గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ధరణి తప్పులను భూమాత డొల్ల తనాన్ని ఎత్తి చూపుతూ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9,2024 న, ఉదయం 10 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు కార్యక్రమం కు సంబందించిన కరపత్రంను గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా తెలంగాణ రైతు-కూలీ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్ 9,2023న ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి దాదాపు సంవత్సరం కావస్తుంది. కానీ మూడు విడుతలుగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి కేవలం 40% మందికి మాఫీ చేసి మిగతా రైతులను నిలువునా ముంచారు . రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ 49,500 కోట్లు రూపాయలు అంచనా వేయగా దాన్ని 31 వేల కోట్లకు కుదించారన్నారు.చివరికి 17869.26 కోట్లు మాత్రమే రద్దు చేశారు. ఈ విధానం రైతులను నిలువునా మోసపరచడం తప్ప మరొకటి కాదన్నారు. రైతులకు పంట రుణాల మాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. రైతాంగానికి తక్షణమే ఇవ్వాలన్నారు. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. పత్తి, వరి తదితర ధాన్యాలు పండించిన రైతులను గ్రామాల్లో దళారీలు మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీలపై అందించాలని, వ్యవసాయ రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలని, పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే గత శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పలు వాగ్దానాలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఒక సంవత్సరము కావస్తున్నప్పటికీ ఇంతవరకు ధరణి పోర్టల్ ను ఏ సముద్రంలో పడేసింది లేదనీ,సంపూర్ణ ప్రక్షాళన చేసింది లేదనీ ఎద్దేవా చేశారు. రైతు-కూలీ భరోసా, ధాన్యం పంటల బోనస్, నీటి మూటలుగానే మిగిలిపోయాయని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, నూతనంగా రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని, రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15000 రూపాయలు అందించాలని,కవులు రైతులకు రుణమాఫీని, రైతు భరోసాను అందించాలని, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ చెల్లించాలని, ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళనకు ఫార్మా కంపెనీలకు పొసగదని అంటూ, లగచర్ల ఘటనపై ప్రజా కమిటీ ఇచ్చే విచారణకు ఆదేశించాలని ఫార్మా అనుమతులన్నీ రద్దుచేసి హైదరాబాద్ మహానగరం తో పాటు, సారవంతమైన తెలంగాణ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు- కూలీ పోరాట సమితి నాయకుడు మోకాళ్ళ కుమార్ అన్న వివిధ ప్రజాసంఘాలు నాయకులు ఈసం కృష్ణన్న, ముక్తి సత్యం, ఈసం పాపారావు, గుంపిడి వెంకటేశ్వర్లు, కొమరం శాంతయ్య, చంద్రయ్య దొర, వాగపోయిన సాగరన్న, ఈసం ఉదయ్, గొల్లపల్లి రమేష్, పునేం శ్రీను, మోకాళ్ళ వీరస్వామి,సోలం సతీష్ తదితరులు పాల్గొన్నారు.