లంచావతారులు ఎపిసోడ్‌ 2

https://epaper.netidhatri.com/

`అంతర్యామి, సర్వాంతర్యామి అవినీతే!

`అవినీతి లీలలు…ఉద్యోగుల బాగోతాలు.

`అటెండర్‌ దగ్గర నుంచి అధికారి వరకు నకీలీలే!

`అన్న అటెండరైతే తమ్ముడు విధులు.

`అధికారుల తాళాలు..అనుచరుల చేతిలో.

`అధికారులు ఇంటిలో…అనుచరులు కార్యాలయాలలో,

`కింది నుంచి పై స్థాయి దాక మోసాలే.

`సర్టిఫికేట్లు డూప్లికేట్లే…

`ప్రమోషన్ల మీద ప్రమోషన్లే…

`విజిలెన్స్‌ మాయా జాలం.

`విచారణ అధికారుల చేతి వాటం.

`వ్యవస్థ సర్వనాశనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈ చరాచర సృష్టిని నడిపిస్తున్నది మనీ అనుకుంటాం. కాని ఆ మని రూపంలో దాగి వున్న అవినీతి మాత్రమే పాలిస్తుందని చాలా మందికి తెలియదు. పిల్లపుట్టిన నాటి నుంచి కట్టే కాలేదాకా మనీ ఎంత అవసరమో, అవినీతి పీడ అక్కడ కూడా వదలదు. అవినీతి క్యాన్సర్‌ కన్నా ప్రమాదరమైంది. ఎందుకంటే అవినీతి లేనిదే ఒక్క క్షణంకూడా గడవదు. జనానికి ఆత్రమెక్కువ. అవినీతికి ఆకలెక్కువ. వ్యవస్ధలకు చెడులెక్కువ. అధికారులకు కాసులంటే మక్కువ. అందుకే అవినీతి ఊడలు ప్రపంచమంతా పాతుకుపోయాయి. ముందుగా మీకు కథ చెప్పాలి. అంటే అదేమీ కల్పితం కాదు. నిజమైన కాలానికి సజీవమైన సాక్ష్యం లాంటిది. అందుకే కథ అనాల్సివస్తోంది. సకల కళాపోషకులైన కొందరు ఉద్యోగుల నిర్వాకం గురించి చెపాల్సివస్తోంది. అది ఏ వ్యవస్ధ అయినా సరే ఒకటే దారి..అందుకే విద్యా వ్యవస్ధతో మొదలుపెడదాం…అనగనగా ఒక ఊరిలో ఒక బడి. ఆ బడిలో అంటెండర్‌ దగ్గర నుంచి ప్రధానోపాధ్యాయుడు దాకా చాలా మందే పనిచేస్తున్నారు. అనుకోకుండా ఒకనాడు ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎలా విధులు నిర్వహిస్తున్నారనేది తెలుసుకునేందుకు, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు డీఈవో వచ్చారు. డీఈవో వస్తున్న విషయాన్ని గుర్తించిన అటెండర్‌ , పాఠాలు బోధిస్తున్న ఉపాద్యాయుని దగ్గరకు వచ్చి, డిఈవో వస్తున్నాడు. అని చెప్పి అక్కడి నుంచి అటెండర్‌ పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని గమనించిన ఉపాధ్యాయుడు డీఈవో వస్తుంటే నువ్వు పారిపోవడం ఎందుకు..రా? అని ప్రశ్నించాడు. అసలు అటెండర్‌ను నేను కాదు. మా అన్న. ఆయన చేయాల్సిన ఉద్యోగం నేను చేస్తున్నాను. ఆయన మరో పని చేస్తున్నాడని చెప్పాడు.
ఆగు నీ వెంట నేను వస్తానని ఉపాధ్యాయుడు అన్నాడు.
మీరెందుకు సార్‌ పారిపోవడం? అన్నాడు అటెండర్‌. నేను కూడా ఇక్కడ మరో ఉపాధ్యాయుడి విధులే నిర్వహిస్తున్నాను. నేను వెళ్లి ఆ ఉపాధ్యాయుడిని పంపించాలన్నాడు. ఈ విషయం డీఈవో చెవిన పడిరది. వెంటనే అక్కడున్న హెడ్మాస్టర్‌ను డీఈవో నిలదీశాడు. ఏం జరుగుతోంది. ఇది స్కూలనుకున్నారా? లేక పశువుల కొట్టమనుకుంటున్నారా? జీతాలు తీసుకుంటున్నది ఒకరు. విధులు నిర్వహిస్తుది మరొకరు. నేను ఉపేక్షించే సమస్యే లేదని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో హెడ్మాస్టర్‌ భయపడిపోయి డీఈవోకు లంచం ఇచ్చి ఆయనను చల్లబరిచే ప్రయత్నం చేశాడు. అయినా మీరెందుకు నాకు లంచం ఇవ్వాలనుకుంటున్నారు..