ప్రభుత్వం మారగానే “కండువా మార్చాడు”…. “కబ్జాలు” మొదలుపెట్టాడు..?
తన అక్రమాలను “వివేకం”గా కప్పేశాడు?
విలువైన ప్రభుత్వ స్థలంపై కన్నేసి పార్టీ మారిన నాయకుడు
రామకృష్ణాపూర్, మార్చి18, నేటిధాత్రి:
ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా కావాల్సిందేనా ?….. ఆ భూమి కాస్త “పొలం”వశం కావాల్సిందే నా? అని క్యాతనపల్లి పుర ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.పుర ప్రజల అనుమానమే నిజమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనమే పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలోని సర్వే నెంబర్ సెవన్ లోగల ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో అధికార పార్టీ నాయకుడే తెర వెనకుండి తతంగమంతా నడిపిస్తున్నాడని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకుడు ప్రభుత్వం మారగానే మళ్లీ పార్టీ మారి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారినా సరే మా అధికారం మాత్రం పోదు అనే దురాలోచనలో నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది… తెర ముందు తమ్ముడిని నిలిపి తెరవ వెనక తతంగమంతా నడిపిస్తున్నాడని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. భూమిని చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆ స్థలం కాలనీవాసులు చెత్త వేసేందుకు ఉపయోగించినట్లు తెలుపుతున్నారు.కానీ ఆ స్థలం మాదే అంటూ ఒక పేపర్ సృష్టించి రౌడీలను మోహరించి స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కాలనీ ప్రజలు అంటున్నారు. రాత్రికి రాత్రి జేసిబి నీ పెట్టి భూమిని చదును చేసి పెన్సింగ్ వేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ భూమి ప్రభుత్వ భూమి అని ప్రజలు వెళ్లి అడగగా రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కాలనీ ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వ హాయంలో క్యాతనపల్లి మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో కబ్జాలకు గురవుతున్నా ప్రభుత్వ భూములను రక్షించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు వడ్డింది. ప్రస్తుత ప్రభత్వ హయాంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా సరే సంబంధిత అధికారులు ఇటువైపు ఎందుకు రాలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.గతంలో కబ్జాలు చేసేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమైన కొంతమంది ఇప్పుడు తిరిగి ఆభూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి ప్రయత్నాలకు బడా నాయకులు సైతం ఆపన్న హస్తం అందిస్తున్నట్లు తెలిసింది.అందులో భాగంగానే భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలోని సులభ్ కాంప్లేక్ష్ సమీపంలో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కబ్జాకు గురవుతున్న భూమి పక్కననే గతంలో ప్రభుత్వ అధికారులు ఈ భూమి ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు.21 వవార్డులో కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు తాసుకోవాలని, మిగతా వార్డుల్లో సైతం ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ఫెన్షింగ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వభూములు కబ్జాచేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం మారితే మా తలరాతలు మారుతాయని అనుకున్నామని కానీ ధనార్జనే ధ్యేయం గా భూ ఆక్రమణలకు నాయకులు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతన్నారు. కబ్జాలు చేసే వారిని పార్టీలో చేర్చుకోవడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుర్రుమంటున్నారు. నిన్నటి వరకు మేము పోరాడింది ఈ భూ భాకాసురల పైనేనని మళ్లీ తిరిగి పార్టీలో చేరి అదే పని చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఏ పార్టీ నాయకులైనా సరే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలని స్థానిక చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పుర ప్రజల కోరుతున్నారు.
ప్రభుత్వ భూమి అయితే కాపాడుతాం :
మందమర్రి ఎమ్మార్వో చంద్రశేఖర్
రామకృష్ణాపూర్ పట్టణంలోని 21 వ వార్డు భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియా లోని సులబ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయంపై మందమర్రి ఎమ్మార్వో చంద్రశేఖర్ ను నేటిధాత్రి విలేకరి వివరణ కోరగా…. అది ప్రభుత్వ భూమి అయితే ఖచ్చితంగా కాపాడి తీరుతామని, కబ్జాకు గురైన ఆ భూమి విచారణ లో ప్రభుత్వ భూమి అని తేలితే చుట్టూ పెన్షింగ్ వేస్తామని,సూచిక బోర్డును సైతం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో అన్నారు.
స్థానిక కౌన్సిలర్ పార్వతి విజయ ను వివరణ కోరగా….
భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియా ప్రాంతంలోని సర్వే నెంబర్ 7 లో గల ప్రభుత్వ భూమిలో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని ఓ ప్రజా ప్రతినిధి తమ్ముడు కబ్జా చేస్తున్నాడని తెలిసిందని అన్నారు. మందమర్రి ఎమ్మార్వో కు సైతం సమాచారం అందించామని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే వివేక్ కు కూడా సమాచారం అందించామని అన్నారు.