నిరుపేదల నేస్తం.. ఆపదలో ‘ఆపన్న హస్తం’

– పాలమూరు బీఆర్ఎస్​ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​రెడ్డి

– ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జననేత

– సామాన్యుల కష్టాలు తీర్చే ప్రజా నాయకుడు ‘మన్నె’

– ‘కరోనా’ కోరల నుంచి ప్రజలను కాపాడుకున్న శ్రీనన్న

– ‘మన్నె’ సేవలు.. మహబూబ్​నగర్​కు శ్రీరామ రక్ష

– మరోసారి ఆయనకే పట్టం కడుతామంటున్న ఓటర్లు

– కాంగ్రెస్​, బీజేపీల మధ్య లోకల్, నాన్​లోకల్​ వార్​

– రేవంత్​ రాజకీయంపై పాలమూరు నేతల అసహనం

– ఖంగుతింటున్న అధికారపక్షం.. డైలమాలో కమలం

నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో:

మహబూబ్​నగర్ లో ఓ వైపు భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుంటే, మరోవైపు లోక్​సభ స్థానంలో రాజకీయాలు హాట్​హాట్​గా సాగుతున్నాయి. బీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీల నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2009, 2014, 2019 లో వరుసగా ఈ స్థానంలో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి. 2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక ఈసారి నిరుపేదల నేస్తం.. ‘ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపన్న హస్తం’.. సిట్టింగ్​ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డినే బీఆర్ఎస్ మరోసారి రంగంలోకి దింపింది. పాలమూరు సమస్యలపై పార్లమెంట్​లో గళమెత్తుతూ ఐదేండ్ల కాలంలో నియోజకర్గంలో ఎన్నో సమస్యలను పరిష్కరించిన శ్రీనివాస్​రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక సీఎం రేవంత్​ రెడ్డి సొంత జిల్లా కావడంతో కల్వకుర్తికి చెందిన వంశీచంద్​రెడ్డిని నిలబెట్టి గెలిపించుకోవాలని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ విజయం సాధించి సీఎంకు చెక్​ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

బీసీలే ఈ ఎన్నికల్లో కీలకం..

ఈ నియోజకవర్గంలో 16లక్షల 83వేల మంది ఓటర్లు ఉన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా ప్రధాన పోటీ బీఆర్ఎస్​, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అందులో మహిళా ఓటర్లే 8లక్షల 50వేల మంది. 35ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య కూడా 40శాతానికి పైగా ఉంటుంది. యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. వలస ఓటర్ల సంఖ్య కూడా లక్షకుపైగా ఉంటుంది. మక్తల్, నారాయణపేట, కొండగల్, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. వలస ఓటర్లు.. ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ముదిరాజులు సహా ఇతర బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం అధికం. అందుకే వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్, జడ్చర్ల- నంద్యాల, జడ్చర్ల- మిర్యాలగూడ రైల్వే లైన్, జాతీయ రహదారులు, పరిశ్రమలు, సైనిక్ స్కూల్, కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, పాలమూరు జిల్లాకు జాతీయ విద్యా సంస్థలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఎస్సీల వర్గీకరణ అంశం కూడా ప్రభావం చూపనుంది.

బీఆర్ఎస్​హయాంలో ఆకుపచ్చగా పాలమూరు..

సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైంది. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అసమర్థత వల్ల వెనుకపడేయబడ్డ పాలమూరు ప్రాంతం.. కేసీఆర్ పరిపాలనలో సుభిక్షంగా మారింది. మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డ గులాబీ జెండా.. ఈ గడ్డపై మరోసారి ఎగురుతుందని బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, కొత్త రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన హయంలో సాధించారు. లోక్‌సభలో సుమారు రెండు వందల చర్చల్లో పాల్గొని.. మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారు. ‘ఎంఎస్ఎన్’ ఫౌండేషన్ ద్వారా కరోనా కష్టకాలంలో, ఇతర సమయాల్లో నిరుపేదలకు అండగా నిలిచారు. ‘మన్నె శ్రీనివాస్ రెడ్డి పాలన.. మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్​కు శ్రీరామ రక్షగా క్షేత్ర స్థాయిలో వినబడుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలనే బీఆర్ఎస్ తన ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కేసీఆర్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను చూపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఆరు గ్యారంటీల అమలులో జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. డీకే అరుణ, వంశీచంద్‌ రెడ్డి వలస నాయకులని తాను మాత్రమే స్థానిక అభ్యర్థినంటూ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో క్యాడర్‌, బలమైన ఓటు బ్యాంకు ఉండటం తమకు లాభాన్ని చేకూర్చుతుందని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పర్యటించి పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచారు. గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు.

