
# ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు..
# కొమ్మాల జాతరలో పార్లమెంట్ ఎన్నికల వేడి..
# దుగ్గొండి మండలంలో గిర్నిబావిలో ప్రభ బండ్ల బలబలాలు.
# రాజకీయ నాయకులు,పోలీస్ అధికారుల మధ్య తోపులాట..
# వరంగల్,హన్మకొండ,మహబూబాబాద్ జిల్లాల నుండి తరలిన పార్టీల ప్రభబండ్లు..
# రెండు రోజుల పాటు కొమ్మాలలో ప్రభబండ్ల జోరు..
# జాతరకు పోటెత్తిన లక్షలాది మంది భక్తులు..
# ప్రభబండ్లతో మొక్కులు చెల్లించుకున్న ప్రజలు,రాజకీయ పార్టీలు..
# పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.
# జాతరలో అన్ని సౌకర్యాలు కల్పించాము : ఈఓ శేషగిరి..
నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర రాజ’ కీయంగా’ మారింది. దశాబ్ద కాలం నాటినుండి రాజకీయ పార్టీలకు కొమ్మాల జాతర రాజకీయ వేదికగా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కొమ్మల జాతర వద్ద ఎన్నికల వేడి అద్దం పట్టినట్టు కనిపించింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్,బిఆర్ఎస్,భాజపా,సిపిఎం,ఎంసిపిఐ,పార్టీలకు చెందిన ప్రభబండ్లు ఆయా పార్టీల జెండాలు,లైటింగ్ అలంకరించి డీజే సౌండ్స్,డప్పు చప్పుళ్లు,కొలాటాలతో బలబలాలు నిరూపించుకున్నారు.ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు కార్యకర్తలకు,పోలీస్ అధికారులను తోపులాట జరిగింది.గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర భ్రంహోత్సవాలు నిర్వహణ,
హోలీ పండుగ రోజు మొదలై ఐదవ రోజు రథోత్సవంతో పాటు ఉగాది పండుగా వరకు సాగుతుంది.అసెంబ్లీ టైగర్ గా పేరుపొందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ తో ఆనాటి వరంగల్ జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు రాజకీయ పార్టీల ప్రభ బండ్లతో వారి వారి పార్టీల బల బలాలు నిరూపించుకుంటూ గొడవలకు దారి తీసేది. అదే తరహాలో మొదటి రోజు బండ్లు తిరిగే కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి నుండి మంగళవారం సాయంత్రం వరకు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభబండ్లతో పాటు బిఅర్ఎస్ ,భాజపా,ఎంసిపీఐ,సిపిఎం పార్టీల ప్రభబండ్లు ప్రదర్శన చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా త్వరలో జరిగే ఎన్నికల ప్రస్తావన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఎన్నికల పట్ల నిత్యం చర్చించుకుంటున్న తరుణంలో వరంగల్, హన్మకొండ,మహబూబాబాద్ జిల్లాల నుండి అందులో ముఖ్యంగా నర్సంపేట,పరకాల నియోజకవర్గాల నుండి సుమారు వందలాదికి పైగా వివిధ పార్టీల రాజకీయ ట్రాక్టర్ వాహనాల,ఎద్దుల ప్రభబండ్లు,భక్తుల ప్రభబండ్లు రెండు రోజుల పాటు కొనసాగగా వరంగల్ జిల్లా పరిధిలో నర్సంపేట,పరకాల నియోజవర్గాలలో ,కొమ్మాల జాతరలో ఎన్నికల వేదెక్కింది.ఈ సందర్భంగా జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వరంగల్ డిసిపి రవీందర్,నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్,మామునూరు ఏసిపి తిరుపతి ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.నర్సంపేట నియోజకవర్గం నుండి జాతరకు వచ్చే ప్రభబండ్లను దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,భాజపా ప్రభబండ్లను ప్రారంభం చేశారు.భాజపా నర్సంపేట చేరికల కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవి కుమార్ ఆయా పార్టీల బాధ్యులు ప్రభబండ్లను ప్రారంభం చేశారు.
