https://epaper.netidhatri.com/
`మేడిగడ్డ జీవగడ్డ అని చెప్పలేరా..
`కాంగ్రెస్ ప్రచారం అబద్దమని అనలేరా…
`బిఆర్‌ఎస్ నేతలకు అవగాహన లేదా..
`మాకేం అవసరమని ఊరుకుంటున్నారా..
`కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేయండి.
`అసలు నిజాలు ప్రజలకు చెప్పండి.
`ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయి.
`ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా
ఉద్యమ కాలంలో అన్నీ కేసిఆరే చూసుకుంటాడు. అధికారంలో వున్న నాడు అన్నీ కేసిఆరే చూసుకుంటాడు. సమస్యలొస్తే కేటిఆర్, హరీష్‌రావులు పరిష్కరిస్తారు. ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు. గెలిపించేందుకు ఫండిరగ్ ఇస్తారు. నియోజకవర్గాల వారిగా వెళ్లి ప్రచారం చేస్తారు. అభ్యర్ధుల గెలపుకోసం వారి వారి నియోకవర్గాలు కూడా వదిలి పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు కృషి చేస్తారు. మిమ్మల్ని నాయకులను చేస్తారు. మీకు పదవలు కల్పిస్తారు. ఇది చాలు..మీకు అంతకన్నా ఏం కావాలి. పాలకులైతే ఏలుతారు.. ప్రతిపక్షంలో వుంటూ నోరు మూసుకుంటారు..అదే కార్యకర్తల మీద అయితే అరుస్తారు. మీకు నచ్చని కార్యకర్తలను వేదిస్తారు. జెండాలు మోసేవారిని ద్వేషిస్తారు. పార్టీకి ఇబ్బందులొస్తే పట్టించుకోరు. పార్టీ కష్టకాలంలో వుంటే ఆదుకోవాలని ప్రయత్నం చేయరు. పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటే ఎదురు ప్రశ్నించలేరు. వెచ్చగా వుంటే పంటాం..పచ్చగా వుంటే తింటాం…అనుకునే నాయకుల మూలంగానే బిఆర్‌ఎస్ పార్టీ ఇంత దాకా వచ్చింది. ఇప్పటి దాకా మాకేమిస్తారు..మాకేమిస్తారు అని అడిగన వాళ్లు ఏనాడైనా పార్టీకి మేమేమిచ్చామని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకోవాలి. బిఆర్‌ఎస్ పార్టీ పాలక పక్షం నుంచి ప్రతిపక్షంకు చేరుకున్నది ఎందుకో తెలుసా? ప్రజల నుంచి ఆనాడు ఎన్ని విమర్శలు వచ్చానా ఎమ్మెల్యేలు మారారా? మారాలన్న ఆలోచైనా చేశారా? చెప్పిన వారిని శత్రువులుగా చూస్తిరి. అడిగిన వారిని దూరం పెడితిరి. ఇప్పుడు పార్టీని ముంచి కాలక్షేపం చేస్తుంటిరి. మళ్లీ పార్టీ ఎలా నిలబడాలి..ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అని నిత్యం కేటిఆర్, హరీష్‌రావులు మళ్లీ కాళ్లకు బలపం పట్టుకొని తిరిగేలా చేస్తిరి. ఉద్యమ కాలంలో వెలుగు వెలిగిన నేతలే, అధికారంలో వున్న పదేళ్లు వెలుగుల్లోనే వున్నారు. పార్టీ ఓడిపోయిందని చాటుకు వెళ్లకండి. ఎందుకంటే ఈ చీకటి కొద్ది కాలమే…ప్రజల గుండెల్లో వున్నది బిఆర్‌ఎస్ పార్టీయే…ప్రజలు కావాలనుకుంటున్నది కేసిఆర్‌నే…అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ అసత్యాలను నమ్మకండి. వారు చేసే కుయుక్తుల్లో పడకండి. పదేళ్లపాటు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో సాగిన పాలనతో తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో చెప్పండి. పల్లెల్లోకి వెళ్లండి. బావుల్లో నీళ్లు చూపించండి. బోర్లలో నీళ్లు చూపించండి. ఇదంతా కేసిఆర్ పుణ్యం కాదా? అడగండి. మళ్లీ పాత రోజులు వచ్చేందుకు కనీసం ఇప్పుడైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పదువులు పొందిన వాళ్లంతా ప్రజల్లోకి రండి. ముఖ్యంగా కాళేశ్వరం విజయాలు చెప్పండి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటో ప్రజలకు వివరించండి. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు చెబుతున్న విషయాలు ఎలా అసత్యాలో నిరూపించండి.
