మిల్లర్ల గోడు పట్టదా! దళారుల ఆగడాలు ఆగవా!!

`ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్‌ మాత్రమే పట్టించుకోవాలా?

`ఒకే రోజు తెలంగాణలో 40 మంది కి పైగా మిల్లర్లపై కేసులు ఏమిటి?

`దళారులకు రాచ మర్యాదలు మిల్లర్లకు కేసులు

`అకున్‌ సబర్వాల్‌, సి.వి ఆనంద్‌ లకు పూర్తి పట్టు ఉంది.

`రైతు నిరసనలకు కారణం మిల్లర్లు కాదు

`ప్రతిపక్షాలకు ఆయుధం అందించేలా వ్యవహరిస్తున్నది దళారులే.

`మిల్లర్లపై అధికారుల ఒత్తిళ్లేమిటి?

`మిల్లర్లపై దళారులు వేధింపులేమిటి?

`ప్రభుత్వానికి మిల్లర్ల సమస్యలు పట్టవా?

`దళారులు గత టెండర్‌ పంట ధాన్యం ఖాళీ చేయరు?

`మిల్లర్లు కొత్త ధాన్యం తీసుకోకపోతే వదిలేయరు?

`ఎలాంటి డిపాజిట్లు లేని దళారులకు స్వేచ్చ లేమిటి?

`ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య దళారులేమిటి?

`సంబంధిత శాఖకు పట్టింపు లేదా?

`మిల్లర్లకు సమయం ఇవ్వకపోవడానికి కారణమేమిటి?

`ధాన్యం సేకరించాల్సిన బాధ్యత దళారులది.

`మిల్లర్ల నుంచి సొమ్ము కావాలంటే ఎక్కడినుండి ఇస్తారు?

`దళారులే ధాన్యం అమ్మి డబ్బులు ఇవ్వమని మిల్లర్ల మీద ఒత్తిడి తెస్తారు?

`మిల్లర్లు బియ్యం అమ్ముదామంటే కేసులు నమోదు చేస్తారు?

`మిల్లర్లను దోషులుగా చూపి దళారులు బతుకుతున్నారు.

`పెద్ద ఎత్తున బకాయిలు పడ్డారు.

`వాటిని మిల్లర్ల మీద తోసేస్తున్నారు.

`సివిల్‌ సప్లయ్‌ ప్రక్షాళన జరిగితే తప్ప సమస్య పరిష్కారం కాదు.

`గత ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరిపింది లేదు.

`ప్రజా ప్రభుత్వం కూడా చర్చలు చేస్తున్నది లేదు.

`చర్యలు మాత్రం తీసుకుంటామంటున్నారు.

`సివిల్‌ సప్లయ్‌ మీద పూర్తి అవగాహన వున్న వారిని కమీషనర్‌ గా బాధ్యతలు అప్పగించాలి.

`వేలాది మంది వున్న మిల్లర్లకు పలు సంఘాలున్నాయి.

`అందరికీ ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సమస్యలు తెలుస్తాయి.

`దళారులు చేతులెత్తేసి మిల్లర్ల మీద తోసేయడం వల్ల అసలు సమస్య.