# ఇతర జిల్లాల నుండి తరలి వచ్చిన రాజకీయ ప్రభ బండ్లు…
కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర వారం రోజుల పాటు భారీ సంఖ్యలో జరుగనున్న నేపథ్యంలో జాతరలో బండ్లు తిరుగుడు కార్యక్రమం ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ తరుణంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,భాజపా జిల్లా అధ్యక్షులు రవి కుమార్
లకు సంబందించిన వివిధ పార్టీల ప్రభబండ్లు, చెందిన ప్రభబండ్లు,భాజపాకు చెందిన నాయకుడు డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి అధ్వర్యంలో ప్రభబండ్లను తరలిరావడంతో సందడి నెలకొన్నది.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు అల్లం బాల కిషోర్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించగా అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
# రెండు రోజుల పాటు ప్రభబండ్ల జోరు…
వారం రోజుల కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్బంగా మొదటి రోజు బండ్లు తిరిగే సందర్భంగా హోలీ పండుగ రోజు రాత్రి నుండి జరిగే కార్యక్రమం రెండు రోజుల పాటు మొత్తం ప్రభబండ్ల జోరు కొనసాగింది.ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులు రాజకీయ ప్రభబండ్లను ఆనందంగా తిలకించారు.
# ప్రభబండ్లతో మొక్కులు చెల్లించుకున్న ప్రజలు…
గత ఐదు దశాబ్దాల నుండి సాగుతున్న కొమ్మాల జాతరలో భక్తులు ఎడ్ల ప్రభబండ్లు,మేకల బండ్లు,గుర్రపు బండ్లు,ట్రాక్టర్ ప్రభబండ్లతో వివిధ పార్టీల జెండాలతో పలు రూపాల్లో అలంకరించి ఆయా పార్టీల నాయకులు, ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు.
# పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు…
కొమ్మాల లక్ష్మి నరసింహస్వామి జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వరంగల్ డిసిపి రవీందర్,నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్, మామునూరు ఏసిపి తిరుపతి,గీసుకొండ సీఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు.ఆదివారం రాత్రి నుండి మంగళవారం వరకు సుమారు 3 రోజుల పాటు జాతరను వారి అధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు.
భారీ ఎత్తున వాహనాలు ,ఎడ్లబండ్లు రావడం,ఆర్టీసి బస్సులు ప్రధాన రహదారిపై సుమారు 10 గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లియర్ చేశారు.కాగా కొన్ని చోట్ల రాజకీయ నాయకులు కార్యకర్తలకు పోలీసులకు తేలికపాటి తోపులాటలు జరిగాయి. జాతరలో శ్రీ లక్ష్మినరసింహస్వామీ దర్శనం కోసం సోమవారం,మంగళవారం గంటల తరబడి పట్టింది.
# జాతరకు పోటెత్తిన లక్షలాది మంది భక్తులు..
హోలిరోజు మొదలైన కొమ్మాల లక్ష్మి నరసింహస్వామీ దర్శనం కోసం వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్,కరీంనగర్ ఇతర జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు.
# ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు..
త్వరలో దేశ వ్యాప్తంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రాజకీయ ప్రభబండ్లు నిషేధించారు.ముందస్తుగానే డిసిపి రవీందర్,మామునూరు ఏసిపి తిరుపతి,నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్ లు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ముందస్తు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ జెండాలు,డీజేలు నిషేధించారు.ఐనప్పటికీ వారి ఆదేశాలను ఆయా పార్టీల నాయకులు తుంగలోతొక్కారు.
# ఎన్నికల కోడ్ ఉల్లంఘన పట్ల చర్యలు తీసుకునేనా..?
ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నప్పటికీ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభబండ్లతో పాటు బిఅర్ఎస్ ,భాజపా,ఎంసిపీఐ,సిపిఎం పార్టీల ప్రభబండ్లు ప్రదర్శనలు ఆయా పార్టీల బల ప్రదర్శన కోసం చేసుకున్నట్లు ఉందని ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అని పలువురు మేధావులు,రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నప్పటికీ కోడ్ ఉల్లంఘించిన ఆయా రాజకీయ పార్టీల పై చర్యలు తీసుకునేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
# జాతరలో అన్ని సౌకర్యాలు కల్పించాము : ఈఓ శేషగిరి..
ఎండోమెంట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం జాతర ఉత్సవాలలో దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని దేవాలయ ఈఓ శేషగిరి తెలిపారు.నూతనంగా మరుగుదొడ్లు నిర్మించామని అవి ఇప్పుడు వాడకంలోకి వచ్చాయని చెప్పారు.