అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పొలాలు, ఇళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గీసుగొండ పోలీసుల సూచనలు
గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్
గీసుగొండ,నేటిధాత్రి:
ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వ్యవసాయ పొలాలు, నివాస గృహాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గీసుగొండ సీఐ సి.విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటన విడుదల చేశారు.పొలాల్లో ఎండిపోయిన గడ్డి, చెత్తను కాల్చొద్దని, పంట అవశేషాలను నియంత్రణ లేకుండా దహనం చేయరాదని సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద జాగ్రత్తగా పనులు చేయాలని, సిగరెట్లు, బీడీల అవశేషాలను నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు.
పొలాల్లో నీటి సదుపాయం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లీకేజీని తరచూ తనిఖీ చేయాలని, పాడైన విద్యుత్ వైర్లను వెంటనే మార్చాలని, అధిక లోడ్‌తో పరికరాలు వాడొద్దని సూచించారు. పిల్లలు మాచిస్, లైటర్లు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి వద్ద నీటి బకెట్లు, అగ్ని నియంత్రణ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఎండలో వాహనాల్లో పెట్రోల్, కెమికల్స్ వంటి దహనశీల పదార్థాలు ఉంచొద్దని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ సర్వీస్ 101 లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, గ్రామ స్థాయిలో ప్రజలు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసమే ఈ సూచనలు జారీ చేసినట్లు సీఐ విశ్వేశ్వర్ పేర్కొన్నారు.
