ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్
హన్మకొండ :
ముదిరాజ్‌లను బీసీ – ఏలో చేర్చాలని, ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ బస్టాండ్ వద్ద ఉన్న ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్‌కు సోమవారం రోజున వినతిపత్రం అందజేచేశారు. అనంతరం పెద్ద ఎత్తున ముదిరాజులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పులి రజినీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ముదిరాజుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ… రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలను అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని వివరించారు. తెలంగాణలో అధిక జనాభాగల ముదిరాజ్ లు సమాజములో అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నామని అన్నారు. ప్రభుత్వంలోని మంత్రివర్గంలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కోఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్ ను ఏర్పాటుతో పాటు ప్రతి సంవత్సరానికి రూ॥ 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మత్స్య శాఖలోని సొసైటీలకు ఎన్నికలు జరపాలని, మత్స్యకారులకు 50 ఏండ్లకే ఆసరా పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ముదిరాజ్‌లకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన ముదిరాజ్‌లకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే (2014 ) అనంతరం ముదిరాజ్‌ల జనాభా 60 లక్షల కాగా, నేడు మళ్లీ జనగణన చేపట్టాలని కోరారు. ముదిరాజ్‌ల జనాభా తెలపాలని, ఆ దామాషాలో అన్ని అభివృద్ధి ఫలాలను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేశబోయిన శ్రవణ్, బయ్య శోభన్, ఇప్ప సాంబమూర్తి, పులి ప్రభాకర్, రామ్రాజ్, సమ్మయ్య, నర్సింగరావు, శంకర్, రమేష్, ప్రకాశ్, రవికుమార్, మహేందర్, కోటేశ్వర్, రాజ్ కుమార్, కృష్ణ, హరికృష్ణ, గోపి కృష్ణ, పెద్ద ఎత్తున ముదిరాజ్‌లు పాల్గొన్నారు.