నవమాసాలు.. కృత్రిమ గర్భంలో! ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే మిషన్!!

ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే మిషన్!!
భవిష్యత్తు మానవుడు ల్యాబ్‌లోనే!!!

మాతృత్వం అనేది ఆడాళ్లకి ఓ వరం. అమ్మ అనే పిలుపుకోసం ఆమె ఎంతో తాపత్రయ పడుతుంది. పిల్లలు లేనివారు మొక్కని దేవుడు.. ఎక్కని గుడి ఉండదు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసీ వంటి అనేక కృత్రిమ గర్భధారణ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కోరుకున్నప్పుడే తల్లి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తాజాగా, కృత్రిమ గర్భధారణతో పిల్లలను కనే విషయం గురించి యూట్యూబ్‌లో పెట్టిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

చాలా మందికి గర్భసంచిలో సమస్యలు, ఇతర అనారోగ్య కారణాల వల్ల పిల్లలు కలగరు. అలాంటి వారికి వరంలా వచ్చింది ఐవీఎఫ్ పద్ధతి. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అంటే తండ్రి నుంచి స్పెర్మ్, తల్లి నుంచి అండం తీసుకుని ల్యాబ్‌లో కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణం అయ్యేలా చేస్తారు. పిండం ఏర్పడ్డాక దాన్ని తల్లి గర్భంలో ప్రవేశ పెడతారు. ల్యాబ్ లో ఏర్పడిన పిండం బిడ్డగా ఎదగాలంటే కచ్చితంగా తల్లి గర్భం కావాల్సిందే. కానీ సమీప భవిష్యత్తులో ఆ అవసరం కూడా ఉండదు. పూర్తి స్థాయిలో బిడ్డల్ని ల్యాబ్‌లోనే పెరిగి పెద్దయి ప్రసవించేలా చేస్తారు. ఇందుకు ప్రయోగశాలల్లోనే కృత్రిమ గర్భాశయాలు సిద్ధమవుతున్నాయి. చదువుతుంటే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించవచ్చు కానీ, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయోగాలు, సదుపాయాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ గర్భ కర్మాగారం సిద్ధమవుతోంది. ఇందులో ఫలదీకరణం నుంచి తొమ్మిది నెలల వరకు ఈ బిడ్డ కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. తల్లికి నొప్పులు పడే బాధ కూడ లేదు. కృత్రిమ గర్భం తెరను తీసి బిడ్డను బయటికి తీస్తారు. తరువాత ఆ గర్భంలో మరో బిడ్డను పెంచడం మొదలుపెడతారు. ఇలా ఏడాదికి 30,000 బిడ్డలను సృష్టించేందుకు వీలుగా అతి పెద్ద ల్యాబ్ నిర్మితమవుతోంది.

ప్రపంచంలో ఇదో పున:సృష్టి అని చెప్పవచ్చు. ఈ ‘కృత్రిమ గర్భ కర్మాగారం’ పేరు ఎక్టో లైఫ్. బెర్లిన్‌కు చెందిన బయోటెక్నాలజిస్టు హషేమ్ అల్ ఘైలీ దీని సృష్టికర్త. సంతానం లేని తల్లిదండ్రుల కోసం ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారాయన. ఆయన మాటల్లో ఈ ఎక్టో లైఫ్ గర్భధారణ విషయంలో మనిషి పడుతున్న బాధలను తగ్గించడం, అలాగే సి సెక్షన్ కాకుండా ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడడం అని చెప్పుకొచ్చారు. ఇంకా ఇది పరిశోధన దశలోనే ఉన్నట్టు చెప్పారు.

మానవ పిండాలపై పరిశోధన అనేది నైతిక మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, మానవ పిండాలపై పరిశోధన 14 రోజులకు మించి అనుమతించడం లేదు. ఆ తరువాత ఆ పిండాలను నాశనం చేయాలి. ఆ నిబంధనలు లేకపోతే ఈ సదుపాయం అతి త్వరలోనే తీసుకువస్తానని చెబుతున్నారు శాస్త్రవేత్త అల్ ఘైలీ.  అలా అయితే పది నుంచి పదిహేనేళ్లలో ప్రతి చోట ఎక్టో లైఫ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇదే జరిగితే తల్లి గర్భం అవసరం లేకుండానే పిల్లలు పుట్టేస్తారు. కానీ ఇది ప్రకృతికి విరుద్ధమని వాదిస్తున్న వారు ఉన్నారు. తల్లి గుండె చప్పుడు వింటూ బిడ్డ పెరగడం అత్యవసరమని చెబుతున్నారు. అదే వారి మధ్య బంధాన్ని పెంచుతుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!