ఎందుకంటే కాళేశ్వరం అన్నది ఒక బృహత్తరమైన ప్రణాళక. తెలంగాణకు జీవనాడి…అది చాలా మందికి అర్ధం కావడం లేదు. మేడిగడ్డను మేడి పండు అంటూ కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలకు నీళ్లు ఇవ్వలేమని తెలిసి, కేసిఆర్ ను, బిఆర్‌ఎస్‌ను అప్రతిష్టపాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. అసలు మేడిగడ్డ అంటే మేడి పండు కాదు..తెలంగాణకు మేడిగడ్డ ఒక జీవగడ్డ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది గొప్ప జలయజ్ఞం. కాంగ్రెస్ చెబుతున్న కట్టుకథల్లో ఏ మాత్రం నిజంలేదు. తాజాగా కాంగ్రెస్ నేతలు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు బిఆర్‌ఎస్ నేతలకు కూడా అర్ధం కావాల్సిన అవసరం వుంది. ఓ వైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హాలీడే ప్రకటించారన్న విషయం తెలిసందే. మరి అలాంటి ప్రాంతానికి ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి చివరి కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలకు నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. కాళేశ్వరం నీళ్లు కాదని ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారు. వాటిని అమాయకులైన ప్రజలు నమ్మే ప్రమాదముంది. అసలు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతోనే పూర్తయ్యేది కాదు. శ్రీపాద ఎల్లంపల్లి, మేడరం జలాశయం, మధ్య మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టుల అనుసందానం. వాటికి తోడుగా మధ్య మానేరు, అనంతసాగర్ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్నసాగర్, శామీర్‌పేట చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే ఒడిచే ముచ్చట కాదు. అంత పెద్దది కాళేశ్వరం చరిత్ర. కాళేశ్వరం కింద మూడు ముఖ్యమైన బ్యారేజ్‌లతోపాటు, 1531 గ్రావిటీ కాలువల ద్వారా నీరు పరుగులుపెడుతుంది. సుమారు 203 టన్నెళ్ల ( అంటే సొరంగాలు, అడ్డు వచ్చిన కొండలు కూడా తవ్వి నిర్మాణంచేశారు) ద్వారా కాళేశ్వరం నీళ్లు దుంకుతాయి. మొత్తం 20 లిఫ్టుల ద్వారా నీళ్లు తెలంగాణ చివరి ఆయకట్టు దాకా చేరుతాయి. అందుకోసం 19 పంపు హౌజ్‌లు నిర్మాణం చేశారు. మొత్తం మీద కొత్తగా 20 రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. రోజుకు కనీసం 2 టిఎంసిలు నీళ్లను ఏడాదిలో 90 రోజుల నుంచి 180 రోజుల పాటు నిరంతరంగా నీటి లభ్యత వున్నన్ని రోజులు ఎత్తిపోసే ప్రాజెక్టు కాళేశ్వరం. ఒకప్పుడు ఎత్తిపోతల పథకం అంటే ఒకటో, రెండో టిఎంసీలకు పరమితం.
