నా కోసం కష్టపడ్డారు మీ కోసం కష్టపడతా
మీ అందరికీ అండగా ఉంటా
కలిసికట్టుగా పని చేద్దాం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరు అందరూ కష్టపడ్డారని తిరిగి మీ అందరి గెలుపు కోసం నేను కష్టపడతానని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడారు. గురువారం హుజురాబాద్ సిటీ సెంటర్లో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్యేగా తన గెలుపు వెనుక ప్రతి సర్పంచ్ కష్టం ఉందని, ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఏ సర్పంచ్ కూడా అధైర్య పడద్దని, ప్రతి ఒక్క సర్పంచ్ కి అండగా ఉంటానని అన్నారు. ఏదేమైనా మీ అందరి కోసం ముందుండి మళ్లీ మిమ్మల్ని గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఇకమీద రాబోయే ప్రతి ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగిరేల పని చేయాలని చెప్పారు. మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావులు సిద్దంగా ఉన్నారని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉండగా బిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ని వీడేదేలేదని ఆయన తేల్చి చెప్పారు. మనమంతా ప్రజల తీర్పును గౌరవించి రానున్న రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి ప్రజల సమస్యలపై పోరాడాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల మధ్యలోనే ఉండాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు తప్పక ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల గడవకముందే ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుందని అన్నారు. మార్పు రావడం అంటే రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా..
కెసిఆర్ నర నరాల్లో రైతుల మీద ప్రేమ ఉంది. దళిత బంధు ఇవ్వకుంటే ధర్నాలు తప్పవన్నారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక వైపు రైతులను మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. మార్పు రావడం అంటే ఇదేనా మార్పు అని అన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రైతులు నాటు వేసి నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 1,17,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. వాటికి వెంటనే నీళ్లు అందించాలన్నారు. నాటు వేసి ఎదురుచూస్తున్న రైతులకు ఇప్పటి వరకు నీళ్లు అందించకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. గత పదిహేళ్లుగా ఎప్పుడూ చూడని విధంగా ఇప్పుడు ఉందని అన్నారు. ఒకవైపు నాట్లు వేసి ఉంటే మరోవైపు వాగులో నీళ్లు లేక పర్రెలు తోడి ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ విధమైన ఇబ్బంది అయినా జరిగిందా అని ప్రశ్నించారు. కెసిఆర్ రైతులకు ఏ సమస్యలు లేకుండా చూసుకున్నప్పుడు, మీ ప్రభుత్వంలో రైతులు ఎందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారు చెప్పాలని అన్నారు. కెసిఆర్ నర నరాల్లో రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే రైతులను రాజు చేశాడన్నారు. కాంగ్రెస్ నాయకులు దావతులు చేసుకుంటున్నారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కమలాపూర్ మండలంలోని చాలా గ్రామాలకు 22ఏ, 22బి నుంచి నీళ్లు వస్తుంటాయని. వెంటనే షట్టర్ ఎత్తి రైతులకు నీళ్లు అందించాలి. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఖాయమన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ ఎస్సీతో కూడా మాట్లాడానని చెప్పారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరానికి నీలందించాలని డిమాండ్ చేశారు. దళిత బంద్ ని పాయిలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ని ఎంచుకొని ఇక్కడున్న 18 వేల కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల చొప్పున దళిత బంధు అందించారని, మొదటి విడతగా ఇప్పటికే ఐదు లక్షలు ఇచ్చిన కుటుంబాలకు, రెండో విడత దళిత బంధు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 1500 నుంచి 2000 మందికి ఇప్పటికే వారి అకౌంట్లో డబ్బులు జమ అయి ఉన్నాయని వాటిని ఫ్రీజ్ చేశారని ఫ్రీజ్ తీసివేసి లబ్ధిదారులకు అందించాలని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు కలిపి ఇస్తామని చెప్పినట్లుగానే లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలని అన్నారు. దళిత బంధు ఇవ్వని యెడల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపడుతామని హెచ్చరించారు. రైతుబంధు కూడా డిసెంబర్ 9 తర్వాత ఒక్క ఎకరానికి 15000 ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రైతుల ఖాతాల్లో వాటిని జమ చేయాలని అన్నారు. పవర్ హాలిడే పేరుతో కరెంటు కోతలు మొదలు పెట్టారని, భవిష్యత్తులో ఈ కోతలు ఎన్ని గంటలు ఉంటాయో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు చేయాల్సిన రెండు లక్షల రుణమాఫీని జనవరిలో చేస్తామని చెప్పినట్టుగానే చేయాలని అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తల పైన సోషల్ మీడియా వారి పైన దాడులకు దిగితే చూస్తూ ఊరుకునేదేలేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి దొడ్డే మమత దుర్గాప్రసాద్, రాణి సురేందర్ రెడ్డి, సరిగొమ్ముల పావని వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.