రాజకీయం పులకరించే నేల తెలంగాణ.

https://epaper.netidhatri.com/view/289/netidhathri-e-paper-9th-june-2024%09/2

-రాజకీయ స్నేహ బంధం తెలంగాణ!

-పలకరింపుల పులకరింతలే తెలంగాణ నిండా.

-తెలంగాణలో ప్రజల ఐక్యత..నేతల సఖ్యత.

-ప్రజాస్వామ్యం ఫరిడమిల్లే రాజకీయాలకు తెలంగాణ వేధిక.

-కక్ష్య సాధింపులకు చోటు లేని బాసట.

-తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు.

-స్వార్థపూరిత రాజకీయాలను సహించరు.

-తెలంగాణ రాజకీయాలు చాలా బెటర్‌!

-ఆధిపత్యపోరంటే మాటల వరకే..

-ఏపిలో లాగా దాడులు వుండవు.

-ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడూ అంతే.

-సహృద్భావ వాతావరణానికి పెట్టింది పేరు.

-గెలిచిన వారు పొంగిపోరు.

-ఓడిన వారు కుంగిపోరు.

-ప్రతిపక్షాలను ఎప్పుడూ చులకన చేయరు.

-ఎదురు పడినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు.

-ఎన్నికల వరకే పార్టీలు.

-ఆ తర్వాత అందరూ స్నేహితులు.

-రాజకీయాలను కుటుంబాల వరకు వెళ్లనీయరు.

-వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూడరు.

-వ్యక్తిగత ప్రతిష్ఠలు దిగజార్చుకోరు.

-ఆదర్శ రాజకీయాలంటే తెలంగాణ.

-అద్భుతమైన నాయకులంటేనే తెలంగాణ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలు ఎటు పోతున్నాయి. సహృద్భావమైన రాజకీయ వాతావరణాన్ని ఎవరు చెడగొడుతున్నారు. ఆదిపత్య రాజకీయాలు ఎక్కడైనా సహజమే. కాని వేధింపుల రాజకీయాలు చేయడం ఏమిటి? దాడుల సంస్కృతి ఎందుకు? ఈ విపరీతమైన ధోరణి ఎందుకు? తెలుగు జాతి మనది. నిండుగ వెలుగు జాతి మనది. అంటూ పాటలు పాడడం వరకేనా? ఐకమత్యమే మహా బలం అన్నది రాజకీయాలకు వర్తించవా? అది ఏపార్టీ అయినా సరే ..విష సంస్కృతి మంచిది కాదు. రాజకీయాలు అన్నవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే వుండాలి. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. ప్రజలు ఎవరు కోరుకుంటే వారు గెలుస్తారు. గెలిచిన తర్వాత విచ్చలవిడి తనం మంచిది కాదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు చేయమేమిటి? వారి ఆస్దులు ద్వంసం చేయడమేమిటి? నిన్ననే మారిన చంద్రబాబును చూస్తారంటూ ప్రకటించిన రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తున్న విశృంకలత్వానికి బాధ్యులు ఎవరు? ఇలాంటి దాడుల్లో జైలు పాలయ్యేది సామాన్య కార్యకర్తలే. కేసులు ఎదుర్కొనేది సామాన్య కార్యకర్తలే. ప్రాణాల మీదకు తెచ్చుకునేది సామాన్య కార్యకర్తలే. నాయకుల మధ్య సఖ్యత వుంటే కార్యకర్తలు కూడా సంయమనంతో వుంటారు. ఒకే ఊరిలో వుంటే ప్రజలు ఒకే తల్లి బిడ్డల్లా వుండాలి. అంతే కాని ఒకే ఊరు ప్రజలు పార్టీలుగా విడిపోయి శత్రువులగా మారితే సమాజం ఏమౌతుంది. మరో వైపు నిన్నటి దాకా జనసేన గెలుపుకోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని, జనసేన కార్యకర్తలు దాడులు చేయడం ఏమిటి? ఎటుపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం, వైసిసిల మధ్యే వైరం వుండేది. ఇప్పుడు మూడోపార్టీ జనసేనకు కూడా బలమొచ్చింది. వారికి కూడా దాడుల సంస్కృతి వచ్చింది. జనసేన నాయకుడు పవన్‌ కల్యాన్‌ ఎన్నికల ప్రచారంలో పదే పదే వాడే పదాలను ఇప్పుడు కార్యకర్తలు అనుసరిస్తున్నారా? ఒక్కొక్కరి తాట తీస్తా అంటే ఇదేనా.

