కోచింగ్‌.. చీటింగ్‌!

https://epaper.netidhatri.com/view/326/netidhathri-e-paper-21st-july-2024%09

`కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన.

`గోల్‌ మాల్‌ గోవిందం!

`‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు!

`అకాడమీ లకు హద్దుండదు.

సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం.

`పైకి మాత్రం కి విద్యా వికాసం.

`జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం.

`లక్షల మందికి కోచింగులు.

`వేలాది రూపాయల ఫీజులు.

`చెతికందేవి ఎన్ని కొలువులు?

`అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు.

`విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి.

`పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో గ్రూప్‌ 2,3 పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆగష్టు నెలలో జరగాల్సిన పరీక్షలు. కాని జరగడం లేదు. కారణం అభ్యర్ధుల నుంచి వచ్చిన ఒత్తిడి అన్నది అందరూ చెప్పుకునే మాట. కాని దాని వెనుక కోచింగ్‌ సెంటర్ల మాయా జాలం వుందన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కోచింగ్‌ సెంటర్ల మాఫియా మూలంగానే జరిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికి ఇంత కాలం వాయిదా కోసం ఉద్యమాలు చేయించారు. దాని వెనుక కూడా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకల ప్రోద్భలం వుందన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ఈ పరీక్షల వాయిదా వల్ల కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ కల వచ్చిందనే చెప్పాలి. కనీసం ఆరు నెలల పాటు ఇక కోచింగ్‌ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా బ్యాచ్‌లు నిర్వహిస్తారు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కోచింగ్‌ సెంటర్లు క్లాసులు చెప్పే సమయంలో వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌ కోచింగ్‌ల పేరుతో ప్యాకేజీలు కూడా అమ్ముకుంటున్నారు. దాంతో అటు యూ ట్యూబ్‌ నుంచి ఆదాయం. దానికి తోడు ఉచిత ప్రచారం. ఆన్‌లైన్‌ ప్యాకేజీ కింద ఒక్కొ అభ్యర్ధి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తాయి. సెంటర్ల నిర్వహణతో వచ్చే ఆదాయం అదనం. అదే అసలైన సంపాదనకు మార్గం. ఇక చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మూతబడిన కోచింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకుంటాయి. ప్రభుత్వం కూడా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పడంతో ఇక ఐదేళ్లపాటు విరామం లేకుండా సెంటర్లు నిర్వహిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు తమ చదువు పూర్తి చేసుకొని వస్తుంటారు. వారికి రకరకాల విద్యా కోర్సుల కోసం, ఉద్యోగాల కోసం కోచింగ్‌లు ఇస్తుంటారు. గ్రూప్‌ పరీక్షల వాయిదా వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చన్నది ఒక అంచానా. డిఎస్సీ వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం సమకూరేది. గ్రూప్‌ పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసినా, కోచింగ్‌ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కారణం ఉద్యోగాలు తక్కువగా వుంటాయి. డిఎస్సీ పదకొండు వేల ఉద్యోగాలున్నాయి. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు వుంటాయి. కోచింగ్‌ సెంటర్లలో కొంత తర్ఫీదు తీసుకుంటే పరీక్ష సులువౌతుందన్న భావన వారిలో కలుగుతుంది. అందుకే కొందరు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కృత్రిమ ఉద్యమం లేపారు. పరీక్షల నిర్వహణతో అంతా చల్లబడిరది. గ్రూప్‌ పరీక్షలు వాయిదా పడడంతో ఆగిపోయింది.
ట్యుటోరియల్స్‌, కోచింగ్‌ సెంటర్ల మూలంగా లక్షల్లో వుండే పై చదువులకు అవసరమైన కోర్సుల్లో సీట్లు సాధించేందుకు కొంత వరకు ఉపకరిస్తాయేమో కాని, వందల్లో, కొన్ని సార్లు వేలల్లో వుండే ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయనుకోవడం మాత్రం పూర్తిగా భ్రమే. సహజంగా ఏ రాష్ట్రాలలో అయినా గ్రూప్‌ పరీక్షల నిర్వహణతో ప్రభుత్వాలు ఎంపిక చేసే ఉద్యోగాలు కేవలం వందల్లోనే వుంటాయి. ఒక్క డిఎస్సీ లాంటి పరీక్షలే కొన్ని సార్లు వేలల్లో వుంటాయి. అంతే కాని వందల్లో వుండే గ్రూప్‌1, గ్రూప్‌2 పరీక్షలు కేవలం కోచింగ్‌ సెంటర్లలలో చదువుకున్నవారికే ఉద్యోగాలు వస్తాయన్నది ముమ్మటికీ అబద్దం. ఏ కోచింగ్‌ సెంటరైనా సరే పరీక్షల్లో మెలుకవలు నేర్పుతారు. పరీక్షల్లో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నదానిపైనే ఎక్కువ దృష్టిపెడతారు. కాకపోతే పరీక్షల విధానంలో తర్పీదు ఇవ్వడంలో కోచింగ్‌ సెంటర్ల పాత్ర కొంత వరకు ఉపయోగకరమే తప్ప, పూర్తిగా దోహరపడతాయని చెప్పడం మాత్రం శుద్ద అబద్దం. ఒక తెలివైన అభ్యర్ధి కోచింగ్‌ వెళ్తే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం మెరుగౌతుంది. అంతే తప్ప ఆ తెలివైన అభ్యర్ధి కేవలం కోచింగ్‌కు వెళ్లడం వల్లనే ఉద్యోగం సంపాదించాడని చెప్పలేం. కారణం ఎంతో మంది కోచింగ్‌కు వెళ్లే స్తోమత లేని వాళ్లు కూడా ఉద్యోగ నిర్వహణ పరీక్షల్లో కూడా ఫస్టు ర్యాంకు సాధించిన వారున్నారు. కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లందరూ మొదటి ర్యాంకులుసాధించినట్లు పెద్దగా చరిత్రలుకూడా లేవు. అంతే కాదు గ్రూప్‌1 లో ప్రభుత్వాలు ప్రకటించే కొలువులు ఎన్ని వుంటాయో, తెలంగాణ మొత్తం మీద అన్ని కోచింగ్‌ సెంటర్లు వున్నాయంటే ఆశ్చర్యపోవనవసరం లేదు.
