విశాలహితం కోసం కూల్చివేతలు తప్పవు

`దూకుడు వేగం తగ్గితే ప్రజల్లో అనుమానాలు వ్యక్తం కావడం సహజం

`మూసీ ప్రక్షాళనతోనే పర్యావరణ పరిరక్షణ

`ఆక్రమణలతో మురికివాడలుగా మారిన మూసీ పరీవాహక ప్రాంతాలు

`ప్రజాగ్రహాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న విపక్షాలు

`ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించడంలోనే రేవంత్‌ సమర్థత వెల్లడయ్యేది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

హైడ్రా కూల్చివేతలు రాజకీయనాయకులు, ఆర్థిక దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మాట వాస్తవం. అక్రమంగా ఆక్రమించిన భూముల్లో కోట్ల రూపాలయ వ్యయంతో నిర్మాణాలు చేపట్టినవారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ప్రస్తుతం జరుగుతున్న పరిణామం. ఇన్ని కోట్ల రూపాయలతో అక్రమ నిర్మాణాలు చేపట్టేముందే పర్యవసానాలు ఆలోచించినట్లయితే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. కాలం ఎప్పుడూ ఎవరికీ అనుకూలం లేదా ప్రతికూలంగా వుండదు! నువ్వు చేసిన పనికి తగిన ఫలితాన్నిస్తుందంతే! దీన్నే ‘కర్మఫలం’ అంటారు. హైడ్రా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఒకటి రెండు విద్యాసంస్థల విషయంలో, విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత గడువివ్వడాన్ని అలుసుగా తీసుకొని ప్రభుత్వంపై విమర్శలకు దిగడం సముచితంకాదు. ముఖ్యంగా సచివాలయాన్ని కూలగొడతామని ఎంఐఎం నేత వ్యాఖ్యానించడం ఎంతమా త్రం సమర్థనీయం కాదు. సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించింది. ఒక బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. తాను ఆక్రమించిన ప్రదేశంలో విద్యాసంస్థ నిర్వహణ ద్వారా జరిపేది విద్యా వ్యాపారం తప్ప ప్రజాసేవ కాదు. తన వ్యక్తిగత ‘అక్రమ’ ఆస్తిని కాపాడుకోవడంకోసం సాక్షాత్తు ముఖ్యమంత్రినే హెచ్చరించడం అహంకార దోరణి తప్ప మరోటి కాదు. ఇక్కడ ప్రభుత్వం కూడాగుర్తించాల్సిన అంశం ఒకటుంది. సమయం పేరుతో కాలయాపన చేయకుండా విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని తక్షణం ఆలోచించాలి. కాలయాపన జరిగిన కొద్దీ ఎదో ఒక వంకతో కబ్జాదారులు ప్రభుత్వంపై ఏదోవిధంగా బురద జల్లే కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తారు. 

మూసీనది తీర ప్రాంతంలో లేదా మరే ఇతర ప్రాంతంలో పెద్దఎత్తున ఆక్రమణలకు పాల్పడినవారు తమ స్థలాల చుట్టూ పేదలు గుడిసెలు వేసుకునేలా ప్రోత్సహించి, ఒకరకంగా తమ స్థలాల కు రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. అయితే రేవంత్‌ ప్రభుత్వం తెలివిగా ఈ పేదలను అక్కడినుంచి ఖాళీచేయించి డబుల్‌ బెడ్‌రూమ్‌లకు తరలించాలని నిర్ణయించడం ద్వారా ఎక్కడా ఎటువంటి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్త పడిరది. దీంతో భూ ఆక్రమణలకు పాల్పడినవారికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయి తమ ఆస్తులపైఉన్న ధీమాను కోల్పోవడంతో, అసహనం పెరిగి ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు లేదా హెచ్చరికలు చేయడానికి వెనుకాడటంలేదు. 