హామీలే.. ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్​..

తన సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఐదుకు పైగా సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఇప్పటికే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలమూరు న్యాయ యాత్ర పూర్తి చేశారు. పాలమూరు లోక్‌సభ నియోజకవర్గంపై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్‌ క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్, పరిశ్రమల సాధన, ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చడం, ఎస్సీల వర్గీకరణ లాంటి ప్రచారాస్త్రాలను కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. పాలమూరు అభివృద్ధి కావాలంటే మహబూబ్​నగర్ లో కాంగ్రెస్​గెలిపించాలని రేవంత్‌రెడ్డి పదే పదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సారి గెలిచి తీరాలని జేజమ్మ సంకల్పం

బీజేపీ మాత్రం ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో 70వేలపైగా ఓట్ల తేడాతో మహబూబ్‌నగర్‌ స్థానాన్ని కోల్పోయింది. ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. డీకే అరుణను బలమైన అభ్యర్థిగా భావించిన బీజేపీ అధిష్ఠానం ఆమెను మరోసారి బరిలోకి దింపింది. మోదీ గ్యారంటీలు, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి పనులు, గతంలో పాలమూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధిని డీకే అరుణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు దీటుగా బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. పాలమూరు జిల్లాపై డీకే అరుణకు మంచి పట్టు ఉండటం జనంలో మోడీ చరిష్మా, గెలిస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉండటం డీకే అరుణకు సానుకూల అంశాలు కానున్నాయి.

కాషాయ పార్టీకి దూరమవుతున్న బీసీ నేతలు

అయితే, సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ పార్టీ లీడర్​ శాంతికుమార్​కు కాకుండా అరుణకు టికెట్​ ఇవ్వడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన లీడర్లు కొందరు పార్టీ వీడారు. మరికొందరు పార్టీలో ఉన్నా పదవులకు రిజైన్​ చేశారు. అలాగే పార్టీ సీనియర్ ​లీడర్​ఏపీ జితేందర్​రెడ్డి, ఆయన వర్గీయులు ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. బీసీ లీడర్ ​శాంతికుమార్ ​సైలెన్స్ ​మోడ్​లో ఉండడం కొంత మైనస్ ​అయ్యే అవకాశాలున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఇందులో 53 శాతం మంది బీసీలే. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ స్టేట్ ట్రెజరర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత శాంతి కుమారి టికెట్ ఆశించారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు హైకమాండ్ టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. పార్టీకి రాజీనామా చేయకపోయినా.. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్​కు దూరంగా ఉంటున్నారు.

శాంతి కుమార్​కు టికెట్ రాలేదనే అసంతృప్తితో కొందరు బీసీ లీడర్లు పార్టీలోని తమ పదవుల కు రాజీనామా చేసి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపో యారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్​పర్సన్​సరిత బరిలో నిలిచారు. మహిళ, బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన చాలా మంది బీసీ లీడర్లు ఆమెకు మద్దతు పలికారు. పలు సర్వేలు కూడా ఆమె విజయం ఖాయమని తేల్చాయి. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అరుణమ్మ అల్లుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి విజయం సాధించారు. అల్లుడి కోసం అరుణ గద్వాలలో పోటీ నుంచి తప్పుకొని బలహీన మైన అభ్యర్థిని బరిలో నిలపడంతో పాటు ఆమె బహిరంగంగానే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారనే ఆరోపణలు వచ్చాయి. ముక్కోణపు పోటీ జరగకుండా అరుణ కుట్ర పన్నడం వల్లే సరిత ఓడిపోయారనే అభిప్రాయం బీసీ నేతల్లో ఉంది. ఈ రెండు ఘటనలతో అరుణపై బీసీ వ్యతిరేక ముద్ర పడిందని, అందువల్లే ఒక్కొక్క రుగా బీసీ లీడర్లు పార్టీకి దూరమవుతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!