గీసుకొండ మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
నలుగురు అరెస్ట్ – ఇద్దరు పరారీ – నగదు, సెల్ఫోన్లు, బైకులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీఐ విశ్వేశ్వర్
నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో పేకాట శిబిరంపై స్థానిక పోలీసులు,టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం గీసుకొండ పోలీసులు,వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 19 న కొమ్మాల గ్రామ శివారులో కడారి రాజు వ్యవసాయ భూమి వద్ద నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు.అరెస్టైన వారిలో అదే మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కడారి రాజు,బసికే ప్రభాకర్, విశ్వనాధపురానికి చెందిన దునికే కొమురయ్య,లకావత్ గణేష్ ఉన్నారు. కాగా విశ్వనాధపురానికి చెందిన వాంకుడోత్ రాజు,కొమ్మాల గ్రామానికి చెందిన పల్లె నరేష్ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు.పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 4,840 నగదు, 5 సెల్ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లు మరియు పేకాట ముక్కలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు.
