాజకీయాలలో సంపూర్ణమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన నాయకులే ఎక్కువగా వుండేవారు. వారిలో ఉన్నత విద్యావంతులు, దేశ రాజకీయాలపై అవగాహన వున్న వాళ్లు మాత్రమే ఎన్నికౌతూ వచ్చేవారు. కాని ఇప్పుడు పార్టీల బలం, బలగం, అర్ధబలం, అంగబలం వుంటే చాలు నాయకులౌతున్నారు. గతంలో ఎలాంటి నాయకుడైనా సమాజం గురించి ఆలోచించేవారు. తన నియోజకవర్గం అభివృద్ది గురించి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడున్న నాయకులు ప్రజా సేవకన్నా, వ్యాపారాలపై దృష్టిపెడుతున్నారు. ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సంపాదించుకోవద్దా? అని నేరుగానే సమాధానం చెబుతున్నారు. రాజకీయాలు చేయాలనుకునేవారికి మన దేశమమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా తెలియాలి. తెలుసుకోవాలి. ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోంది. మనం ఎక్కడ వెనుకబడి వున్నామన్నది కూడా అధ్యయనం చేయాలి. దేశ విదేశాలలో జరుగుతున్న అభివృద్ది మీద అవగాహన పెంచుకోవాలి. పారిశ్రామిక ప్రగతిని అంచనా వేయాలి. మన దేశ ఆర్ధిక పురోగతి కోసం ఎలా ముందుకు వెళ్లాలి. అనే అంశాలపై సంపూర్ణమైన జ్ఞానం నాయకులకు కావాలి. ప్రపంచం కుగ్రామమైపోయింది. ఇంటర్ నెట్ చేతిలో వుంది. ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. నాయకులకు సమాజం మీద పూర్తి అవగాహన కావాలి. సామాజిక శాస్త్రం చదివి వుండాలి. ఒకప్పుడు టెక్నికల్ విద్య అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా వుండేది. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ తెలియకపోవడంతో తీరని నష్టం జరుగుతోంది. గతంలో ప్రతి యూనివర్సిటీలోనూ చరిత్ర, సోషియాలజీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్ధులు ఎక్కువగా చదువుకునేవారు. అందుకే ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పదో తరగతి వరకు కూడా భూగోళం, చరిత్ర, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం వుంటున్నాయి. కాని అవి మార్కుల కోసం మాత్రమే చదువుతున్నారు. ఎక్కువగా లెక్కలు, సైన్స్ మాత్రమే అభ్యసిస్తున్నారు. మిగతా సబ్జెక్టులను వదిలేస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ విద్య వ్యాపారమైపోవడంతో, ఈ సబ్జెక్టులు విద్యార్ధులకు దూరమౌతున్నాయి. ఇప్పటి విద్యార్ధులకు రాజకీయాలు అంటే నాయకులు, పాలకులు, ప్రతిపక్షాలు అనే మాట తప్ప మరొకటి తెలియదు. మన ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారన్న ఆలోచన కూడా ఈ తరానికి అవసరం లేకుండాపోతోంది. అదేదో సినిమాలో చెప్పినట్లు తిన్నామ, పడుకున్నామా, తెల్లారిందా? అన్నట్లు లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్నామా? ఉద్యోగం వచ్చిందా? జీవితంలో స్ధిరపడిపోయామా? అన్నదే ఆలోచిస్తున్నారు. స్కిల్ అనే పదం రాజ్యమేలుతోంది. నైతికత అనేది దూరమైపోయింది. దాంతో దేశంలోనే కాదు, విదేశాలలో చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేశాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులనే కాదనుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా నాయకులకు సమాజ శాస్త్రం తెలియాలి. కుటుంబ వ్యవస్ధలు నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉన్నత లక్ష్యాలున్న సమజాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాయకులే తీసుకోవాలి. సమాజ శాస్త్రం గురించి తెలియని నాయకులకు ప్రజా సమస్యలు కూడా తెలియవు. పట్టవు. ఇవన్నీ తెలియాలంటే అసలైన రాజకీయ మూల సిద్దాంతాలను తెలియజేసే పొలిటికల్ సైన్స్ అనే పదమే చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. పొలిటికల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సోషియో ఎకనామిక్స్ అంటే ఏమిటో అవగాహన లేదు. పాలిటీ అంటే అర్ధంకూడా ఎవరికీ తెలియకుండాపోతోంది. రాజకీయం కూడా ఒక శాస్త్రమన్నది తెలియని నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను పాలిస్తున్నారు. చిరిత్రలో సోక్రటిస్ దగ్గర నుంచి ఎంత మంది రాజకీయ విజ్ఞానవంతులున్నారో తెలియదు. రూసో అనే రాజనీతిజ్ఞుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనిషి బానిస సంకెళ్లలలో వున్నాడని ఎందుకన్నాడు? అనేది తెలియదు. మాకియా వెళ్లి లాంటి రాజనీతిజ్ఞుడు రాజకీయాలు, నాయకులకు గురించి ఏం చెప్పారన్నది ప్రతి నాయకుడు తెలుసుకోవాలి. అరిస్టాటిల్ ఏమని చెప్పాడు. ఆడమ్ స్మిత్ ఏమని చెప్పారు తెలుసుకోవాలి. ఆఖరుకు మన ఆమర్త సేన్ మన దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఏం చెప్పారన్నది ఎంత మందికి తెలుసు. మన దేశ మొదటి ఆర్ధిక శాఖ మంత్రి ఎవరికి తెలుసు. పంచ వర్ష ప్రణాళికల రూపకర్త మహలోనుబిస్ గురించి ఎంత మంది నాయకులు తెలుసుకున్నారు. ఇవేవీ తెలియదు. కాని నాయకులమౌతాం. గెలుస్తాం. పాలిస్తాం..ఇదేనా రాజకీయం అంటే ఇదేనా? రాజకీయాలంటే చెప్పడానికి పురాణాలు కాదు. రాజకీయమంటే వర్తమానం. ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోతున్నారు. కులం, మతం అంటున్నారు. మెజార్టీ ఓట్ల గురించి లెక్కలేసుకుంటారు. మైనార్టీ ఓట్లు ఎటు వైపు అని మాట్లాడుకుంటారు. అంతే తప్ప వారి అభ్యున్నతి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మారడం లేదని ఆలోచించరు. ఇంత పెద్ద మన ప్రజాస్వామ్య వ్యవస్ధలో, ప్రపంచానికే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంలో మన జాతీయ గీతం కంఠస్తంగా వచ్చే నాయకులు ఎంత మంది? వారికి ఆ గీతంలో వున్న అర్దం, పరమార్ధం ఎంత మంది నాయకులకు తెలుసు. మన జాతీయ గేయం వందేమాతరం చూడకుండా చదవగలిగే వాళ్లు ఎంత మంది? అసలు వీటిలో జాతీయ గీతం, జాతీయ గేయం ఏదో చెప్పలేరు. మన జాతీయ జెండా ఎంత పొడవు విస్తీర్ణంలో వుండాలో తెలియదు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఏదీ తెలియడం లేదు. కాని నాయకులౌతున్నారు. మనల్ని పాలిస్తున్నారు. ఇదీ మన దౌర్భాగ్యం. అంతే…!