“నేటి ధాత్రి” ఎఫెక్ట్.. ఓవరాక్షన్ “కసిరిచ్చుడు ఉసిరిచ్చుడు” తహశీల్దార్ బదిలీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం తహశీల్దార్ పై బదిలీ వేటు పడింది. జనవరి 7వ తేదీ బుధవారం “నేటి ధాత్రి” ఎడిషన్‌లో ప్రచురితమైన “చెప్పులిప్పితేనే ఎంట్రీ – రెవెన్యూ ఆఫీసా… లేక ప్రజా దర్బార్..?” అనే కథనానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. తహశీల్దార్ విధులు నిర్వహిస్తున్న తిరుమలరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పత్రికలో వచ్చిన కథనాల పై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు, రైతులు తమ చెప్పులను బయట విడిచిపెట్టాలనే నిబంధన విధించారనే ఆరోపణలతో పాటు, కార్యాలయం చుట్టూ ఉన్న పచ్చని చెట్లను నరికివేయడం, విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు, అక్రమ వెంచర్లను అరికట్టడంలో విఫలమయ్యాడనే ఆరోపణల పై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. తహశీల్దార్ బదిలీ వార్త తెలుసుకున్న రైతులు ఆనందోత్సాహాలతో కార్యాలయానికి చేరుకుని టపాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఝరాసంగం నూతన తహశీల్దార్‌గా కంగ్జిలో విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌ను జిల్లా కలెక్టర్ నియమించారు. మండల ప్రజలు, నాయకులు “నేటి ధాత్రి” దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ రైతుల పక్షాన నిలబడటం, ప్రజల పక్షమే మా పక్షమని తెలియజేయడంలో “నేటి ధాత్రి” గర్విస్తుంది.
