మేరా భారత్ మహాన్
ప్రతాప ప్రొడక్షన్ పతాకంపై భారత దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం మేరా భారత్ మహాన్ ఈనెల 26వ తేదీ శుక్రవారం విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు డాక్టర్ శ్రీధర్ రాజు, డాక్టర్ తాళ్ల రవి, డాక్టర్ పల్లవి రెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 థియేటర్లలో శుక్రవారం విడుదల అవుతుందని తెలిపారు. యువత సంకల్పిస్తే దేశం బాగుపడుతుందని, సమాజంలోని సమస్యలను అరికట్టవచ్చని, యువతను చైతన్యపరిచేలా ఈ చిత్రాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎలా ఎదుర్కొవాలని ఈ చిత్రంలో చూపించామని చెప్పారు. ఈ చిత్రం ద్వారా యువతకు మంచి సందేశాన్ని కూడా ఇచ్చామని అన్నారు. ఈ చిత్రానికి ఎర్రంశెట్టి సాయి డైలాగ్స్, లలిత్ సురేష్ మ్యూజిక్, పెద్దాడ మూర్తి సాహిత్యాన్ని సమకూర్చగా, ఈ చిత్రంలో అఖిల్ కార్తిక్, ప్రియాంకశర్మ హిరోహిరోయిన్లుగా నటించారని తెలిపారు. అనంతరం గవర్నర్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని, అప్పడే సమాజం బాగుంటుందనే సామాజిక స్పృహతోపాటు ప్రేమ, వినోదభరిత అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారన్నారు. లయన్ నాగేశ్వర్ మాట్లాడుతూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారని, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందులోని లోటుపాట్లను చూపిస్తూ రెండు కుటుంబాలలో జరిగిన యదార్థగాదను ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. ఈ సమావేశంలో లయన్ అప్పరాజు, లయన్ అంజిరెడ్డి, లయన్ కోదండపాణి, లయన్ బి.వెంకటేశ్వర్లు, లయన్ మురళీధర్, అడ్వకేట్, సినీ నటుడు కెఆర్.నాగరాజు, డిసిపి లయన్ నేందర్ తదితరులు పాల్గొన్నారు.