ఇటీవల కోచింగ్‌ సెంటర్లలో చదువుకుంటే తప్ప కొలువులు రావన్న భ్రమలు యువతలో బాగా కల్పించారు. ఎందుకంటే ఉద్యోగాల పరంపర అలా కొనసాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో చాల మంది అప్పటి అధికారుల కనుసన్నల్లో నడిచిన కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చినట్లు పెద్దఎత్తున ప్రచారం వుండేది. అందులో కొంత వాస్తవం కూడా వుంది. అందుకే ఉద్యోగార్ధులు కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. వాళ్లు తయారు చేసిన మెటీరియల్‌ నుంచే ప్రశ్నలు వస్తాయన్న భ్రమలు కల్పించారు. అదే నిజమైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్లంతా కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లే అయి వుండాలి. కాని అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. కాని అందమైన బ్రోచర్లు తయారు చేయడం, ఉద్యోగాలు పొందిన వారితో ఇంటర్వూలు చేయించడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గరే పూర్తి సమయం చదువుకున్న అభ్యర్ధులకు డబ్బులిచ్చి కూడా తమ కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్నట్లు కూడా ప్రచారం చేయించుకుంటూ వస్తున్నారు. దాంతో యువత ఆకర్షితులౌతున్నారు. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఆ ప్రచారం మరీ విపరీతమైంది. దాంతో గ్రామీణ యువత కోచింగ్‌ సెంటర్లవైపు చూడడం అలవాటు చేసుకున్నారు. నిత్యం కోచింగ్‌తోపాటు, పరీక్ష నిర్వహణ వంటివి చేస్తుంటారు. అయినా ఉద్యోగాలు పొందని వారే ఎక్కువగా వుంటారు. తెలంగాణలో కొన్ని వందల కోచింగ్‌ సెంటర్లు వున్నాయి. అన్నింటి నుంచి ఉద్యోగాలు పొందుతున్న వారు ఎంత మంది? కోచింగ్‌లు తీసుకున్నవారు ఎంత మంది? అన్నది లెక్కేస్తే అసలు బండారం బైటపడుతుంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా ఇంటి వద్ద చదువుకున్నవారు కూడా రెండు మూడు ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా చాల మంది వున్నారు.
కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఎందుకంటే కోచింగ్‌ సెంటర్లు విద్యా వ్యవస్దలకు అనుసంధానమై వుండవు. ఎందుకంటే అవి ట్యూషన్‌ సెంటర్లుగానే పరిగణిస్తారు. కాని కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం వేల కోట్లలో వుంటుంది. ఒక కోచింగ్‌ సెంటరు ఏర్పాటుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఎవరి నుంచి పర్మిషన్లు పొందాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిబంధనలు లేవు. ఆంక్షలు అసలే లేవు. ఎందుకంటే అది విద్యా సంస్ధలు కాదు. ఒక స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే సవాలక్ష నిబంధనలుంటాయి. ఒక కాలేజ్‌ ఏర్పాటుకు కూడా అనేక రకాల అనుమతులు పొందాల్సివుంటుంది. కోచింగ్‌ సెంటర్లు కూడా స్కూళ్ల మాదిరిగానే పనిచేస్తాయి. పైగా స్కూళ్లు, కాలేజీలు వేసవి కాలంలో మూసేస్తారు. కాని కోచింగ్‌ సెంటర్లు అప్పుడే ఎక్కువ నిర్వహిస్తారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, నిబంధనలుంటాయి. ఏ క్లాసుకు ఎంత చార్జి వసూలు చేయాలన్నదానిపై స్పష్టమైన గైడ్‌ లైన్స్‌ వుంటాయి. కాని కోచింగ్‌ సెంటర్లకు ఎలాంటి లెక్క లేదు. ఉద్యోగార్ధులు కోచింగ్‌ కోసం వెళ్లడానికి ఆ సెంటర్ల నిర్వాహకులు నిర్ణయించిన దానికి కట్టుబడే చేరుతుంటారు. కారణం భవిష్యత్తు. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం. కొందరు ఒక్కసారి కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్‌ తీసుకుంటూనే వుంటారు. అలా ఏళ్ల తరబడి తీసుకునేవారు కూడా వున్నారు. పలు కోచింగ్‌ సెంటర్లు మారుతుంటారు. అన్ని కోచింగ్‌ సెంటర్లకు ఫీజులు వదిలించుకుంటుంటారు. అయినా ఉద్యోగాలు రాని వాళ్లు చాలా మంది వున్నారు. అలాంటప్పుడు కోచింగ్‌ సెంటర్ల గొప్పదనం ఏమీ లేదు. కాని వాళ్ల వ్యాపారానికి ఢోకా వుండదు. కోచింగ్‌ సెంటర్లు సంపాదనకు ఎలాంటి ఐటి కూడా అవసరంలేదు. కాని వచ్చే ఆదాయాన్ని ఎవరూ చూపించరు. అందుకు అవసరమైన బిల్లు బుక్కులు కూడా సరిగ్గా వుండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *