విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సంకల్ప్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
విద్యార్థులు వారి విద్య విధానాలను అలవర్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
శుక్రవారం మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ నిధి ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి ( సంకల్ప్) ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు.
విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేరుకున్న కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ప్రిన్సిపల్ పూర్ణిమ,ఎన్సిసి స్కౌట్ గైడ్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో విద్యార్థులు రోబోటిక్స్ ఐ ఓ టి, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని అన్నారు.కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా సంభాషించి ఇష్టపూర్వకంగా చదివి భావిభారత పౌరులు కావాలని కోరారు.విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ భయాన్ని సంకోచతత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు సురేష్ రామలింగయ్య ఉపాధ్యాయులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.