ఇవెక్కడి దిక్కుమాలిన రాజకీయాలు…

ఈ విషయంలో తెలంగాణ చాలా బెటర్‌..చాల బెస్ట్‌..ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంస్కృతి కనిపించేది. కాని అప్పుడు ఈ విష సంస్కృతి కొన్ని ప్రాంతాలకే పరిమితమై వుండేది. కొన్ని నియోజకవర్గాలలోనే ఆదిప్యత రాజకీయాలు వుండేవి. అవి కూడా కుటుంబాల మధ్యే కనిపించేవి. కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం పాకినట్లున్నాయి. ఇది ఎంత మాత్రం సరైంది కాదు. ప్రజాస్వామిక వాదులు వాటిని ఖండిరచాల్సిన అవసరం వుంది. ఆ నాటి నుంచి కొన్ని కుటుంబాల మధ్యనే ఈ పోరు వుండేది. అందులోనూ కూడా అనుచరులే సమిధలయ్యేవారు. నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. విజయవాడలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఇలా చెప్పుకునేవారు. రాయలసీమలో వైఎస్‌ కుటుంబం. అనంతపురంలో పరిటాల కుటుంబం. ఇలా కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయ క్షక్ష్యలు ఇప్పుడు పార్టీలకు చేరిపోయాయి. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు సర్వసాదారణమైపోయాయి. 2014 తర్వాత ఇవి మరీ ఎక్కువయ్యాయనే చెప్పాలి. వైసిపి. చెందిన నందిగం సురేష్‌ లాంటి వారి మీద జరిగిన దాడులు..తర్వాత ఆయన ఎంపి కావడం వంటివి చోటు చేసుకున్నాయి. అయితే 2019 తర్వాత జగన్‌ గెలిచిన తర్వాత ఈ దాడులు తారాస్ధాయికి చేరుకున్నాయి. రాజకీయాల్లో ప్రతీకారేఛ్చ అన్నది సరైంది కాదు. జగన్‌ అదికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయం కూల్చివేశారు. కరకట్ట ఆక్రమించారని కేసులు నమోదు చేశారు. చివరికి చంద్రబాబు మీద కేసులు నమోదు చేసి, ఆయనను జైలుకు పంపేదాకా కక్ష్యపూరిత రాజకీయాలు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వంతు వచ్చింది. ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇలాంటి దుర్మార్గమైన వ్యవహరాలు కొనసాగించడాన్ని ఎవరూ స్వాగతించరు. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో జగన్‌ను తూలనాడం వంటివి విపరీతంగాచేశారు.

విజయవాడు ఎమ్మెల్యే బొండా ఉమ , ఒక దశలో కొడాలి నానిని అసెంబ్లీలోనే పాతి పెడతా..నా కొడకా..అంటూ వ్యాఖ్యానించడాలు అప్పట్లో పెద్ద సంచనంగా మారాయి.

మాజీ మంత్రి రోజాను కూడా విపరీతంగా వేధిస్తూ వచ్చారు. రాజకీయాల్లో మహిళ ప్రాతినిద్యం పెరగాలి. 50 శాతం కోటా వారికి వుండాలి. అని ఓ వైపు దేశం మొత్తం కొట్లాడుతుంటే ఏపిలో మహిళా నాయకులకు ఎంత విలువుందో తెలియందా? రెండు పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా మహిళా నేతలు కూడా ఎవరకీ తీసిపోమన్నట్లు మాట్లాడడం కూడా అసలే మంచిది కాదు. జగన్‌ హయాంలో కోడెల శివప్రసాద్‌ లాంటి నాయకుడిని వేధింపులకు గురి చేయడం ఆనాడు అందరూ జగన్‌ను నిందించారు. ఇప్పుడు మా వంతు వచ్చిందన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం అంటే పాలన గాలికి వదిలేసి, వేధింపుల కోసమే కాలం వృధా చేస్తారా?

ఏది ఏమైనా తెలంగాణలో ఇలాంటి విష సంస్కృతి ఏనాడు లేదు.