ఒక మంచి పనిని ఎంత వేగంగా అమలు చేస్తే అంత మంచిది. అవరోధాలు సహజం. మధ్యలోఏమాత్రం వెసులుబాటు ఇచ్చినా, అక్రమార్కులు తీవ్రస్థాయిలో రెచ్చిపోతారు. ప్రస్తుతం జరుగు తున్నదిదే. నిజానికి హైడ్రా, మూసీ తీర ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నప్పుడు ఎ క్కడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే అంతా బడాబాబులే కావడం అందుకు ప్రధాన కారణం. అయితే మూసీ కూల్చివేతల విషయంలో బి.ఆర్‌.ఎస్‌. ఏదోవిధంగా రాజకీయ లబ్డిని పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ ఒక ప్రకటన చేస్తూ, నిర్వాసితులైన పేదలకు పునరావాసం కల్పించడంలో ఎంత మాత్రం వెనుకాడేదిలేదని స్పష్టం చేస్తూ అవసరమైన మలక్‌పేట రేస్‌కోర్సును, అంబర్‌పేటలోని పోలీస్‌ అకాడమీని ఊరవతలకు తరలించయినా సరే అక్కడ పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేయడమే కాదు, ఇంకా ఈ విషయంలో మరిన్ని సలహాలు సూచనలకోసం విపక్ష నాయకులతో కలిసి ఒక అఖిలపక్ష కమిటీని వేయడానికి ముందుకొస్తున్నారు. మరి బి.ఆర్‌.ఎస్‌. సహా విపక్షాలనుంచి స్పష్టమైన స్పందన రావాల్సి వుంది. రేవంత్‌ నిర్ణయానికి సరేనంటే అవమానం! లేదంటే ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం వీరిని వెంటాడుతోంది.

ఇదిలావుండగా హైదరాబాద్‌లో చెరువుల పూర్తిస్తాయి నిల్వమట్టాన్ని గుర్తించడంతో పాటు జలాలు గరిష్టంగా ఎంతమేర విస్తరిస్తాయన్నదానిపై శాస్త్రీయంగా లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల వున్న చెరువుల సంఖ్య అందులో ఆక్రమణలకు గురైన వాటి వివరాల లెక్కలను లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ తేల్చనుంది. ఇందుకోసం 45ఏళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. హిమయత్‌సాగర్‌ నుంచి దీన్ని ప్రారంభించి మిగతా వాటి లెక్కలు తేల్చనున్నారు. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు, జలాలు ఆక్రమణలకు గురికాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర నిఘా పెట్టనున్నారు. ఇదే సమయంలో కూల్చివేతల వ్యర్థాలు పెద్ద సమస్యగా మారడంతో, వీటిని తొలగించేందుకు కూడా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2023 వరకు తెలంగాణలో హైదరాబాద్‌లోని 920 చెరువుల్లో 498 పాక్షికంగా లేదా పూర్తిగా ఆ క్రమణలకు గురయ్యాయి. వీటిల్లో 269 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా వీటిల్లో 44 చెరువులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పూర్తిగా కబ్జాలకు గురికాగా మరో 229 చెరువులు పాక్షిక ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో చెరువలను కబ్జాల బారినుంచి కాపాడేందుకు విపక్షాలనుంచి సలహాలు సూచనలను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్గ ఆహ్వానించారు. 

తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినట్టు గుర్తించిన పదివేల ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా మూసీనదిలోకి మురికినీరు, వ్యర్థాలను విపరీతంగా వదలివేస్తుండటంతో, ఈ ప్రాంతాలన్నీ మురికివాడలుగా మారిపోయాయి. మూసీనదికి వరదలు వస్తే తీవ్రంగా నష్టపోయేది కూడా ఈ ఇళ్లలో నివసించేవారు మాత్రమే! అధికార్లు మూసీ నదీ గర్భంలో గుర్తించిన అక్రమ నిర్మాణాల సంఖ్య 2116కాగా వీటిల్లో 604 ఇళ్లు! ఇక 7850 బఫర్‌జోన్లలో ఉన్నాయి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సర్వేలో తేలిన ఆక్రమణ వివరాలివి. తొలిదశలో అధికార్లు వీటిల్లో 1600 ఇళ్లకు కూల్చివేత నోటీసులు జారీచేశారు. అయితే ఈ ఆక్రమణలను తొలగించడం ప్రస్తుతం అధికార్లకు పెను సవాలుగా మారింది. రాజేంద్రనగర్‌లో 300, హిమయత్‌నగర్‌లో 263, ఉప్పల్‌లో 236 ఇటువంటి అక్రమ నిర్మాణాలను అధికార్లు గుర్తించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో ఆక్రమణలు చోటచేసుకోనప్పటికీ, మొత్తం మూసీ పరీవాహక ప్రాంతంలో 10200 అక్రమ నిర్మాణాలన్నాయని మూసీ రివర్‌ ఫ్రం ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సర్వే నిర్ధారించింది. ఇవి నదీ పర్యావరణ వ్యవస్థను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో పట్టణ మౌలిక వసతులు, వరద నిర్వహణ కార్యక్ర మాలకు పెను విఘాతంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలను తొలగించేందుకు ఉపక్రమిస్తున్న అధికార్లకు స్థానికులనుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే ముఖ్యమంత్రి రే వంత్‌ రెడ్డి, ఇక్కడినుంచి ఇతర ప్రాంతాలకు తరలించిన వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని, భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ స్థానికు లనుంచి అధికార్లకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ ఇళ్లకు మార్కింగ్‌ చేయడానికి వారు ససే మిరా అనడమే కాదు అధికార్లతో ఘర్షణలకు దిగుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి నిర్వాసి తుల పునరావాస సమస్య ఎదురైంది. తగినన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఖాళీగా లేకపోవడం ఇ ప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. తక్షణం రెండువేలకు పైచిలుకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు అవసరం కాగా ఐదొందలకు మించి ఖాళీగా లేకపోవడంతో మూసీ ఆక్రమిత ప్రాంతాల్లో ఖాళీలు చేయించ డానికి ప్రభుత్వం కొద్దిగా వెనుకాడే పరిస్థితి ఏర్పడిరది. దీనికితోడు ఆయా ప్రాంతాల్లోని నివాసితులనుంచి వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ రావడం, విపక్షాలు కూడా వారికి మద్దతుగా నిలవడంతో పరిస్థితిలోని జటిలత్వాన్ని గుర్తించిన ప్రభుత్వం ఖాళీచేయించే ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఖాళీ చేయించిన వారిలో కేవలం పదిశాతం మందికి మాత్రమే పునరావాస కల్పన సాధ్యమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పునరావాసం సంగతి తేల్చాకే ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నదీగర్భంలో రెడ్‌మార్క్‌లు వేయడం నిలిచిపో వడమే కాదు ఖాళీచేయించిన ఇళ్లలో చాలావాటి కూల్చివేతలు ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్నవారిని గాలికి వదిలేసే ప్రసక్తే లేదని, వారికి వేరేచోట ఇళ్లు ఇవ్వడం లేదా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఉపముఖ్యమం త్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించినప్పటికీ, ఇది ఎంతకాలానికి పూర్తవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. 