తెలంగాణలో మిల్లర్ల గోడు ఎవరికీ పట్టదా? దళారుల ఆగడాలు ఇకనైనా ఆగవా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా వున్నా అసలు నిజాలు తెలియక చాలా మంది అపోహ పడుతుంటారు. ఓ వైపు దళారులు మిల్లర్ల మీద పెత్తనం సాగిస్తుంటారు. మరో రకంగా వేధింపులకు గురిచేస్తుంటారు. దానికి తోడు సివిల్‌ సప్లయ్‌ అధికారుల ఒత్తిళ్లతో మిల్లర్లు సతమతమౌతున్నారన్న సంగతి ఎంత మందికి తెలుసు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్ల సమస్యలు పట్టవా? అన్న చర్చ తెరమీదకు వస్తోంది. అసలు మిల్లర్లకు, ప్రభుత్వానికి దళారీ వ్యవస్ధ ఎందుకు? రాష్ట్రంలో సివిల్‌ సప్లయ్‌ శాఖ వుండి లాభం ఏమిటి? కొన్ని వందల మంది అధికారులు ఆ శాఖలో వున్నారు. వాళ్లంతా చేయలేని పని కేవలం నలుగురు ఏజెన్సీలు చేస్తాయా? ఇలా ఏజెన్సీలను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర ఫ్రభుత్వానికి నష్టం మిగిలిందే తప్ప లాభం రాలేదు. పైగా పదేళ్లుగా తెలంగాణలో 26వేల కోట్లు బకాయిలు మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉదాసీనత ప్రదర్శిస్తే, దళారులను ప్రోత్సహిస్తూ పోతే బకాయిలు పెరిగిపోతాయే తప్ప వసూలు కావు. అయినా బకాయిల వెనుక చాలా మర్మం వుంది. అందుకు నేరుగా మిల్లర్లు బాధ్యులు కాదు..కాని వాళ్లే దోషులుగా ముద్ర వేయబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల మీద అపోహలను పెంచుకున్నదా? అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. దాంతో దళారుల మిల్లింగ్‌ దందాలో మిల్లర్లు సమిధలౌతున్నారు. తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సిన బాద్యత కేవలం దళారులది. పర్యవేక్షణ సివిల్‌ సప్లయ్‌ అధికారులది. మధ్యలో మిల్లర్లు ఏం పాపం చేశారు? ఒక్కరోజే తెలంగాణలో సుమారు 40 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మిల్లర్లపై సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఎందుకు కేసులు నమోదు చేస్తున్నట్లు? ఎవరి ప్రమేయంతో కేసులు పెడుతున్నట్లు? ఎవరి ఒత్తిళ్ల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆరా తీస్తే కేవలం దళారుల మూలంగా ఈ తతంగమంతా జరుగుతుందని తేలుతోంది. నిజానికి దళారులు రైతుల నుంచి ధాన్యం సేకరించాలి. ఆ సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు ఇవ్వాలి. నిజానికి మిల్లర్ల నుంచి ఆ ధాన్యాన్ని దళారులు నేరుగా సేకరించాలి. లేదా ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి దళారులకు అప్పగించాలి. అప్పుడు దళారులు ఆ బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌కి అప్పగించాలి. ఈ ప్రాసెస్‌ ఎక్కడా సరిగ్గా జరగడం లేదు. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. దళారులు మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి సైతం మిల్లర్లు డిపాజిట్లు చెల్లించాల్సి వుంటుంది. ఇంత జరగుతున్నప్పుడు బకాయిలు ఎందుకు పేరుకుపోతున్నాయి? గత పదేళ్లుగా సుమారు 26వేల కోట్లు ఎందుకు పేరుకుపోయాయి. బిడ్డింగ్‌ వేసి దక్కించుకున్న ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి. జవాబు దారి తనం కేవలం మిల్లర్లకు మాత్రమేనా? దళారులు బాధ్యులు కాదా? వారికి జవాబు దారి తనం వుండాల్సిన అవసరం లేదా? రైతు చెప్పినట్లే మిల్లర్లు ఆడాలి! దళారులు ఆడమన్నట్లు మిల్లర్లే ఆడాలి!! సివిల్‌ సప్లయ్‌ అదికారులు ఎప్పుడు బెదిరిస్తే అప్పుడు బెదిరిపోవాలి!!! అసలు ఇక్కడ మిల్లర్లకు స్వేచ్ఛ ఎక్కడుంది? మిల్లర్ల మీద అజామాయిషీ చేయాల్సిన అవసరం ఏమొస్తోంది? దళారులు మిల్లర్ల నుంచి సొమ్ము కావాలని ఒత్తిడి చేస్తే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. దళారులు మిల్లర్ల గోడౌన్లలో వుంచిన ధాన్యాన్ని దళారులు తరలించలేదు. గత ఆరు నెలల క్రితం సేకరించి ధాన్యాన్ని దళారులు తరలించనేలేదు. అలాంటప్పుడు మిల్లర్లు ఏం చేస్తారు? ధాన్యాన్ని దళారులు తరలిస్తుంటే పట్టించుకునే వారు ఎవరూ వుండరు? కాని మిల్లు నుంచి ధాన్యం బస్తాలు తరలివెళ్లినా, బియ్యం లారీ బైటకు వెళ్లినా వెంటనే పోలీసులు తనిఖీలు. రేషన్‌ బియ్యం తరలింపు అని మీడియా ప్రచారం…ఇలాంటి సమయంలో మిల్లర్లు ఏంచేస్తారు? దళారులకు సొమ్ము ఎలా చెల్లిస్తారు? రాష్ట్రంలో మిల్లర్ల పరిస్ధితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. దళారులకు ప్రభుత్వం రాచ మర్యాదలు చేస్తుంది. మిల్లర్లను దోషులుగా చూస్తుంది. వారిపై కేసులు నమోదు చేస్తోంది. మిల్లర్లను సాకుగా చూపి దళారులు తప్పించుకుంటున్నారు. మిల్లర్లను దోషులుగా చూపి దళారులు బతుకుతున్నారు. కాని ఎక్కడా దళారులు బద్‌నాం కావడం లేదు. వారి దర్జాకు లోటు రావడం లేదు. అందరికీ కనిపించేది కేవలం మిల్లర్లు మాత్రమే.. