కవిత మైండ్ గేమ్!ఫస్ట్ టార్గెట్ రెడీ!

కవిత మైండ్ గేమ్!ఫస్ట్ టార్గెట్ రెడీ!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు కారు పార్టీకి కవచంలా ఉన్న ఆమె.. ఇప్పుడు అదే కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు.

బీఆర్ఎస్ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాను కొత్త పార్టీని పెడుతున్నానని ప్రకటించిన కవిత… తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సేనని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తనను కలిశారని ఆమె చెప్పారు. అయితే తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తాను ఇప్పుడప్పుడే వెల్లడించబోనని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ మాజీలు తనను కలుస్తూనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను పార్టీని ప్రకటించగానే… తనను కలిసిన బీఆర్ఎస్ నేతలంతా తన పార్టీలోకే వస్తారని కూడా ఆమె తెలిపారు.

ఇక తన సోదరుడు, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి కూడా ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ఇటీవలే కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన కవిత… అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారని, ఈ క్రమంలో ఆయన ప్రజలను కలుసుకునేందుకు పాదయాత్ర అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు.

ఇక రాజకీయాల్లో తన తొలి ప్రత్యర్ధి బీఆర్ఎస్సేనని చెప్పిన వైనానికి గల కారణాలను కూడా కవిత తనదైన శైలిలో వివరించే యత్నం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కారణంగానే తాను తన తొలి రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తనలో ఎలాంటి మార్పు రాబోదని ఆమె వెల్లడించారు. ఈ నెల 25న తన పార్టీ పేరుతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తానని కవిత గత నెలలోనే ప్రకటించారు. మరి కవిత పార్టీ ప్రారంభం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎంతగా ఇబ్బంది పడుతుందన్నది చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version