నడిచెరువులో సేద్యపు కుంట తవ్వకం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల వ్యవసాయ బావులు, బోర్లల్లో భూగర్భ జలాలు పెంపొందించడానికి వారి భూముల్లోనే పాంపౌండ్ (సేద్యపు కుంట)లను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టి కొనసాగిస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేయవలసిన పనులను రైతుల సొంత వ్యవసాయ భూముల్లో చేపట్టాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా నర్సంపేట డివిజన్‌లోని కొన్ని గ్రామాలల్లో పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో సేద్యపు కుంటల నిర్మాణం చేపట్టడానికి సంబంధిత గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు రైతుల వ్యవసాయ భూములతోపాటు పూర్తి వివరాలను పైఅధికారులకు వివరించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలోని కన్నెచెరువు వద్ద సేద్యపు కుంట పనులను జరుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఫాంపాండ్ నిర్మాణ పనులను చెరువులోనే చేస్తున్నారని, దానివల్ల ఫలితం ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. చెరువులోనే పాంపౌండ్ నిర్మాణం చేయటం వలన వర్షాకాలంలో చెరువు పూర్తిగా నిండుతుందని తెలిపారు. చెరువులో తవ్వడం వలన లాభం ఏం జరుగుతుందని, చెరువులో నీరు ఉన్నా సేద్యపుకుంటలో నీరు ఉన్నా రెండు సమానమే అని తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయలు వథా అవుతున్నాయని, రైతుల భూముల్లో చేపట్టాల్సిన పనులను చెరువులో చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.