ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం
మెన్‌స్ట్రాల్ హైజినిక్ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు భవన్‌లో ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు, కిశోర బాలికలకు పరిశుభ్రత లేకపోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యసంబంధమైన శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఎన్నో అపోహాలతో ఆ రోజుల్లో బయటకు వెళ్లవద్దని మూఢనమ్మకాలను పాటిస్తున్నారని తెలిపారు. గ్రామగ్రామాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టి మహిళలు, కిషోర బాలికలలో అవగాహన కల్పించాలని చెప్పారు. సానిటరి పాతపద్దతులను మానేసి కొత్త పద్దతులు అవలంభించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మార్పు తీసుకురావాలని, గ్రామాల్లో మరుగుదొడ్లు, ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేసినవిధంగానే ఎంహెచ్‌ఎంపై ప్రచారం చేయాలని వివరించారు. డిడబ్ల్యుఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు, మహిళలకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. అదేవిధంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. అదనపు డిఆర్‌డిఓ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా ప్రతి సమావేశంలో ఎంహెచ్‌ఎంపై చర్చించి పేదప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్టుమెంట్ ఆర్‌బిలు, వైద్యులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఎస్‌బిఎం కన్సల్టెంట్ సురేష్, సిడిపిఓలు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, డిఎం అండ్ హెచ్‌ఓలు, ఎఎన్‌ఎంలు, ప్రేమ్‌కుమార్, నిహారిక, రమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.