అని డీఈవో హెడ్మాస్టర్‌ను ప్రశ్నించారు. నేను హెడ్మాస్టర్‌ను కాదు. ఆయన ప్లేస్‌లో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాద్యాయుడిని, మీరొస్తున్నారని ముందే తెలిసి ఈ సొమ్ము మీకు ఇవ్వమని అసలు హెడ్మాస్టర్‌ చెప్పారని నకిలీ హెడ్మాస్టర్‌చెప్పారు. ఆ సొమ్మును తాపీగా పుచ్చుకున్న డీఈవో మాట్లాడుతూ నేను వచ్చాను కాబట్టి ఈ సొమ్ముతో వదిలేస్తున్నా..అసలు డీఈవో వస్తే మరింత ఇవ్వాల్సివచ్చేదని అన్నాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు. అక్కడికి వచ్చింది కూడా డీఈవో బినామీ…ఇలా సాగుతోంది. అధికారుల ఇష్టారాజ్యం. ఇది అన్ని శాఖలకు అన్వయించుకోవచ్చు.
తెలంగాణలో అనేక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అనారోగ్య రిత్యా అని సాకు చూపి, బైట రియలెస్టేట్‌ వ్యాపారాలు, ఫైనాన్స్‌ వ్యాపారాలు నిర్వహిస్తూ,నిరుద్యోగులైన వారికి ఎంతో కొంత ముట్ట జెప్పి విద్యావ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు.
ఇలా అంతే కాదు పాఠశాలలు, కాలేజీలలో కూడా అసలైన ఉపాధ్యాయులుగా చెలామణి అవుతున్నవారిలో ఎంతో మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు కొన్ని వేల మంది వున్నారు. అసలు వున్నాయో లేవో తెలియని యూనివర్సిటీల సర్టిఫికెట్లు సమర్పించుకొని ఉద్యోగాలు పొందిన వారున్నారు. తర్వాత ప్రమోషన్లకోసంకూడా అనేక సర్టిఫికెట్లు తెచ్చుకొని పై స్ధాయికి చేరుకున్నవారు వున్నారు. ఇది ఒక్క విద్యా వ్యవస్ధలోనే కాదు, అన్ని శాఖల్లో ఇలాంటి వారు అనేకం వున్నారు. రేపటి తరాన్ని ఉన్నతంగా తయారు చేయాల్సిన వ్యవస్ధనుంచి మొదలు దేవుడి కొలిచే వ్యవస్ధలో కూడా ఇలాగే ఉద్యోగాలుపొందిన వారు, ప్రమోషన్లుపొందిన వారున్నారు. వారిపై ఎన్ని ఆరోపణలు వున్నా, పట్టించుకున్నవారు లేరు. ఇలాంటి వారు అవినీతిని ఆశ్రయించకుండా, నీతిగా పనిచేస్తారని ఎవరైనా ఊహించగలమా? ఆ మధ్య వేముల వాడ దేవాలయంలో పెద్దఎత్తున విజిలెన్స్‌ దాడులు జరిగాయి. ఓ పదమూడు మంది ఉద్యోగుల మీద పిర్యాధులు అందాయి. వారు చేస్తున్నదంతా తప్పని తేలింది. అంతే కాకుండా కొంత మంది అధికారులు ఏకంగా తప్పుడు ద్రువప్రతాలు సమర్పించినట్లుకూడా వెల్లడైంది. కాని ఏం చేశారు. విజిలెన్స్‌ అదికారులు కూడ తనిఖీల పేరుతో తూతూ మంత్రంగా తమ పని కానిచ్చేశారు. రిపోర్టు తయారుచేసి చేతులు దులుపుకున్నారు. దానిని అమలు చేసేవారు ఎవరు? పట్టించుకునేవారు ఎవరు? అలాగే వరంగల్‌లోనే ఎంతో పేరు గాంచిన ఓ విద్యాలయంలో అద్యాపక బృందాలే అవినీతిని పాల్పడ్డాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని తెలుస్తోంది. వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసినట్లు సమచారం. అంతే కాకుండా ఆ కాలేజీ ప్రభుత్వ పరం కావడం కోసం జరిగిన ప్రయత్నాలను కూడా కొందరు అధికారులు అవినీతికి ఆలవాలం చేశారంటే అర్దం చేసుకోవచ్చు. ఒక్కసారి అవినీతిసొమ్ముకు అలవాటు పడ్డారంటే, ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా సరే లంచం లేకుండా పనిచేయరు. ఫైలు ముందుకు కదలదు.
