ఝరాసంగం రోడ్డు ధ్వంసం: ప్రయాణికుల ఆందోళన
*జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రం వరకు వానంపల్లి నుండి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి, కంకర తేలడంతో ప్రయాణికులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు ఈ రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు కొత్తగా రోడ్డు వేసి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు
గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి మారలేదని, సర్పంచ్లు మారుతున్నా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 26 నెలలు పాలించినా పరిస్థితి మారలేదని, జహీరాబాద్ ఎంపీ మరియు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, పనికి వెళ్లే కూలీలు రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బడంపేట్ సర్పంచ్లు కూడా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రింగ్ రోడ్లు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఓట్లు మాత్రమే కావాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ప్రజల ఇబ్బందులను చూడాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.కోహిర్ మండలంలో రోడ్లు బాగుచేయాలని లేదా కొత్త రోడ్లు వేయాలని కోరుతున్నారు.
