నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు చేయండి
– వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు పీడీయాక్ట్ కింద కేసులను నమోదు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ అధికారులను అదేశించారు. రాబోవు వర్షాకాలంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభంకానుండటంతో వ్యవసాయదారుల సంక్షేమాన్ని దష్టిలో వుంచుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో శుక్రవారం ప్రత్యేక సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రైతులకు మేలు కలిగించే రీతీలో పోలీస్ అధికారులు నకిలీ విత్తనాలతోపాటు, నకిలీ పురుగు మందుల విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన భాధ్యత పోలీస్ అధికారులపై వుందని అన్నారు. నకిలీ విత్తన అమ్మకాల కొరకు గ్రామాలకు వచ్చే ఏజెంట్లు, దళారీలతోపాటు విత్తనాల విక్రయాల కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చి లాడ్జ్‌ల్లో బసచేసే వ్యక్తుల సమాచారాన్ని స్థానిక పోలీసులు సేకరించాలని తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతోపాటు వారిపై గట్టి నిఘా కొనసాగించాల్సి వుంటుందని, ఇందుకోసం స్థానిక పోలీసులతోపాటు, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక దష్టి పెట్టాలని అన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలను గుర్తించడంపై స్థానిక పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతోపాటు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుకు సంబంధించిన రశీదు పోందే విధంగా రైతులను ప్రోత్సహించాల్సి వుంటుందని చెప్పారు. ఇదే సమయంలో గడువు తీరిన విత్తనాలను అమ్మకాలపై అధికారులు దష్టిపెట్టాలని, నకిలీ విత్తనాల నియంత్రణకు అధికారులు స్థానిక వ్యవసాయ విభాగం అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రాబోవు 15రోజుల లక్ష్యంగా నకిలీ విత్తనరహిత పోలీస్ కమిషనరేట్‌గా గుర్తింపు తీసుకరావడంలో పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో కషి చేసి రైతులు నష్టపోకుండా, రైతులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.