కాలం గడిచేకొద్దీ విమర్శలు, ప్రతివిమర్శలు పెరిగి ఇదొక సాగతీత వ్యవహారంలా మారిపోవచ్చు. ప్రభుత్వం ఈ కూల్చివేతల విషయంలో ముందుగా ప్రదర్శించిన దూకుడును కొద్దిగా నెమ్మదించడం ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానం పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. తొలినాళ్లలో రేవంత్‌ చేపట్టిన కూల్చివేతలు ఇతర రాష్ట్రాలకు కూడా రోల్‌మోడల్‌గా మారాయి. తెలంగాణలోనే కాదు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా హైడ్రా రావాలన్న అభిప్రా యాలు బలంగా వ్యక్తమయ్యాయి. ప్రజలనుంచి ఇంతటి స్పందన వచ్చినప్పుడు రేవంత్‌ ప్రభు త్వం వెనుకాడాల్సిన పనిలేదు. ప్రభుత్వానిక ప్రజల మద్దతు అవసరం తప్ప రాజకీయ నాయకులది కాదు. మూసీ ప్రక్షాళన అమలులో ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలు ఇతర ప్రాంతాల్లోని సామాన్యులకు అర్థంకావు. విపక్షాలు రాజకీయాలు చేస్తాయి తప్ప, అసలు విషయాన్ని బయటకు రానీయవు. అందువల్ల ప్రభుత్వం తన అసలు ఉద్దేశాన్ని, దానివల్ల కలిగే లాభాన్ని ప్రజలక అర్థమయ్యేలా ప్రచారం చేయగలగాలి. ముఖ్యంగా తమ ఆవాసం కోల్పోయి నిర్వాసితులమయితే పరిస్థితేంటనే ప్రశ్నకు వారికి ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానం లభించాలి. రేవంత్‌ వారికి పునరావాసం కల్పిస్తామంటున్నారు కానీ ఖాళీ చేయించిన వెంటనే వారికి తక్షణం తరలించడా నికి తగినన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లేవన్న సంగతి తేలడం ప్రభుత్వ సంకల్పానికి పెద్ద అడ్డంకి. అంతేకాదు ఖాళీచేయించినంత త్వరగా పునరావాసం సాధ్యంకాదన్న సంగతి మరువరాదు. ప్రభుత్వం చెబుతున్నట్టు కొత్త ఇళ్లు నిర్మించాలంటే ఏళ్లు పట్టవచ్చు.అప్పటిదాకా నిర్వాసితుల పరిస్థితేంటి? ప్రస్తుతం దీనికి సమాధానం లభించాల్సి వుంది. ఈ సందిగ్ధ పరిస్థితులను ఆక్రమణలకు పాల్పడిన బడాబాబులు తమకు అనుకూలంగా మలచుకోవడానికి తప్పక ప్రయత్నిస్తారు. ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా రేవంత్‌ సర్కార్‌ ఏవిధంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!