రుజువైన భారత్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యం
పాక్‌లోని లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం బహిర్గతం
తాత్కాలిక లక్ష్యాలు సాధించినా, దెబ్బతినని ఉగ్రవాదుల మూలాలు
పాక్ ప్రకటనతో యుద్ధంగా మారే ప్రమాదం
పాకిస్తాన్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే
అడుక్కు తింటున్నా అహంకారం తక్కువేం లేదు
అంతర్జాతీయంగా ఏకాకి అయినా బుద్ధి మారని పాక్
హైదరాబాద్,నేటిధాత్రి:
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ అత్యాధునిక యుద్ధకళలో మనదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. గతంలో బాలాకోట్, యురి దాడులు నిర్వహించినా, ఆ రెండుసార్లు మన దళాలు పీఓకేలోకి ప్రవేశించి ఆయా ఆపరేషన్లను దిగ్విజయంగా నిర్వహించాయి. అయితే ఈసారి సరిహద్దు దాటకుండానే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రమే కాదు, పాక్ భూభాగంపై కూడా నిర్దిష్టమైన రీతిలో దాడిచేయగలమని ఆ దేశానికి తెలియజెప్పింది. ముఖ్యంగా ఈ దాడిలో త్రివిధ సైనిక దళాలు, రాజకీయ నాయకత్వం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎంతో సమన్వయంతో పనిచేసి అనుకున్నది సాధించాయి. మనదేశంలోని అన్ని వ్యవస్థల సమన్వయ సామర్థ్యంకూడా ప్రపంచానికి మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా ఈదాడుల్లో ఉపయోగించింది రఫేల్ యుద్ధ విమానాలు. వీటిల్లో అత్యాధుóనిక ఆయుధాలను అమ ర్చి సరిహద్దును దాటకుండానే, ఏవిధమైన నష్టం లేకుండా నిర్దిష్ట లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహించడం ఇక్కడ గుర్తించాల్సిన కీలకాంశం. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో మనదేశానికి చెందిన 25 మంది, నేపాల్‌కు చెందిన మరొక పర్యాటకుడిని అమానుషంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనకు ప్రతీకారంగా జరిపిన ఈ దాడుల్లో 90వరకు మిలిటెంట్లు మరణించి నట్టు తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ప్రపంచానికి పదేపదే స్పష్టం చేస్తున్న మనదేశం, ఈ దాడులను కేవలం లష్కరే తొయ్యబా (లెట్), జైషే మహమ్మద్ (జెమ్) స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే నిర్వహించింది. చాలా జా గ్రత్తగా రచించిన ప్రణాళిక ప్రకారం పాక్ సైనిక స్థావరాలను ముట్టుకోలేదు.
స్కాల్ప్ క్రూయీజ్ క్షిపణులు
ఈ దాడులకు ఉపయోగించిన రఫేల్ జెట్ విమానాల్లో స్కాల్ప్ క్రూయీజ్ క్షిపణులు, హామర్ ప్రిసిషన్ గైడెడ్ బాంబులను భారతీయ వాయుసేన అమర్చింది. వీటిల్లో స్కాల్ప్ క్షిపణులు లోపలి ప్రాంతాలపై కచ్చితమైన దాడులకు ఉపయోగపడగా, హామర్ బాంబులతో గాల్లోనుంచి భూత లం మీది లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేశాయి. పూర్తిగా భారత భూభాగంనుంచి ని ర్వహించిన ఈ ఆపరేషన్‌కు, నేవీ చక్కటి సమన్వయ సహకారాలు అందించింది. భారత ప్రజలుగాఢనిద్రలో వున్న సమయంలో, పాక్ సైన్యం ఏమరుపాటుగా వున్న తరుణాన్ని ఎంచుకొని సరి గ్గా 6వ తేదీ అర్థరాత్రి దాటి, 7వ తేదీ 1.44 గంటలకు మన సైన్యం ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో భారత్ వైపు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి నిర్దిష్ట ఉగ్ర లక్ష్యాలపై దాడులు జరపడంలో భారత్ తనవద్ద ఉన్న ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని విస్పష్టంగా ప్రదర్శించింది. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యంతో అనవసర యుద్ధం రాకుండా, కేవలం ఉగ్రవాద కేంద్రాలపైనే దృష్టి కేంద్రీకరించడమనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అనుకున్న విధంగా పూర్తిచేయడం అంత సులభం కాదు. దీన్ని మనదేశం సాధించి చూపింది.
రఫేల్ కీలకపాత్ర
రఫేల్ యుద్ధవిమానాల్లో అమర్చిన స్కాల్ప్ క్రూయీజ్ క్షిపణులకు 300 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యముంది. ఫలితంగా ఈ యుద్ధ విమానం సురక్షితమైన దూరంలో వుంటూనే తన దాడిని కొనసాగించడానికి వీలైంది. అదీకాకుండా ఈ క్షిపణీ వ్యవస్థ శత్రు రక్షణ వ్యవస్థల ను ఏమార్చి ముందుకు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించగలదు. హామర్ (హైలీ అగైల్ మాడ్యులార్ మ్యునిషన్ ఎక్స్‌టెండెండ్ రేంజ్) బాంబులు వ్యూహాత్మకంగా, ఉగ్రవాద స్థావరాల్లోని నిర్దిష్ట చిన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడ్డాయి. ఈ మొత్తం ఆపరేషన్, ప్రణాళికా రచనలో మన సైన్యం అనుసరించిన ఆధునిక పోకడ ప్రపంచానికి వెల్లడైంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకుండానే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఆపరేషన్ సింధూర్ విశిష్టత. గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే, మనవైపు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, ఉగ్రవాద స్థావ రాలకు అనుకున్న రీతిలో తీవ్ర నష్టం కలిగించడం. అంతేకాదు, ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాల ధ్వంసంపై మాత్రమే కాదు, ఆయా సంస్థల ముఖ్యనేతలను హతమార్చ డంపై కూడా దృష్టి కేంద్రీకరించింది. ఈ ఉగ్రవాద స్థావరాలను గుర్తించడానికి, పహల్గామ్ దా డులు జరిగినప్పటినుంచి మన రిసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆవిధంగా సేకరించిన కచ్చితమైన సమాచారం ఆధారంగా, లష్కరే తొయ్యబా, జెయిషే మహమ్మద్ సంస్థల కమాండ్ మరియు కంట్రోల్ విభాగాలను పూర్తిగా ధ్వంసం చేయాలన్న లక్ష్యాన్ని మన సైన్యం నిర్దేశించుకుంది.
