Can Happiness Be Learned?
సంతోషాన్ని పట్టుకుందాం!
ప్రస్తుతం ప్రపంచం విచిత్రమైన సందిగ్ధంలో ఉంది. ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ … ఇలా అన్నీ ఉంటాయి కానీ, ముఖంపై చిరునవ్వు ఉన్న వాళ్లని వేళ్ల మీద లెక్కించే రోజులు వచ్చాయి.
ప్రతీ అంశాన్ని గణాంకాలతో, సులభంగా అర్థం అయ్యేలా చెప్పడం నేటి ట్రెండ్. సంతోషాన్ని కూడా అచ్చం అలాగే 50-40-10ని ‘హ్యాపీనెస్ రూల్’గా చెబుతున్నారు. ఈ నియమం ప్రకారం… యాభై శాతం సంతోషాన్ని మన శరీరంలోని జీన్స్ నిర్ణయిస్తాయి. మన చుట్ట్గూ ఉన్న పరిస్థితులు 10 శాతం, ఆ సమయంలో ఉన్న మన మానసిక స్థితిని బట్టి మిగతా 40 శాతం సంతోషం ఆధారపడి ఉంటుందట. ‘ద హౌ ఆఫ్ హ్యాపీనెస్’ పుస్తకంలో సోన్జా ల్యూబోమిర్కీ తొలిసారిగా ఈ నియమాన్ని ప్రతిపాదించారు. అప్పటి నుంచి చాలామంది హ్యాపీనెస్‌ను ఈ సూత్రం ఆఽధారంగా పేర్కొంటున్నారు. అంటే ‘జీన్స్, చుట్టూ ఉన్న పరిస్థితులను మనం మార్చలేం కానీ… ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని మార్చుకోగలగడం వల్ల 40 శాతం సంతోషాన్ని సాధించుకోవచ్చు’ అని చెప్పేదే ఈ సంతోషాల సూత్రం. అంటే మన సంతోషాన్ని కూడా మనం నియంత్రించవచ్చన్న మాట. అయితే ఇది శాస్త్రపరంగా నిరూపితమైనది కాదు. కానీ దీని ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
- మన సంతోషాన్ని కొద్ది స్థాయిలో నియంత్రించొచ్చు.
- సాధన ద్వారా సంతోషాన్నీ సాధించవచ్చు.
అందుకే, కొందరు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తుంటారు. మరికొందరు మూతి ముడుచుకుని ఉంటారు. ఎందుకిలా అన్నది కచ్చితంగా చెప్పలేం కానీ, విభిన్న దృక్కోణాల వల్ల కూడా మనలో మార్పులు వస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు.
ఉదాహరణకు జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు కిటికీలోంచి బయటకు చూస్తూ… ఒకరు నేలమీదున్న బురదని చూస్తే, మరొకరు ఆకాశంలోని తారకలను చూస్తూ హాయిని పొందడం లాంటి కథలు వింటూనే ఉన్నాం. మనం ఉన్న పరిస్థితులు, పెరిగిన సంస్కృతి, జీవితంలోని దశలను బట్టి సంతోషం మారుతుందనేది మానసిక నిపుణులు ప్రముఖంగా పేర్కొంటున్నారు
