
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ పీ.హెచ్.సీ లో సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. గర్భిణీలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని, ఇక్కడ అందుతున్న సేవలు, వసతుల పై అవగాహన కల్పించాలని నిరంతరం పరీక్షలు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సర్కార్ దవాఖానల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై ఆసుపత్రికి వచ్చే వారికి వివరించాలని తెలిపారు.