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి 26వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డవారు మిల్లర్లు కాదు..దళారులు. దళారులు చెల్లించకపోవడం వల్ల ధాన్యమంతా మిల్లుల్లో మాగిపోయింది. దాంతో బకాయిలు పేరుకుపోయాయి. అంతే కాని మిల్లర్ల మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిలు పెరిగిపోలేదు. గత ప్రభుత్వం పదేళ్లలో ఏనాడు మిల్లర్లతో సమావేశం నిర్వహించింది లేదు. వారి సమస్యలు తెలుసుకున్నది లేదు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడువేలకు పైగా మిల్లులున్నాయి. అందులో సుమారు 2వేల వరకు చిన్నా, చితకా మిల్లులే. అసలైన మిల్లులు కేవలం వెయ్యి వరకు మాత్రమే వుంటాయి. బకాయిలు కూడా పెద్ద మిల్లర్లే…ఈ సంగతి అందరికీ తెలుసు. కాని ప్రభుత్వానికి చేరనివ్వరు. దళారుల అవతారం ఎత్తిన మిల్లర్లే కొందరు యూనియన్‌ పెద్దలుగా వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని తప్ప మిగతా వారిని యూనియన్లుగా గుర్తించవు. ఇదే మిల్లర్ల మధ్య అగాధానికి కారణమౌతోంది. తెలంగాణలో రెండు రకాల మిల్లర్లు వుంటారు. బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ మిల్లులు వేరు..వేరు. వారి సంఘాలు కూడా వేరు వేరు. కాని ఇద్దరినీ ఒక గాడిన కట్టడమే ఇక్కడ అసలు ముప్పుకు దారి తీస్తోంది. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు యూనియన్లపై పెత్తనం సాగిస్తుంటారు. మొదటి నుంచి బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లదే ఆధిపత్యం. అది ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో రా రైస్‌ మిల్లర్లే ఎక్కువ. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు తక్కువ. అయినా వారిదే పెత్తనం సాగుతుండడంతోపాటు, దళారుల అవతారంలో వున్నది కూడా వాళ్లే కావడంతో ఇతర యూనియన్లకు స్ధానం లేకుండా పోతోంది. ప్రభుత్వం వారితో చర్చలు జరపలేకపోతోంది. గతంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడ అదే జరుగుతోంది. దాంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో వున్న ఒక్కొ మిల్లు మీద కనీసం 3వందల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తుంటారు. అంటే రాష్ట్రంలో మూడు వేలకు పైగా మిల్లులున్నాయి. అంటే కనీసం ముప్పై లక్షల మంది ఆ మిల్లుల మీద ఆధారపడి జీవిస్తుంటారు. అంత పెద్ద వ్యవస్ధతో ప్రభుత్వం చర్చలు జరకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని ప్రభుత్వానికి అసలు విషయలు తెలియకుండా దాస్తున్నది కేవలం దళారులు మాత్రమే. వారికి సహకరిస్తున్న సివిల్‌ సప్లయ్‌ అదికారులే అంటున్నారు. ఇప్పటికైనా సివిల్‌ సప్లయ్‌ శాఖ ప్రక్షాళన జరగాలి. సివిల్‌ సప్లయ్‌ శాఖ బాధ్యతలను మాజీ కమీషనర్లైన సివి. ఆనంద్‌, అకున్‌ సభర్వాల్‌లలో ఎవరికో ఒకరికి అప్పగిస్తే అసలు మూలాలన్నీ బైటకు లాగుతారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలన్నీ వసూలు చేస్తారు. ఎందుకంటే సివిల్‌ సప్లయ్‌ లోగుట్టులన్నీ వారికి తెలుసు. అందుకే విజిలెన్స్‌ ఎంక్వౌరీ చేపట్టారు. నివేదిక గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. కాని వాళ్లు చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టిపెట్టాలి. వేలాది మంది వున్న మిల్లర్లకు పలు సంఘాలుండడంలో తప్పులేదు. దళారులు వారిని చీల్చి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం మూలంగానే సమస్యలు తలెత్తుతున్నాయి. మిల్లర్లంతా ఏకతాటిపైకి వస్తే, తమ పప్పులుడకవని దళారుల ఆడుతున్న నాటకం. ఇప్పటి వరకు దళారులు ప్రతిసారి చేతులెత్తేసి మిల్లర్ల మీద తోసేస్తూ వస్తున్నారు. ఆ విషయం ప్రభుత్వానికి పూర్తి సమచారం చేరడం లేదు. దానిపై సంబంధిత శాఖ మంత్రి వర్యులు కూడా దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే మిల్లర్లు మంత్రిని కలిసేందుకు వెళ్తే కూడా వారికి అప్పాయింటు మెంటు దొరకలేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రైతులు సాగిస్తున్న నిరసనలకు కారణం మిల్లర్లు కాదు. దళారులు. ప్రతిపక్షాలకు ఆయుధం అందేలా వ్యవహరిస్తున్న వారు దళారులే. ఈ విషయం ఎంత తొందరగా ప్రభుత్వానికి చేరితే అంత మంచిది అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!