ఎందుకంటే తెలంగాణ ఒక ఉద్యమాల మాల. ఇక్కడ సమసమాజం కోసం ఆరాటముంటుంది. పోరాటముంటుంది. ఉద్యమాలుంటాయి. వ్యవస్ధల మీద పోరు వుంటుందే గాని, వ్యక్తుల మీద వుండదు. తెలంగాణలో నక్సలిజం ఉదృతంగా సాగిన సమయంలో కూడా అన్నలు చేసే అరాచాకాన్ని తెలంగాణ సమాజం ఏనాడు హర్షించలేదు. వ్యక్తుల నిర్మూలన సిద్దాంతాన్ని అందరూ ఖండిరచారు. ఒక దశలో నక్సల్స్‌ నాయకులను టార్గెట్‌ చేస్తే తెలంగాణ సమాజమే ప్రశ్నించింది. అలాంటి వ్యవస్ధకు చరమగీతం పాడిరది. అదీ తెలంగాణ సమాజం గొప్పదం. తెలంగాణలో అరవై ఏళ్ల పాటు కలిసి సాగినా ఆంధ్రరాజకీయాల్లో మార్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న కక్ష్యపూరిత రాజకీయాల విషసంస్కృతి తెలంగాణ దరి చేరలేదు. అంటే తెలంగాణ నాయకుల గొప్పదనం. అంతెందుకు ఆంద్రాకు సరిహద్దులుగా వున్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో కూడా ఇలాంటి విషసంస్కృతి పాకలేదు. అందుకు తెలంగాణ నాయకులందరనీ హర్షించాల్సిందే. తెలంగాణలో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు కూడా వుండవు. మర్యాదపూర్వకంగానే సంబోదన వుంటుంది. రాజకీయంగా ఎన్ని విబేధాలున్నా, ఎదురుపడినప్పుడు ఎంతో ఆప్యాయత కనబర్చుతారు. అంతే కాని ఓడిన వారిని గెలిచిన వారు, గెలిచిన వారిని ఓడిన వారు టార్గెట్‌ చేయడం ఎప్పుడూ లేదు. తెలంగాణ అంటేనే గంగాజమున తహజీబ్‌ అంటారు. ఇక్కడ ఏ కులాల మధ్య ఆగాధం వుండదు. ఏ కులం ఆధిపత్యం వుండదు. ఏ మతానికి ప్రత్యేకత వుండదు. అన్ని కులాలు సమామనే.. అన్ని మతాలు సమానమే. పాతబస్తీలో ముస్లింలు, హిందువులు కలిసి సాగుతుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏనాడు కాంగ్రెస్‌ నాయకులను వేధించింది లేదు. రాజకీయంగా కొన్ని విషయాల్లో వారిని విభేదించొచ్చు. కాని నాయకులపై కార్యకర్తలు దాడి చేడయం వంటివి ఏనాడు జరగలేదు. పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన వచ్చింది. కాని కాంగ్రెస్‌ నాయకులు, ఎక్కడా బిఆర్‌ఎస్‌ నాయకుల మీద దాడులు చేసింది లేదు. ఆధిప్యత పోరు సాగించింది లేదు. రాజకీయంగా అనేక విమర్శలు చేసుకుంటారు. తెలంగాణ యాసలో ఎత్తిపొడుపులు పొడుచుకుంటారు. కాని కత్తుల సంస్కృతి లేదు. రాదు..రావొద్దు. తెలంగాణ సమాజం ఎంతో ఉన్నతమైంది. అంతటి ఉన్నతంగా ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎదగాలి. అభివృద్దిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి. అంతే కాని నాయకుల మధ్య కుత్సిత మనస్తత్వాలు, పార్టీల మధ్య అగాధాలు వండకూడదు. తమిళనాడు కూడా ఆధిపత్య రాజకీయాలు వుంటాయి. కాని నాయకుల మీద దాడి చేసేంత వుండదు. రాజకీయ పార్టీలు రాష్ట్రాభివృద్ది కోసం పనిచేయాలి. కాని రాష్ట్రం దివాళా తీసేందుకు, ప్రజలను కష్టాలు పెట్టేందుకు రాజకీయాలు చేయొద్దు. సర్వేజనా సుఖినోభవంతు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!