ఒక టిఎంసి నీటిని ఎత్తిపోయాలంటే కనీసం నెల నుంచి నెల పదిహేను రోజుల సమయం పట్టేది. ఆ లోపు పుణ్య కాలం దాటిపోయేది. పంటలు ఎండిపోయేవి. కాని నేడు కాళేశ్వరం ఒక జల ప్రవాహం. రెండు రోజులకు ఒక టిఎంసి ఎత్తి పోసేంత పెద్ద భగీరధ ప్రయత్నం. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అబద్దాలు వల్లించి,వల్లించి కాళేశ్వరం మీద విషం చిమ్మింది. ప్రజల్లో అనుమానాలు నాటింది. మనం చిన్న ఇల్లుకుట్టుకుంటే ఎంత జాగ్రత్తగా నిర్మాణం చేసుకున్నా, కొద్ది రోజుల్లోనే ఏదో ఒక రిపేర్ వస్తుంది. నిరంతరం దాన్ని బాగు చేసుకుంటూనే వుండాల్సివుంటుంది. అలాగే నీటి ప్రాజెక్టులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఇక తాజాగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు ప్రస్తుతం తెలంగాణలో పారకంలో వున్న నీళ్లన్నీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయంటూ కొత్త కధలు అల్లుతున్నారు. నిజంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీళ్లు తెలంగాణ అంతటా పారే అవకాశమే వుంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. తెలంగాణ ఎందుకు ఎడారైంది? తెలంగాన పల్లెలన్నీ ఎందుకు వలసలు వెళ్లిపోయాయి. అసలు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన మోసం,ద్రోహం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అసవరం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది నిజాం పాలకులు. దానినే దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్ధాన చేశాడు. అప్పుడు ఉమ్మడి పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తారని నెహ్రూ కూడా ఊహించారు. మొత్తం 300 టిఎంసీల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. కాని ఉమ్మడి పాలకులు దానిని 180 టిఎంసిలకు కుదించారు. అయినా ఆనాడు తెలంగాన కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేదు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టును కూడా కేవలం వరదనీటి జలాల మీదే ఆధారపడేలా చేశారు. అందుకోసం కాకతీయ, లక్ష్మి,సరస్వతీ కాలువలు కూడా నిర్మాణం చేశారు. 180 టిఎసింలు అనుకున్న దగ్గర ఆఖరుకు 120 టిఎంసిలతో ముగించారు. ఇంత కాలంగా సిల్ట్ పేరుకుపోవడం, దానిని నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో ఆ ప్రాజెక్టులో కనీసం 90 టిఎంసిల నీళ్లు కూడా నిలువ లేకపోతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు నీళ్లను విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లించి ఎన్టీఆర్ హయాంలో మరోసారి తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణ సాగును ఆగం చేశారు. అలా సగం నీళ్లు విద్యుత్ ప్రాజెక్టులకు పోగా నిజామాబాద్ జిల్లానుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకే ఆ నీళ్లు సరిపోని పరిస్ధితి. అలాంటిది శ్రీరాం సాగర్ నీళ్లు సూర్యపేట దాకా తెచ్చామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుంటే బిఆర్‌ఎస్ నాయకులకు నోళ్లు లేవా? తెలంగాణలో ఏ మూల చూసినా కనిపించేవన్నీ కాళేశ్వరం నీళ్లే అని చెప్పలేరా? అంతే కాదు ఎల్లంపల్లి నిండు కుండలా వుండడం కూడా కాళేశ్వరం పుణ్యమే అని చెప్పలేరా? తెలంగాణలోని ప్రతి పల్లెలోని చెరువు గంగాళంలా వుందంటే కాళేశ్వరం వల్లనే అని చెప్పడానికి వెనుకాడుతున్నారా? తాజాగా మంత్రి కొండా సురేఖ విడుదల చేసిన రంగనాయక సాగర్ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లే కదా? మరి బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులు ఎందుకు ఎందుకు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా మూగ నోము వీడండి…నిజాలు చెప్పడం నేర్చుకోండి. ప్రజల్లోకి వెళ్లండి. లేకుంటే పార్టీ మిమ్మల్ని పక్కనపెట్టేదాకా తెచ్చుకోకండి. కాళేశ్వరం ద్వారా తెలంగాణకు కొత్త నీరు వచ్చినట్లే, బిఆర్‌ఎస్‌లో కొత్తనీరు వస్తే తప్ప పాత నీరు పిల్టర్ అయ్యేలా లేదు.