
Medical camps
క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలి…
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి…
మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి…
విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్ణిత సమయంలో నిర్వహించాలి…
విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి…
కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, గిరిజన ఆశ్రమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్- లెనిన్ వత్సల్ టోప్పో…
నేటి ధాత్రి -గార్ల :-
గార్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, మరియు గిరిజన ఆశ్రమ వసతి గృహాన్ని బుధవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశాలు ఉన్నందున వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను షెడ్యూల్ వారీగా పూర్తిచేసే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు.
అనంతరం వసతి గృహంలో వంటశాలను, స్టోర్ గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడిగా పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని అన్నారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి రికార్డులను, మరుగుదొడ్లను, ఆపరేషన్ థియేటర్, మందుల గది, పోస్ట్మార్టం గదిని పరిశీలించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఏజిహెచ్ఎస్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.ఈసందర్బంగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతి లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో కు అందజేశారు.