కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పూజలు నిర్వహించి స్విచాన్ చేసి వెట్ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్టంగా 2.66మెగావాట్ల నుండి మొదలు 26, 40, 106…ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న..బాహుబలిగా పిలిచే 139మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. నందిమేడారం పంపుహౌజ్‌లో 124.4మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్ పూర్తి చేసుకొని, వెట్ రన్ కు సిద్ధంగా ఉన్నాయి.