ఆన్‌లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు
– 30లక్షల విలువ చేసే 150కిలోల గంజాయి స్వాధీనం
– రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు కూడా…
– వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్
ఆన్‌లైన్ ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముఠాను శనివారం ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠాసభ్యుల నుండి సుమారు 30లక్షల విలువగల 150కిలోల శుద్దిచేసిన గంజాయితోపాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోనగాని భిక్షపతి, వరంగల్ ఆర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన తీగల రాజు ఆలియాస్ చిన్నరాజు, హన్మకోండ వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జెల్లి యాకయ్య, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన మాసారపు భూపతిరావు ఉన్నారు. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లి విష్ణుపురి కాలనీలో నివాసం ఉంటున్న బానోత్ వీరన్న ఆలియాస్ వినోద్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్టణానికి చెందిన నాయుడు, వరంగల్ అర్బన్ జిల్లా కోత్తవాడకు చెందిన దేశిని రమేష్, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గోరుకోత్తపల్లి గ్రామానికి చెందిన శంకర్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల్లో ఒకడైన బోనగాని భిక్షపతి, పరారీలో ఉన్న వినోద్, నాయుడు ముగ్గురు మిత్రులని పేర్కొన్నారు. గతంలో వీరు చోరీలు పాల్పడడంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. ఈ ముగ్గురు నిందితులు దొంగతనాలకు స్వస్తి పలికి సులువుగా డబ్బు సంపాదించాలనే అలోచనతో ఆన్‌లైన్‌లో గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పారు. నిందితులు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, అంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయిని సెల్‌ఫోన్‌లో ఆర్డర్లు తీసుకోనేవారని, ఆర్డర్లు స్వీకరించిన నిందితులు మరో ఆరుగురు నిందితులను తమ ముఠాలో నియమించుకుని వారి ద్వారా నాయుడుకు తెలిసిన వ్యక్తుల ద్వారా విశాఖపట్టణం జిల్లా నుండి గంజాయిని బోలేరో వాహనాల్లో తాత్కాలిక రహాస్య ప్రదేశంలో పెట్టి వరంగల్ నగరానికి చేరవేసేవారన్నారు. అనంతరం ప్రధాన నిందితులు వినోద్, నాయుడు ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తులకు గంజాయి సిద్దంగా వుందని, తమ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ చేయాలని సెల్‌ఫోన్‌లో సమాచారం ఇచ్చేవారన్నారని తెలిపారు. ఆర్డర్ చేసిన వ్యక్తుల నుండి ఖాతాలో డబ్బు జమ కాగానే నిందితులు గంజాయిని కార్లలో మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, అంద్రప్రదేశ్‌లకు ముఠాసభ్యులతో తరలించేవారని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన బానోత్ వీరన్నపై గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జఫర్‌గడ్, పాలకుర్తి పోలీస్‌స్టేషన్ల పరిదిలోó బందిపోటు దొంగతనాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని అన్నారు. మధ్యప్రదేశ్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా సంబంధించి పలు కేసులు నమోదు కాగా, బోనగాని బిక్షపతిపై ఇంతజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనంతోపాటు అంధ్రప్రదేశ్‌లో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరో నిందితుడు నాయుడుపై అంధ్రప్రదేశ్‌లో గంజాయి రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని వివరించారు. పెద్ద మొత్తంలో గంజాయి వ్యాపారాన్ని గుర్తించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఎ.సి.పి చక్రవర్తి, ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌జీ, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నందిరాంనాయక్, ఎల్కతుర్తి సబ్-ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్, సూరి, ఉపేందర్ హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుళ్లు రాజు, కిరణ్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ అభినందించారు.