మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు
గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాక అనేక ఇబ్బందులకు గురైతుండగా నర్సంపేట మునిసిపాలిటీ పాలకవర్గం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆ క్యాంపులలో జల్సాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్, ఖానాపురం ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్‌రావు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాకపోవడంతో అందుకు సంబంధించిన మంచినీటి నల్లాల బావితోపాటు వాటర్ ఫిల్టర్ బెడ్‌లను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి మెంబర్ దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రవిందర్‌రావు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రస్తుతం ఉన్న 3వాటర్ ట్యాంక్‌ల ద్వారా మిషన్ భగీరథ నీటి ద్వారా, అలాగే అశోక్‌నగర్ దగ్గర ఉన్న రిజర్వాయర్ ద్వారా ఫిల్టర్ చేసిన మంచినీటిని ప్రజలకు అందించి దాహార్తిని తీర్చాలని తెలిపారు. పాకాలవాగు వద్ద ఉన్న మంచినీటి నల్లాల బావి కూరుకుపోయిందని, గుర్రపుడెక్కతో నిండిపోయి నీరు పూర్తిస్థాయిలో కలుషితమైపోయిందని, ప్రజలు రోగాల భారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీరు రాక ప్రజలు అల్లాడిపోతున్నారని మున్సిపాలిటీ పాలకవర్గ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. వేసవికాలంలో మంచినీరు రాక ప్రజలు అవస్థలకు గురైతుంటే పాలకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మంచినీటి సమస్యను పరిష్కారం చేసి పట్టణ ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ ప్రజలపక్షాన నిలబడి భారీఎత్తున కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్, మాజీ మార్కెట్ చైర్మన్, కౌన్సిలర్ పాలాయి శ్రీనివాస్, కౌన్సిలర్ మెర్గు వరలక్ష్మి సాంబయ్య, మాజీ వార్డు మెంబర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య, నర్సంపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, నర్సంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల చరణ్‌రాజు, నర్సంపేట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, కాంగ్రెస్ నాయకులు దండెం రతన్‌కుమార్, గురిజాల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బండారి మంజుల, పొన్నం నర్సింహారెడ్డి, నర్సంపేట ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ములుకల మనీష్ తదితరులు పాల్గొన్నారు.