కక్కిస్తారా…తప్పిస్తారా…?
వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో క్యాంపు పేరిట లక్షల రూపాయలను అక్రమంగా మెక్కేశారని, దొంగల పేర్లతో దొంగ అకౌంట్లు సేకరించి క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టు దొంగతనంగా పేర్లను రాసి లక్షల రూపాయలల్లో అవినీతికి పాల్పడినారని, అవినీతి జరిగిన తీరుపై వెంటనే విచారణ కమిటిని వేసి బాధ్యులను గుర్తించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘంలు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు కమిటినీ వేయకుండా కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
క్యాంపు పేరుతో లక్షల రూపాయలు మాయం
ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ వాల్యుయేషన్ క్యాంపు కార్యాలయంలో దొంగబిల్లులు పెట్టి, భాయ్స్‌గా పనిచేయకున్నా పనిచేసినట్టుగా దొంగపేర్లను రాసి డబ్బులు నొక్కేశారని తెలుస్తోంది. డిఐఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అకౌంట్లలో, అందులోనే పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల అకౌంట్లలో, పింగిళి మహిళ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సంబందించిన వారి అకౌంట్లలో దొంగదారిన డబ్బులు జమచేశారని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వొడపెల్లి మురళి ఆరోపించారు. అక్రమంగా సుమారుగా 90 మంది అకౌంట్లలో వేశారని ఒక్కో అకౌంట్లో రూ.8.540 నుండి రూ.16.653 వరకు వేశారని, వీటిని తిరిగి సూపరింటెండెంట్ సాయబాబా కలెక్ట్ చేసుకొని ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేశారని, నొక్కేసిన డబ్బులను కలిసి పంచుకున్నారని ఆరోపించారు.కేవలం సుతిల్ దారాలకు 50వేల రూపాయలు అయినట్లు బిల్లులు పెట్టారంటే ఇంకా స్టేషనరీ పేరుతో ఎంతెంత నొక్కేసి వుంటారో అర్ధం చేసుకోవచ్చని సంఘాల నాయకులు అంటున్నారు.
కార్యాలయ సిబ్బంది ఆఫీస్ భాయ్స్ ఎలా అవుతారు?
డిఐఈవో కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగుల అకౌంట్లలలో కూడా క్యాంపు ఆఫీసులో మూటలు మోశారని, పేపర్ బండిల్స్‌లు అందించారని ఆఫీస్ భాయ్స్‌గా పనిచేశారని వారి అకౌంట్లలలో డబ్బులు వేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజువారి కూలీలు ఎలా అవుతారో? డిఐఈవో లింగయ్య, సూపరింటెండెంట్ సాయిబాబాలే ప్రజలకు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయంలో అటెండర్ నుండి ప్రభుత్వ ఉద్యోగి వరకు ఎవరిని వదలకుండా అందరి అకౌంట్లలో రోజువారి కూలీల మాదిరిగా, క్యాంపుభాయ్స్ పేరిట అకౌంట్లలో డబ్బులు చెక్కుల ద్వారా వివిద బ్యాంక్‌లల్లో జమ చేశారు. అవకతవకలపై, అవినీతిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటిని వేసి ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.