మేము ఏ కబ్జాకు పాల్పడలేదు
పెద్దమ్మగడ్డ స్మశానాన్ని తాము ఎంతమాత్రం కబ్జా చేయలేదని, ఆ స్థలం తమ సొసైటీకి చెందిందని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జాగృతి సొసైటీ బాధ్యులు బొజ్జ కిషన్‌రాజ్ స్పష్టం చేశారు. సోమవారం ‘నేటిధాత్రి’ పత్రికలో ప్రచురితమైన ‘స్మశానమే తనదంటున్నాడు’ కథనానికి ఆయన స్పందించారు. పైసా, పైసా పోగుచేసి తమ సొసైటీ తరపున స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. తాము కొనుగోలు చేసిన స్థలంలో తాము అడుగుపెట్టకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని అన్నారు. 700సర్వే నెంబర్‌లోని 4ఎకరాల 20గుంటలపై తమ సొసైటీకి అన్నిరకాల హక్కులు ఉన్నాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు తాము అధికారుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. నివాస స్థలాల కోసమని సొసైటీ ఆధ్వర్యంలో తాము భూమి కొనుగోలు చేశామని, ఎవరి భూములను కబ్జా చేసే ఉద్ధేశ్యం తమకు లేదన్నారు.
సమాధుల స్థలాన్ని వదిలివేస్తాం
పెద్దమ్మగడ్డ సమీపంలోని 700సర్వే నెంబర్‌లోని సమాధులను ధ్వంసం చేసే ఉద్ధేశ్యం లేదని కిషన్‌రాజ్ స్పష్టం చేశారు. పెద్దమ్మగడ్డ వాసుల సెంటిమెంట్‌ను తాము గుర్తించి మానవతా దృక్పథంతో సమాధులున్న స్థలాన్ని వారికే వదిలివేస్తామన్నారు. ఇరుపక్షాల సమక్షంలో మరోసారి భూమిని రీసర్వే చేయంచుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఆయన ‘నేటిధాత్రి’ ప్రతినిధికి తెలిపారు. పెద్దమ్మగడ్డ డెవలప్‌మెంట్ కమిటీ పెద్దలు సైతం సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.