https://epaper.netidhatri.com/view/309/netidhathri-e-paper-4th-july-2024%09
`‘‘అంజన్న’’కే ‘‘సెటగోపం పెట్టిన’’ వదిలేస్తారా.!
`కొండగట్టుకు గ్రహణం పట్టిస్తున్న దుష్ట గ్రహాలు.!
`ఆ తొమ్మిది మందిని తప్పించరా.!
`పదేళ్లయిన విజిలెన్స్ రిపోర్ట్ను పట్టించుకోరా.!
`దోషులని తేలిన తప్పించరా.!
`‘‘నేటిధాత్రి’’ చేతిలో ‘‘18 పేజీల’’ విజిలెన్స్ రిపోర్ట్..
ప్రపంచంలోని కోట్లాది మంది హిందులలో ఒక్కొక్కరు ఎంతో మంది దేవుళ్లను కొలుస్తుంటారు. తమ ఇలవేల్పులుగా దేవుళ్లుకు పూజలు నిర్వహిస్తుంటారు. మొత్తం హిందువులు ఆంజనేయ స్వామిని మాత్రం అందరూ కొలుస్తుంటారు. కారణం హనుమంతుడు ఆపద మొక్కులు తీర్చుతాడని నమ్మకం. భయం పోగడతాడని అంచెంచల విశ్వాసం. పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి గాలి సోకుంగా, దిష్టి తగలకుండా, ఎలాంటి చెడు చూపులు ఆ పిల్లల మీద పడకుండా ఆంజనేయ స్వామి లాకెట్‌ను మెడలో వేస్తారు. ఆ పిల్లల ఆలనా,పాలన అంతా ఆ అంజన్న చూసుకుంటాడని ప్రగాఢంగా నమ్ముతారు. కేవలం మన దేశంలోనే వుండే హిందులే కాదు, ప్రపంచంలో వుండే హిందులంతా కొలిచే దైవం ఆంజనేయ స్వామి మాత్రమే. ఎవరు ఎంత మంది దేవుళ్లను కొలిచినా, అంజన్నను కొలువకుండా ఏ ఒక్కరూ వుండరు. ఆంజనేయ స్వామి అంటే దెయ్యాలు, భూతాలు కూడా పారిపోతాయంటారు. భయపడి దాక్కుంటాయంటారు. అంతటి మహిమాన్విత అంజన్న సన్నిధిలో అక్రమాలు జరగడం విడ్డూరం. అంజన్న సన్నిధిలో ఉద్యోగుల్లో భయం లేకపోవడం గమనార్హం. అంతెందుకు అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన బరాక్ ఒబామా కూడా ఎప్పుడూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎప్పుడూ తన కోటు జేబులో పెట్టుకుంటాడు. నిత్యం కొలుస్తుంటాడు. స్వయంగా ఆయనే ది పవర్ పుల్ గాడ్ అంటూ అనేక సార్లు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ఏర్పాటు ప్రక్రియ, రాజకీయ ప్రస్ధానం ప్రారంభించారు. ఈ ఎన్నికల ముందు వారాహి వాహనానికి కూడా పూజలు కొండగట్టు అంజన్న దగ్గరే చేయించారు. ఎన్నికల ముందు వెళ్లారు. గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొండగట్టుకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా కొన్ని లక్షల మంది ఏటా దర్శించుకొని, తమ బాధలు అంజన్నకు చెప్పుకొని, ఆ సమస్యలు తీరితే మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క తెలంగాణ నుంచే కాదు, ఏపి, కర్నాకట, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అంజన్నను దర్శించుకుంటారు. ఇలవేల్పుగా కొలుస్తుంటారు. మరి అలాంటి కొండగట్టు అంజన్న అంటే భయం, భక్తి కేవలం భక్తులకేనా? అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆ భయం లేదు! భక్తిలేదా? అంజన్న సన్నిధిలో పని చేసుకుంటూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన వారికి శిక్షలే లేవా? అంజన్న సొమ్మును ఇష్టారాజ్యంగా మేస్తూ వుంటే కూడా చూసుకుంటూ కూర్చుంటారా? 2014లో తెలంగాణ వచ్చిన కొత్తలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పనిచేసే ఉద్యోగులలో 9 మంది అనేక అక్రమాలు చేసినట్లుగా అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడు విజిలెన్స్ అధికారులు లెక్కలు నిగ్గు లేల్చారు. రిపోర్టు ఇచ్చారు.
