
Mental Health Awareness
మానసిక ఆరోగ్యమే సంపూర్ణ జీవితానికి పునాది
యువత విద్యార్థుల్లో మానసిక వికాసం– స్ఫూర్తిదాయక సమాజానికి పునాదిగా నిలుస్తుంది- ఎజ్రా మల్లేశం
రామడుగు, నేటిధాత్రి:

మానసిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ జీవితానికి పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఏ) జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో టెలంగాణ సైకాలజిస్టిస్ అసోసియేషన్ (టిపిఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి రంగంలో రాణించగలమని, ఆనంద జీవితం సాధించడానికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే బలమైన ఆధారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా, భారత్లో కూడా ఈసమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో అరవై శాతం మంది నిద్రలేమి, డెబ్బై శాతం మంది తరగతి గదుల్లో ఏకాగ్రత లోపం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన, సెల్ఫోన్ వ్యసనం, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం, చదువు ఒత్తిడి, కుటుంబ అనుబంధాల లోపం అని వివరించారు. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఆత్మీయ సంభాషణ అలవాటు చేసుకోవాలని సూచించారు.
“మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరానికి శక్తి, ఆత్మకు ఉల్లాసం, జీవితానికి దిశ లభిస్తుంది,” అని ఆయన అన్నారు. సైకాలజిస్ట్ అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డిజి నాగేశ్వర్ మాట్లాడుతూ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో విశ్వముఖ చారి, ప్రిన్సిపాల్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.