Jagadeeshwar Patil Seeks Blessings for Village Progress
గ్రామాభివృద్ధికై పాటుపడతా ఆశీర్వదించండి
◆- వనంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఎంపీ జగదీశ్వర్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం(జహీరాబాద్),తమ గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని తనను అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఝరాసంగం మండలంలోని వనంపల్లి సర్పంచ్ అభ్యర్థి మాలి పటేల్ జగదీశ్వర్ పాటిల్ కోరారు.వనంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో పలు సమస్యలు నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.దళిత,వెనుకబడిన తరగతుల చెందిన ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని,వారి పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు మంజూరు చేయించి ఆదుకోవడం జరుగుతుందన్నారు.ఎంతోమంది చదువుకుని గ్రామంలో నిరుద్యోగులుగా మిగిలిపోయారని వారికి ఉపాధి పథకాలు మంజూరు చేయిస్తానన్నారు.చాలా మందికి పక్క గృహాలు లేకపోవడంతో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారని అర్హులైన వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేయించడానికి కృషి చేస్తానన్నారు.అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు,రేషన్ కార్డులు మంజూరు చేయిస్తానన్నారు.రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రతి ఏటా నష్టపోతున్నారని కమర్షియల్ పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు.గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చోట బోర్లు వేయించి మినీ ట్యాంకులు నిర్మించడం జరుగుతుందన్నారు.
గ్రామంలో అవసరమైనచోట మురికి కాలువలు,సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీకి సొంతభవనం, ఎస్సీ,బీసీ కమ్యూనిటీ భవనాల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. వనంపల్లి నుండి సిద్దాపూర్,
మిర్జాపూర్ గ్రామాల వైపు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకై నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు.గ్రామం నుండి రామచందర్,టోప్యా నాయక్ తండాలు,సేరిగడ్డ పొలాల వైపు గల రోడ్ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తానన్నారు.పంట పొలాలకు దారులు సక్రమంగా లేక రవాణా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటికి పక్కా రోడ్లు వేయిస్తానన్నారు.అందరికీ అందుబాటులో ఉండి కుల మతాలకు అతీతంగా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కోసం
అహర్నిశలు పాటు పడతానని అందరూ ఆశీర్వదించి తనను భారీ మెజారిటీతో సర్పంచుగా గెలిపించాలని అభ్యర్థి ఎంపీ జగదీశ్వర్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
