ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిఐటియు, బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రంగంలో మనిషి జీవనం సాఫీగా సాగేందుకు కార్మికుల శ్రమే పునాది అని అన్నారు. శ్రమను పెట్టుబడిగా పెట్టి పనిచేసే ప్రతి కార్మికుడిని గౌరవించాల్సిన అవసరం ఉందని, కార్మికులు లేకపోతే సమాజం స్తంభించిపోతుందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముందుండి పనిచేస్తున్నారని, వారి సేవలు అమూల్యమని కొనియాడారు. తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సమాజానికి సేవ చేస్తున్న శ్రమజీవుల కృషి మరువలేనిదని తెలిపారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కార్మిక సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని, ముఖ్యంగా సిరిసిల్లలో బతుకమ్మ చీరలు వంటి వస్త్ర తయారీ ఆర్డర్ల ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు సబ్సిడీలు అందించి కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
అనంతరం కార్మికులతో కలిసి నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, అడిచర్ల రూపా సాయి, బత్తుల రమేష్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, రిక్కమల్లె సంపత్, బిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పోరండ్ల రమేష్, సిఐటియు పవర్‌లూమ్స్ రాష్ట్ర అధ్యక్షుడు ముసం రమేష్, జిల్లా కార్యదర్శి కోడం రమణ, మున్సిపల్ పారిశుధ్య కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కాసర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పారిశుధ్య, భవన నిర్మాణ, పవర్‌లూమ్ తదితర రంగాలకు చెందిన కార్మికులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