అంతర్యామి..సర్వాంతర్యామి అవినీతే.
అవినీతి లీలలు..ఉద్యోగులు బాగోతాలు. అటెండర్‌ దగ్గర నుంచి మొదలు అధికారుల దాకా లీలలే లీలలు. నకిలీలే నకిలీలు. అన్న అటెండరైతే తమ్ముడు విధులు నిర్వర్తిస్తాడు. అధికారి పనులు తప్పించుకొని అనుచరుల చేత పనులు చేయిస్తాడు. వారి చేత వచ్చే ముడుపులు బీరువాలో పెట్టుకుంటాడు. తన తాళాలు అనుచరుల చేతిలో పెట్టి, ప్రభుత్వాన్ని , ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖల్లో ఈ తంతు విపరీతంగా జరుగుతోంది. రెవిన్యూ శాఖలో కుల, ఆదాయ, నివాస దృవీకరణ పత్రాలే కాదు, ఆర్ధికపరమైన అంశాలు కూడా అనుచరులే చేసిపెడుతున్నారు. మీటింగుల పేరుతో పెద్ద పెద్ద అధికారులు డుమ్మాలు కొడుతుంటారు. ఇంటినే వసూళ్లకుఅడ్డాలుగా మార్చుకుంటున్నారు. కార్యాలయాల్లో అనుచరులతో పనులు కానిచ్చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలుసు. కింది స్దాయి ఉద్యోగులకు తెలుసు. కాని అడిగేవారేరీ…నిలదీసేవారేరి. ప్రశ్నిస్తే ప్రభుత్వాధికారులు విధులకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ ఎదురు కేసులు పెడుతుంటే, నష్టపోతున్నది బాదితులే..సామాన్యులే. రైతులపై చేయిచేసుకుంటూ, కిందపడేసి బూట్లతో తొక్కుతూ, బూతులు తిడుతూ పోలీసులు పిర్యాధులు చేసి, రైతులను అరెస్టు చేయిస్తున్న దిక్కుమాలని వ్యవస్ధలో మనం మనుగడ సాగిస్తున్నాం. ఇక అంత గొప్ప అధికారులు చేసేవి పెద్ద ఉద్యోగాలు. చదివింది అత్తెసరు చదువులు.
చాలా మంది ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతోనే ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందినట్లు కూడా అనేక ఆరోపణలు అనే మంది మీద వున్నాయి.
నివేదికలు వున్నాయి. అయినా వారిపై చర్యలు తీసుకున్నది లేదు. వారి ఉద్యోగాలు తొలిగించింది లేదు. వారిని జైలుకు పంపిందిలేదు.అలాంటి వారే విచారణాధికారులుగా చెలామణి అవుతున్న డిపార్టుమెంట్లుకూడా వున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదు. అన్ని శాఖల్లో అదే తంతు..అవినీతి అదికారులే పెత్తనం చేసే వంతు. వారికే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు. విచారణ చేసేవారు కూడా చేతి వాటానికి అలవాటు పడి వ్యవస్ధను సర్వనాశనం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారడం లేదు. ఈ రెండు నెలల కాలంలో ఎంతోమంది అధికారులు ఏసిబికి చిక్కారు. హెచ్‌ఎండిఏకు చెందిన బాలకృష్ణ దగ్గర నుంచి, వారం రోజుల క్రితం శామీర్‌పేట ఎమ్మార్వో, తాజాగా ఓ మహిళా ఉద్యోగి పట్టుబడ్డారు. జనం నుంచి లంచం లాగేటప్పుడు పెద్ద పులిలా గాండ్రిస్తారు. పట్టుబడినప్పుడు మాత్రం పిల్లిలాగా ముఖం పెడతారు. ఏం తప్పు చేయని అమాయకుడిలా ముఖకవలికలు చూపిస్తారు. అయ్యో ఎంతో అమాయకులను అనవసరంగా ఇరికిస్తున్నారా? అన్నట్లు చూస్తారు.

లంచావతారలు ఎపిసోడ్‌ 3
వారి సర్టిఫికెట్లు ఫేక్‌ అట!
ఆ ఉద్యోగులందరూ అనర్హులే నట?
మీ ‘‘నేటిధాత్రి’’లో ఎక్స్‌ క్లూజివ్‌ గా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *