మానవత్వాన్ని చాటిన ఆదివాసీ ఉపాధ్యాయులు
ట్రాక్టర్ లోడ్ పడి ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఆదివాసీ ఉపాధ్యాయులు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామ సర్పంచ్ నర్సింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూగూరు వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామపంచాయితీ పరిధిలోని పర్శికగూడెం గ్రామానికి చెందిన పర్శిక శ్రీను-సరితలకు ఆరుగురు సంతానమని, అందులో చివరివాడు కుమారస్వామి 5నెలల క్రితం పర్శికగూడెం గ్రామంలో ట్రాక్టర్ లోడ్ పడి కుమారస్వామికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు. రెక్కాడితేనేగానీ డొక్కాడని స్థితిలో ఉన్న శ్రీను-సరిత దంపతులు కుమారస్వామికి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నారన్నారు. సర్పంచ్ నర్సింహమూర్తి ద్వారా విషయం తెలుసుకున్న ఆదివాసీ ఉపాధ్యాయులు స్పందించి 11400 రూపాయలను బాధితుడి తల్లిదండ్రులకు అందజేశారని తెలిపారు. కుమారస్వామికి వైద్యం చేయించాలంటే 2లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. నిస్సహాయస్థితిలో ఉన్న వీరికి మానవతాదృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయులలో సోలం పుల్లారావు, వాసం లక్ష్మయ్య, శేషాచలం, పీర్ల కృష్ణబాబు ఉన్నారన్నారు.