సెన్సస్ విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి తగ్గించాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్
జూన్ 9 వరకు చాలినంత సమయం ఉన్నా -అధికారులకు ఎందుకు ఈ తొందరపాటు ????
భగ్గుమంటున్న మండుటెండలు… ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉపాధ్యాయులకు సూచన
కేసముద్రం/ నేటి ధాత్రి
సెన్సెస్ విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై పై అధికారులు ప్రారంభ దశ నుంచే అనవసర ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని, వెంటనే అధికారులు ఈ పద్ధతిని మార్చుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ( టి పి టి ఎఫ్ ) కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోగల కేసముద్రం స్టేషన్ లో అధికారుల తొందరపాటుతనానికి, సిబ్బంది పై పెంచుతున్న అనవసర ఒత్తిడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఫ్ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ
ఉపాధ్యాయులతో ఇంటింటి గణన ప్రక్రియలో మొదటి మూడు రోజులు గూగుల్ మ్యాప్ ఆధారంగా హద్దులను గుర్తించడం, పరిధులను అర్థం చేసుకోవడం, ప్రాంతాలను సరిపోల్చుకోవడంలోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టమైన మ్యాపింగ్ లేకపోవడం వల్ల సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
అదేవిధంగా ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, సమాచారం అందించే వ్యక్తులు చాలాసార్లు అందుబాటులో లేకపోవడం వల్ల గణన ప్రక్రియ ఆలస్యమవుతోందని, ఒకే ఇంటికి పలుమార్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు.
ఇక ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం 10 గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి నెలకొందని, మండుతున్న ఎండల్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి విధులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారిందని అన్నారు.అయినప్పటికీ సెన్సెస్ సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని, ఈ కష్టాలను అర్థం చేసుకోలేని అధికారులు ఇలాంటి పరిస్థితుల్లో
ప్రతిరోజూ “సంఖ్య పెంచాలి”, “త్వరగా పూర్తి చేయాలి”, “టార్గెట్ చేరాలి” అంటూ పదేపదే ఒత్తిడి తీసుకురావడం వారి తొందరపాటుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇలా ఒత్తిడి చేయడం సెన్సెస్ సిబ్బందిలో మానసిక ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గణన పూర్తి చేయాల్సిన సమయం జూన్ 9 అని ప్రభుత్వమే నిర్ణయించిందని, అంటే ఇంకా సుమారు 20 రోజుల సమయం ఉందని ఆయన గుర్తు చేశారు. సునాయాసంగా, సమగ్రంగా గణన పూర్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ, ప్రారంభ దశ నుంచే అధికారుల తొందరపాటు ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
సెన్సెస్ వంటి అత్యంత కీలకమైన ప్రక్రియలో వేగం కంటే ఖచ్చితత్వం ముఖ్యమని అధికారులు గుర్తించాలని, ఒత్తిడి ద్వారా కాదు, సహకారం మరియు అవగాహన ద్వారా మాత్రమే సమగ్ర గణన సాధ్యమవుతుందని అయన వివరించారు.
అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని సిబ్బందిపై అనవసర ఒత్తిడిని తగ్గించి, వారికి అవసరమైన సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భగ్గుమంటున్న మండుటెండలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల శాఖ ఉపాధ్యక్షులుకొమ్ము రాజేందర్, ఉపాధ్యాయులు సురేష్, జ్యోతి శ్రీ,రేవతి, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
