జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ముదిగుంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, వేసవికాలం కాబట్టి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని, నిర్దేశించిన కొలతల్లోనే పని సక్రమంగా చేయాలని కూలీలకు తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎండ తాపం నుండి రక్షణగా టెంటు మరియు ప్రథమ చికిత్స కిట్టు, మంచినీటి సౌకర్యం అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కి తెలియజేయడం జరిగింది. తదనంతరం నర్వ గ్రామంలో పర్యటించి మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును, పైప్ లైన్లు లీకేజ్ జరుగు స్థలాలను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించమని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.