తొమ్మిది ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తెల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కాని ఆ అవినీతి అధికారులను ఎవరూ కదలింలేదు. వారిపై చర్యలు తీసుకోలేదు. అందుకు బాధ్యులు ఎవరు? గతంలోనే నేటిధాత్రి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో అక్రమార్కులున్నారని రాయడం జరిగింది. అంజన్న సన్నిధిలో పాతుకుపోయిన అవినీతి దుష్టగ్రహాలు అని కూడా వార్తలు ప్రచురించడం జరిగింది. కాని స్పందించిన వారు లేరు. ఇటీవల బిఆర్‌ఎస్‌కు చెందని ఓ పత్రిక వరస కథనాలు రాస్తోంది. గత పదేళ్లుగా అధికారంలో వున్నది బిఆర్‌ఎస్ పార్టీ. ఆ సమయంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినా, అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పినా, జాప్యం చేసింది ఎవరు? అలసత్వం వహించింది ఎవరు? నిర్లక్ష్యంగా పదేళ్లపాటు ఉద్యోగులను వదిలేసిందెవరు? అవినీతి ఉద్యోగులను కాపాడిరదెవరు? లక్షల్లో అవినీతి చేసిన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించకుండా కాపాడిరది బిఆర్‌ఎస్ నేతలు కాదా? ఆనాడు నేటిదాత్రి రాసిన కధనాలు వాళ్లు చూడలేదా? అయినా ఎందుకు ఉపేక్షించారు. అవినీతి ఉద్యోగులను ఎందుకు వెనకేసుకొచ్చారు. తూతూ మంత్రంగా ఓ ముగ్గురు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేసి, మళ్లీ కొండగట్టులో తిష్టవేయడానికి సహాకారం అందించిందెవరు? బిఆర్‌ఎస్ నేతలు కాదా? కొండగట్టు అంజన్న సన్నిధిలో బస్సు ప్రమాదం జరిగి 51 మంది భక్తులు చనిపోయిన నాడు కూడా కనీసం ప్రగతి భవన్ దాటకుండా, వారిని పరామర్శించని కేసిఆర్ ఏనాడైనా అవినీతి అధికారులు గురించి పట్టించుకున్నాడా? కొండగట్టు ఆలయ అభివృద్దికి పాటుబడ్డారా? అయ్య అట్ల..కూతరు ఇట్ల అన్నట్లు…కొండగట్టు అంజన్నను ఇలవేల్పుగా కొలిచే కవితకు అక్కడి ఉద్యోగుల అవినీతి కనిపించలేదు. ఎవరూ చెప్పగా వినలేదా? నేటిధాత్రిలో అప్పట్లోనే వచ్చిన కథనాలు చూడలేదా? కొండగట్టు అంజన్న ఆలయంలో అవినీతి ఉద్యోగుల గురించి ప్రపంచమంతా కోడై కూసినా కవితకు వినిపించలేదు. చిత్తం శివుని మీద భక్తి జోళ్ల మీద అన్నట్లు కవిత కేవలం రాజకీయం కోసమే పూజలు చేయించేదా? పదే పదే అంజన్న సన్నిధిలో అనేక హోమాలు, యజ్ఞాలు చేయించేదా? అవుననే అనాల్సి వస్తుంది. అలా లేని భక్తిని నటించి, తన రాజకీయ పబ్బం కోసం పాకులాడడం వల్లనే ఇప్పుడు ఆమె పరిస్ధితి జైలు దాకా వెళ్లింది. గతంలోనే జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆమె స్పందించి దేవాలయంలో అక్రమార్కులు లేకుండా చేస్తే ఎంతో మంచి పేరు వచ్చేది. దేవుడి ఆశీస్సులు కూడా వుండేవి. కాని దేవుడినే మోసం చేస్తున్న వారితోనే ఆమె కైంకర్యాలు నిర్వహించే పనిచేయడమే ఆమెకు పాపం చుట్టుకున్నదని భక్తులు కూడా అంటున్నారు. నిజానికి ఏ ప్రభుత్వం వున్నా అవినీతి అధికారులను ఉపేక్షించడం అన్నది తప్పు. గతంలో ఈ తొమ్మిది అవినీతి ఉద్యోగులను వెంటనే తొలగిస్తే, ఇతర ఉద్యోగులకు భయం వుండేది. ఎంత పెద్ద తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా తమ ఉద్యోగాలుకు ఢోకా వుండదన్న నమ్మకం వారికి ఎలా కలిగింది.