ముర్దిక్‌లోని లెట్ స్థావరంపై తీవ్రస్తాయి దాడులు
ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా ముర్ధిక్‌లోని లెట్ స్థావరంపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు కేంద్ర స్థానం. అదేవిధంగా బహవాల్పూర్‌లోని జై షే మహమ్మద్ ఉగ్ర సంస్థపై కూడా దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ఈ రెండు సంస్థల్లోనూ భారత్‌ను లక్ష్యం చేసుకొని ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ప్రదేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. ఈవిధంగా ఈ సంస్థలకున్న ఉగ్రవాదులను తయారుచేసే సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, భవిష్యత్తులో అటువంటి ప్రణాళికలు రూపొందించకుండా వుండే స్థాయిలో ఈ దాడులు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఈ ఆప ంషన్ మొత్తాన్ని పర్యవేక్షించడాన్ని పరిశీలిస్తే, మనదేశ అత్యున్నత నాయకత్వం దీనికి ఎంతటి ప్రాధాన్యత నిచ్చిందీ అర్థమవుతుంది. ఇక మన రియల్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్‌దే కీలక పాత్ర. ఇదే సమయంలో మన ‘రా’ సంస్థ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన నిక్కచ్చి సమాచారాన్ని అంద జేయడం మరో గొప్ప విషయం.
భారత్ నిగ్రహం
ఈమొత్తం ఆపరేషన్‌ను ఉగ్రవాద వ్యతిరేక చర్యగానే భారత్ పరిగణించి ఎంతో నిగ్రహంతో వ్య వహరించడం వల్లనే పరిస్థితి యుద్ధానికి దారితీయలేదు. ఈ వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయంవంతం కావడానికి మించి మరో ప్రయోజనం కూడా ఒనగూడిరది. చాలా తక్కువ నష్టంతో పాకిస్తాన్‌లోని సుదూర ప్రాంతాల్లోని నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయగలమన్న స్పష్టమైన సందేశాన్ని పాక్ ఉగ్రవాదులకు, వారి మద్దతుదార్లకు మనదేశం ఇచ్చినట్లయింది. ఇదే సమయంలోఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేసామని, ఆవిధంగా ‘ఉగ్రవాదంపై పోరు ’కే కట్టుబడి వున్నామన్న సందేశాన్ని ప్రపంచానికి మనదేశం ఇచ్చింది. అయితే ఆపరేషన్ సిం ధూర్ ద్వారా మనదేశం తక్షణ లక్ష్యాలను సాధించినప్పటికీ దీర్ఘకాలంలో దీని పర్యవసానాలు ఎట్లా వుంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మౌలిక వసతుల ధ్వంసం, ఉగ్ర సంస్థల నాయకులను హతమార్చడం తాత్కాలికంగా ఆయా సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసినప్పటికీ, కొంత విరామం తర్వాత అవి మళ్లీ యథాస్థితికి చేరుకుంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యం. కాకపోతే పాకిస్తా న్ లోని సుదూర ప్రాంతాలపై కూడా అత్యంత కచ్చితత్వంతో దాడిచేసే సామర్థ్యం భారత్‌కు ఉ న్నదన్న సత్యం పాకిస్తాన్‌కు తెలిసొచ్చిన మాట వాస్తవం. అంతేకాదు ఈ ఆపరేషన్ దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ సరిహద్దు అంశాలపై తన ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఈ దాడులను ‘యుద్ధ చర్య’గా పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ! అయితే ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడులు జరపడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సన్నిహిత దేశాలకు తెలియపరుస్తూ రావడంవల్ల, యుద్ధం స్థాయికి పరిస్థితులు దారితీయకపోవచ్చు కూడా!
మరో మైలురాయి
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరులో మనదే శం మరో మైలురాయిని దాటిందనే చెప్పాలి. తన ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే, వ్యూహాత్మక సంయమనం పాటించడం ఒక్క భారత్‌కు మాత్రమే సాధ్యమైంది. వీటి వినియోగం ద్వారా రెండుదేశాల మధ్య సంఘర్షణ జరగకుండా జాగ్రత్తపడిరది. అంతేకాదు మనదేశం అనుసరిస్తున్న ‘త్రివిధ దళాల ఉమ్మడి చర్య సిద్ధాంతం’ ఇస్తున్న చక్కటి ఫలితాలు ప్రపంచానికి తెలిసొచ్చాయి. మొత్తంమీద చెప్పాలంటే, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ నిబద్ధత ప్రపంచానికి మరోసారి వెల్లడైంది.