కనీసం దేవుని సొమ్ము తినకూడదన్న కనీస ఇంగితం వారిలో ఎలాగూ లేదు. వారికి జ్ఞానోదయం చేసేవారులేరు. తెలియక తప్పు చేస్తే క్షమించొచ్చు. కాని తెలిసి తెలిసి తప్పులు చేసేవారిని ఉపేక్షించినా, రక్షించడం కూడా తప్పే. గతంలో వారికి శిక్ష పడలేదు. అందుకే అదే అక్రమార్కులు పదే పదే తప్పులు చేస్తున్నారు. లక్షల రూపాయలు దిగమింగుతున్నారు. ఆ ఉద్యోగులు అవినీతి పరంపర కొనసాగుతూనే వుంది. గతంలో వేసిన విజిలెన్స్ రిపోర్టు అంటే కూడా వారికి భయం లేకపోవడం మూలంగానే పదే పదే సొమ్ము దిగమింగుతున్నారు. భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో స్వీకరించే ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నారంటే అంతకన్నా దుర్మార్గులు ఎవరైనా వుంటారా? అలాంటి వారిని ఉపేక్షిస్తారా? దేవుని సన్నిధిలో వున్న కాటేజీల సొమ్ముకూడా తింటున్నారు. ఆఖరుకు ఇష్టాను సారం కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, వారికి చెల్లించే జీతాలకు లెక్కలేకుండా అంజన్న సొమ్మును దిగమింగుతుంటూ చూసింది గత పాలకులు. అందుకే కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందిచాల్సిన అవసరం వుంది. గత పాలకులాగా వదిలేయకండి. అంజన్న ఎంత పవర్ పుల్ దేవుడో తెలిసి కూడా తప్పులు చేసేవారిని క్షమించొద్దు. భక్తుల నమ్మకాన్ని వమ్ముచేయొద్దు. భక్తుల విశ్వాసాలను పలుచన చేయొద్దు. ఏపిలో ఏం జరిగింది. తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో జగన్ ప్రభుత్వం చేసిన అపచారాల మూలంగా జరిగిందేమిటో చూశాం. అంతెందుకు తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసిఆర్ ఓడిపోవడం, కవిత రాజకీయ జీవితం పతనం వంటివి కూడా అంజన్న ఆగ్రహంలో భాగాలుగానే చూడాలి. అవి చూసైనా కొత్త ప్రభుత్వం కళ్లు తెరవాలి. అక్రమార్కులను వెంటనే శిక్షించాలి. వారు చేసిన అవినీతిని కక్కించాలి. దేవాదాయశాఖలో పనిచేస్తూ, దేవుడి సొమ్మును దిగమింగేవారిని కఠినంగా శిక్షించాలి. లేకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. వారు పెట్టే శాపాలు కూడా పాలకులకు తగుతుంటాయి. అంజన్న దర్శనానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాల్సిన ఉద్యోగులు, అంజన్నకు శఠగోపం పెట్టేందుకు మాత్రమే పనిచేస్తే వాళ్ల సేవలు ఎందుకు? వాళ్లుకు అంజన్న సన్నిధిలో కొలువులెందుకు? ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి వెంటనే స్పందిస్తే అంజన్న ఆశీస్సులు కూడా అందుతాయని భక్తులంటున్నారు.